టీవీక్షణం: దెయ్యపు సీరియళ్లు
దెయ్యం... ఈ పేరు చెబితేనే కొందరికి భయం. కానీ టీవీ వాళ్లకు దెయ్యమంటే మహా ప్రీతి. ఎందుకంటే, అది సీరియళ్లను సక్సెస్ చేస్తుంది. టీఆర్పీని పెంచుతుంది. కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. అందుకే దెయ్యాల కథనాలకు టెలివిజన్ పెద్ద పీటే వేస్తోంది. రాత్రి, అర్ధరాత్రి, అన్వేషిత, తులసీదళం, మర్మదేశం... హారర్ ఎలిమెంట్ ఉంటే చాలు... ఆ సీరియల్ సూపర్ హిట్టయినట్టే. తెలుగులోనే కాదు... హిందీలో కూడా హారర్ సీరియల్స్‌కి టీఆర్పీ ఎక్కువే ఉంటుంది. అన్‌హోనీ, ఆహట్, హారర్ నైట్స్, అనామిక, ఫియర్‌ఫైల్స్ లాంటివి ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెట్టడంలో విజయం సాధించాయి. అసలెందుకు దెయ్యమంటే ఇంత క్రేజ్!
గమనిస్తే... మొదట్నుంచీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో హారర్‌కి చాలా ప్రాధాన్యత ఉందని అర్థమవుతుంది. సినిమా వాళ్లు దెయ్యాన్ని ఓ రేంజ్‌లో ఉపయోగించుకున్నారు.
పున్నమిరాత్రి, రాత్రి, జగన్మోహిని, దెయ్యం, కాష్మోరా, కాంచన వంటి తెలుగు సినిమాలు... మహల్, భూత్, రాజ్, 1920 లాంటి హిందీ చిత్రాలు... ఈవిల్‌డెడ్, ఎగ్జార్సిస్ట్, అలోన్, ద గ్రడ్జ్, డార్క్ వాటర్ లాంటి హాలీవుడ్ చిత్రాలు విజయఢంకా మోగించాయి. ఇప్పటికీ ఆ తరహా చిత్రాలను తీస్తూనే ఉన్నారు దర్శకులు. దెయ్యాలు లేవనే వారి సంఖ్య పెరుగుతూ ఉన్నా... దెయ్యాల సినిమాలు చూసేవారి సంఖ్య మాత్రం తరగడం లేదు. అందుకే ఇప్పటికీ మన సినిమాలను దెయ్యాలు ఆవహిస్తూనే ఉన్నాయి. సీరియల్స్‌ని దెయ్యాలు పట్టి పీడించడానికి కూడా కారణం అదే!
అయితే ఈ హారర్ ఎలిమెంట్‌తో జనాన్ని అలరించాలనుకోవడం కరెక్టేనా అన్న చర్చ ఎంతో కాలంగా జరుగుతోంది. నిర్మాతలు, దర్శకుల దృష్టితో చూస్తే అది కరెక్టే. ఎందుకంటే, వాళ్లకు తమ షోని సక్సెస్ చేసుకోవడం ముఖ్యం. అందుకే వాళ్లు దెయ్యాల్ని విడిచిపెట్టరు. పైగా ‘ప్రేక్షకులు చూస్తున్నప్పుడు మేం తీయడంలో తప్పేముంది’ అనేది ‘ఆహట్’ సీరియల్ దర్శకుడు బీపీ సింగ్ మాట. కానీ కొందరు మాత్రం... హారర్ సీరియళ్లు, ప్రోగ్రాములు ఎక్కువైపోయాయి, వీటి వల్ల భయం కలుగుతోంది, గుండె జబ్బులొచ్చేలా ఉన్నాయి అంటున్నారు. అంత భయపడేవారు చూడకూడదు అంటారు దర్శకులు. దాంతో ఈ చర్చ ఎప్పటికీ అంతమే కావడం లేదు.
ఆలోచిస్తే రూపకర్తలు చెప్పే మాటే కరెక్టనిపిస్తుంది. ఎందుకంటే, మా సీరియల్ చూడండి అని ఏ దర్శకుడూ ప్రేక్షకులను బలవంతం చేయడం లేదు. కాబట్టి భయప డేవాళ్లు చూడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆసక్తి ఉన్నవాళ్లు చూడాలి. భయపడేవాళ్లు మానాలి. అది మానేసి హారర్ అవసరమా అంటే ఎలా? అది కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగమే కదా!