ఎన్నాళ్లో వేచిన ఉదయం... ‘టాక్సీవాలా’ | Taxiwaala Silver film with cinematography Priyanka Jwalakar is introduced | Sakshi
Sakshi News home page

తెలుగింటి అమ్మాయి!

Published Sat, Nov 17 2018 11:46 PM | Last Updated on Sun, Nov 18 2018 1:14 PM

Taksivala Silver film with cinematography Priyanka Jwalakar is introduced. - Sakshi

‘టాక్సీవాలా’ సినిమాతో వెండితెరకు పరిచయమవుతోంది ప్రియాంక జవల్కర్‌. మరాఠీ మూలాలు ఉన్న ప్రియాంక పుట్టి పెరిగింది అనంతపురంలో. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. 
ఈ చక్కనిచుక్క గురించి కొన్ని ముచ్చట్లు...

ఫ్యాషన్‌ డిజైనర్‌!
‘టాక్సీవాలా’ షూటింగ్‌ సమయంలో రకరకాల టిప్స్‌ ఇచ్చి తనలో ఉన్న బెరుకును పోగొట్టాడట విజయ్‌ దేవరకొండ. ‘స్టోరీనే హీరో’ అని కూడా చెప్పాడట. సి.జి కోఆర్డినేషన్, ఫ్యాషన్‌ డిజైన్‌లోనూ ఒక చెయ్యి వేసిందట ప్రియాంక. అనంతపురంలో ఇంజనీరింగ్‌ తరువాత నిఫ్ట్‌లో డిప్లొమా పూర్తిచేసింది. కాబట్టి డిజైనింగ్‌ ఆమెకు కొత్తేమీ కాదు.

ఒక ప్రయత్నం...
సినిమాల్లో నటించాలనేది తన చిన్నప్పటి కల. తన మనసులో మాట పైకి చెబితే స్నేహితులు వెక్కిరిస్తారేమోననే భయంతో ఆ కోరిక  రహస్యంగానే ఉండిపోయింది. సరదాగా  షార్ట్‌ఫిల్మ్స్‌లో నటిస్తున్న కాలంలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది.‘సినిమాల్లో మాత్రం ఎందుకు నటించకూడదు!’ అనుకుంది.చిన్నప్పుడు మనసులో అనుకున్న కోరిక బయటికి వచ్చి తొందరపెట్టింది. ‘‘ఒక సీరియస్‌ ప్రయత్నం చేసిచూద్దాం. ఒక సంవత్సరంలో వర్కవుటైతే ఓకే. లేకపోతే ఇక సినిమాల పేరుతో టైమ్‌ వృథా చేయవద్దు’’ అనుకొని రంగంలోకి దిగింది. యాక్టింగ్స్‌ కోర్సు కూడా చేసింది.

హైపర్‌
‘టాక్సీవాలా’లో జూనియర్‌ డాక్టర్‌ అనుగా ప్రియాంక  నటించింది. ప్రియాంక ఇంట్రావర్ట్‌. తక్కువ మాట్లాతుంది. ఎక్కువ ఫ్రెండ్స్‌ లేరు. అలాంటిది ఈ సినిమాలో ఎక్స్‌ట్రీమ్‌ ఆపోజిట్‌ పాత్రలో నటించాల్సి వచ్చింది. అను, ప్రియాంకలా కాదు...ఎక్స్‌ట్రీమ్‌ హైపర్‌. పార్టీయింగ్, పబ్బింగ్, అందరితో కలిసిపోతుంది. సహజమైన స్వభావం నుంచి తనది కాని స్వభావంలోకి పరాకాయ ప్రవేశం చేయడం కష్టమే. అయినా సరే, ‘అను’గా మంచి మార్కులే కొట్టేసింది. ‘మెచ్యూర్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌’ అని డైరెక్టర్‌తో అనిపించుకుంది.

టెన్షన్‌ టెన్షన్‌!
యాక్టింగ్‌ కోర్సు పూర్తి చేసిన తరువాత గీతా ఆర్ట్స్‌కు తన ఫొటోలను పంపింది. మూడు నెలల తరువాత లుక్‌టెస్ట్, టెస్ట్‌షూట్, ఫొటోషూట్‌ జరిగింది. ఒకటే టెన్షన్‌...ఒకానొక టైమ్‌లో అయితే...‘‘నాకు వద్దు బాబోయ్‌ ఈ ఆఫర్‌’’ అని కూడా అనుకుందట.సరిగ్గా ఆ సమయంలోనే ఆఫర్‌ డోర్‌ బెల్‌ నొక్కింది. అలా ‘టాక్సీవాలా’లో హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయింది.

ఎన్నాళ్లో వేచిన ఉదయం!
మూవీ పైరసీ కావడం, లీకవ్వడం, ‘ఈ పోర్షన్‌లో యాక్టింగ్‌ బాగా చేశారు’ ‘ఈ సీన్‌లో బాగున్నారు’ అంటూ తనకే మెసేజ్‌లు, స్క్రీన్‌షాట్‌లు రావడం చూసి మొదట్లో కంగారు పడిందట ప్రియాంక. దీనికితోడు ‘థియేటర్లలో మూవీ రిలీజ్‌ అవ్వట్లేదట కదా’లాంటి మాటలు తనను బాధించాయి. దీని గురించి ఎలా ఉన్నా ఎన్నాళ్లో వేచిన ఉదయంలా ‘టాక్సీవాలా’ ప్రియాంక పెదాలపై చిరునవ్వును మెరిపించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement