టీవీక్షణం: అత్తలు ‘అమ్మ’లవుతున్నారు!
సీరియల్స్‌కి బాగా అచ్చొచ్చిన ఫార్ములా ఏంటో చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. అత్తాకోడళ్ల కాన్సెప్ట్ అని! అది కురిపించినన్ని కాసులు మరేదీ కురిపించలేదు. హీరోని పెళ్లి చేసుకుని హీరోయిన్ అత్తారింట అడుగు పెట్టడం, అత్తగారితో తగవులు మొదలవడం, అత్తగారు ఎత్తులు వేయడం, కోడలు చిత్తు చేయడం, కడగండ్లు, కన్నీళ్లు... యేళ్లుగా ఇదే సబ్జెక్టుని తిప్పి తిప్పి తీస్తున్నారు దర్శకులు. కోడల్ని హింసించే విధానంలో ఎన్ని కొత్త విధానాలుంటే, ఆ సీరియల్ అంత పెద్ద హిట్టు.
మొన్నమొన్నటి వరకూ ఇదే కొనసాగింది. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ మారుతోంది. అత్త ‘అమ్మ’వుతోంది. కోడల్ని కూతురిలా చూస్తోంది. ఒకటో రెండో సీరియళ్లు కాదు... చాలా సీరియళ్లలో అత్తాకోడళ్ల మధ్య ఎంతో అందమైన అనుబంధాన్ని చూపిస్తున్నారు. మన తెలుగులో ఇంకా అంత లేదు కానీ... హిందీ సీరియళ్లలో చాలా వరకూ అత్తాకోడళ్లను తల్లీకూతుళ్లంత అత్మీయతతో చూపిస్తున్నారు.
‘బాలికావధు’లో కళ్యాణీదేవి (సురేఖాసిక్రీ), సుమిత్ర (స్మితాభన్సాల్), హీరా (సోనాల్ ఝా)లు ఉత్తమ అత్తలుగా అలరిస్తున్నారు. మొదట్లో అత్యంత క్రూరురాలిగా కనిపించిన కళ్యాణీదేవి పాత్ర తర్వాత ఉదాత్తంగా, ఆదర్శవంతంగా మారిపోయింది. ఇక సుమిత్ర అయితే... చిన్ననాడే తన ఇంట కోడలిగా అడుగుపెట్టిన ఆనందిని తల్లిలా పెంచి పెద్ద చేస్తుంది. ‘ససురాల్ సిమర్‌కా’లో మాతాజీ (జయతి భాటియా), సుజాత (నిషిగంధ)లు కూడా మనసున్న అత్తలుగా మెప్పిస్తున్నారు. ‘క్యా హువా తేరా వాదా’లో సుహాసి (అపరా మెహతా), ‘మధుబాల’లో రాధ (షామా దేశ్‌పాండే), ‘పరిచయ్’లో వీణ (అల్కా అమీన్), ‘బానీ’లో మన్‌ప్రీత్ (నికితా ఆనంద్)లు కోడళ్ల కోసం కొడుకులనే ఎదిరించారు. ఇంకా ‘దిల్‌సే దియా వచన్’లో డాక్టర్ కళ్యాణి (నీనా గుప్తా), ‘బడే అచ్చే లగ్‌తేహై’లో షిప్రా (రేణుక ఇస్రానీ), ‘సంస్కార్’లో అనసూయ (అరుణా ఇరానీ), పారుల్ (సోనాలీ సచ్‌దేవ్), ‘ఎక్ నయీ పెహ్‌చాన్’లో శారద (పూనమ్ థిల్లాన్), ‘యే రిష్తా క్యా కెహ్‌లాతా హై’లో గాయత్రి (సోనాలీ వర్మ), ‘ససురాల్ గెందా ఫూల్’లో శైలజ (సుప్రియ పిగ్లోంకర్)... ఇలా అమ్మలను మించిన అత్తల లిస్టు పెద్దదే. తెలుగులో ఇంతమంది కాకపోయినా, కొన్ని సీరియళ్లలో మంచి అత్తలు కనిపిస్తున్నారు. ‘మమతల కోవెల’లో శృతి, ‘కలవారి కోడళ్లు’లో హరితలు మనసున్న అత్తలే.
అత్తాకోడళ్లంటే కొట్టుకుంటూనే ఉంటారనీ, ఇంటిని రణరంగం చేస్తుంటారనీ దశాబ్దాలుగా చెబుతూ వచ్చిన సీరియళ్లు... ఇప్పుడు అత్తలోనూ అమ్మ ఉంటుందనీ, కూతురిలా చూస్తే కోడలు అత్తని నెత్తిన పెట్టుకుంటుందనీ చెబుతున్నాయి. సీరియళ్లు మహిళల మీద ఎంత ప్రభావం చూపుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి వాటిని ఇలా మంచి ఆలోచనలను రేకెత్తించి, మమతానురాగాలను పెంపొందించి, బంధాలను బలపరిచే విధంగా తీర్చిదిద్దడం నిజంగా మంచి పరిణామమే!