TVeekshanam
-
టీవీక్షణం: అత్తలు ‘అమ్మ’లవుతున్నారు!
సీరియల్స్‌కి బాగా అచ్చొచ్చిన ఫార్ములా ఏంటో చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. అత్తాకోడళ్ల కాన్సెప్ట్ అని! అది కురిపించినన్ని కాసులు మరేదీ కురిపించలేదు. హీరోని పెళ్లి చేసుకుని హీరోయిన్ అత్తారింట అడుగు పెట్టడం, అత్తగారితో తగవులు మొదలవడం, అత్తగారు ఎత్తులు వేయడం, కోడలు చిత్తు చేయడం, కడగండ్లు, కన్నీళ్లు... యేళ్లుగా ఇదే సబ్జెక్టుని తిప్పి తిప్పి తీస్తున్నారు దర్శకులు. కోడల్ని హింసించే విధానంలో ఎన్ని కొత్త విధానాలుంటే, ఆ సీరియల్ అంత పెద్ద హిట్టు. మొన్నమొన్నటి వరకూ ఇదే కొనసాగింది. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ మారుతోంది. అత్త ‘అమ్మ’వుతోంది. కోడల్ని కూతురిలా చూస్తోంది. ఒకటో రెండో సీరియళ్లు కాదు... చాలా సీరియళ్లలో అత్తాకోడళ్ల మధ్య ఎంతో అందమైన అనుబంధాన్ని చూపిస్తున్నారు. మన తెలుగులో ఇంకా అంత లేదు కానీ... హిందీ సీరియళ్లలో చాలా వరకూ అత్తాకోడళ్లను తల్లీకూతుళ్లంత అత్మీయతతో చూపిస్తున్నారు. ‘బాలికావధు’లో కళ్యాణీదేవి (సురేఖాసిక్రీ), సుమిత్ర (స్మితాభన్సాల్), హీరా (సోనాల్ ఝా)లు ఉత్తమ అత్తలుగా అలరిస్తున్నారు. మొదట్లో అత్యంత క్రూరురాలిగా కనిపించిన కళ్యాణీదేవి పాత్ర తర్వాత ఉదాత్తంగా, ఆదర్శవంతంగా మారిపోయింది. ఇక సుమిత్ర అయితే... చిన్ననాడే తన ఇంట కోడలిగా అడుగుపెట్టిన ఆనందిని తల్లిలా పెంచి పెద్ద చేస్తుంది. ‘ససురాల్ సిమర్‌కా’లో మాతాజీ (జయతి భాటియా), సుజాత (నిషిగంధ)లు కూడా మనసున్న అత్తలుగా మెప్పిస్తున్నారు. ‘క్యా హువా తేరా వాదా’లో సుహాసి (అపరా మెహతా), ‘మధుబాల’లో రాధ (షామా దేశ్‌పాండే), ‘పరిచయ్’లో వీణ (అల్కా అమీన్), ‘బానీ’లో మన్‌ప్రీత్ (నికితా ఆనంద్)లు కోడళ్ల కోసం కొడుకులనే ఎదిరించారు. ఇంకా ‘దిల్సే దియా వచన్’లో డాక్టర్ కళ్యాణి (నీనా గుప్తా), ‘బడే అచ్చే లగ్తేహై’లో షిప్రా (రేణుక ఇస్రానీ), ‘సంస్కార్’లో అనసూయ (అరుణా ఇరానీ), పారుల్ (సోనాలీ సచ్దేవ్), ‘ఎక్ నయీ పెహ్చాన్’లో శారద (పూనమ్ థిల్లాన్), ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’లో గాయత్రి (సోనాలీ వర్మ), ‘ససురాల్ గెందా ఫూల్’లో శైలజ (సుప్రియ పిగ్లోంకర్)... ఇలా అమ్మలను మించిన అత్తల లిస్టు పెద్దదే. తెలుగులో ఇంతమంది కాకపోయినా, కొన్ని సీరియళ్లలో మంచి అత్తలు కనిపిస్తున్నారు. ‘మమతల కోవెల’లో శృతి, ‘కలవారి కోడళ్లు’లో హరితలు మనసున్న అత్తలే. అత్తాకోడళ్లంటే కొట్టుకుంటూనే ఉంటారనీ, ఇంటిని రణరంగం చేస్తుంటారనీ దశాబ్దాలుగా చెబుతూ వచ్చిన సీరియళ్లు... ఇప్పుడు అత్తలోనూ అమ్మ ఉంటుందనీ, కూతురిలా చూస్తే కోడలు అత్తని నెత్తిన పెట్టుకుంటుందనీ చెబుతున్నాయి. సీరియళ్లు మహిళల మీద ఎంత ప్రభావం చూపుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి వాటిని ఇలా మంచి ఆలోచనలను రేకెత్తించి, మమతానురాగాలను పెంపొందించి, బంధాలను బలపరిచే విధంగా తీర్చిదిద్దడం నిజంగా మంచి పరిణామమే! -
టీవీక్షణం: నిజంగానే దూసుకెళ్తోంది!
సీరియళ్లు సెంటిమెంటుతో కట్టిపడేస్తే... గేమ్ షోలు టెన్షన్ పెట్టి అట్రాక్ట్ చేస్తుంటాయి. ఆడేది తాను కాకపోయినా ఆట ఏమైపోతుందో అని ఆతృత పడుతుంటాడు ప్రేక్షకుడు. ఇక తన ఫేవరేట్ సెలెబ్రిటీ ఆడుతుంటే ఆ ఆదుర్దా గురించి చెప్పాల్సిన పని లేదు. ఇదిగో... ప్రేక్షకులలోని ఈ ఆసక్తి కారణంగానే గేమ్‌షోలు సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్నాయి. ‘దూసుకెళ్తా’ కూడా అందుకే విజయాన్ని మూటగట్టుకుంది. యాంకర్‌గా మంచు లక్ష్మికి ఇప్పటికే మంచి పేరుంది. లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి వంటి కార్యక్రమాలతో బుల్లితెర మీద తనదైన ముద్రను వేసింది లక్ష్మి. ఇప్పుడు ‘దూసుకెళ్తా’తో మరోసారి తన సత్తా చూపిస్తోంది. మాటీవీలో ప్రసారమవుతోన్న ఈ షోలో సెలెబ్రిటీలను ఆటగాళ్లుగా మార్చి లక్ష్మి ఆడే తీరు అందరినీ ఆకర్షిస్తోంది. సినీతారల ఫ్యాన్ ఫాలోయింగుకు, ఆమె యాంకరింగ్ స్టైల్ తోడవడంతో షో నిజంగానే దూసుకెళ్తోంది. టీఆర్పీ విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది! మనోజ్ కూడా మొదలెట్టాడోచ్! క్రైమ్ షోలకి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. టీఆర్పీలు పడిపోకుండా ఎప్పుడూ ఒకేలా సాగిపోతున్న షోలు అవేనంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే రోజుకో కొత్త క్రైమ్ షో పుట్టుకొస్తోంది. ముఖ్యంగా హిందీ చానెళ్లలో వీటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే సీఐడీ, క్రైమ్ పెట్రోల్ వంటి షోలతో లాభాలను మూటగట్టుకుంటోన్న సోనీ చానెల్ మరో క్రైమ్ షోకి ఊపిరి పోసింది. అదే... ఎన్కౌంటర్. దేశవ్యాప్తంగా ఇప్పటికి ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. అవి ఎందుకు జరిగాయి, ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయి వంటి వివరాలతో రూపొందింది ఈ షో. దీనికి ప్రధాన ఆక ర్షణ... ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ విశ్లేషణ. ‘సావధాన్ ఇండియా’కి సుశాంత్ సింగ్, ‘క్రైమ్ పెట్రోల్’కి అనూప్ సోనీ, ‘ఇష్క్ కిల్స్’కి విక్రమ్ భట్ హోస్టులుగా వ్యవహరిస్తున్నట్టుగా.. ‘ఎన్కౌంటర్’కి మనోజ్ హోస్ట్ అయ్యారు. అయితే ఇప్పటి వరకూ అనూప్ సోనీ అంత అద్భుతంగా ఎవరూ క్రైమ్ షోలకి యాంకరింగ్ చేయలేదని అందరూ అంటూంటారు. మరి ఆ మాటని మనోజ్ నిజం చేస్తాడో లేక అనూప్‌ని అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పుతాడో చూడాలి! స్ట్రాంగ్ అవుతోంది! సెలెబ్రిటీలు పాల్గొనే కార్యక్రమాల పట్ల ప్రేక్షకులకు యమా క్రేజ్ ఉంటుంది. అందుకే ఏదో ఒక విధంగా సెలెబ్రిటీలను బుల్లితెరకు లాక్కొస్తుంటారు నిర్వాహకులు. అయితే ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నా ఇంటర్వ్యూల తీరు వేరు. సెలెబ్రిటీలు తమ గురించిన వివరాలు తామే చెబుతుంటే వినడానికి ఆడియెన్స్ ఇష్టపడతారు. అందుకే పలు చానెళ్లలో వివిధ రకాలుగా ఇంటర్వ్యూలు వస్తున్నాయి. వాటిలో ఒకటి ‘కాఫీ విత్ కరణ్’. స్టార్ వరల్డ్ చానెల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహిస్తున్నారు. ఇద్దరు సెలెబ్రిటీలను ఒక్క చోటికి చేర్చి, ఇద్దరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేస్తుంటాడు కరణ్. అయితే సెలెబ్రిటీల ఎంపిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అఫైర్ నడుస్తోందని అనుకున్నవారిని, ప్రేమలో ఉన్నవారిని, భార్యాభర్తల్ని, అస్సలు సరిపడక గొడవలు పడుతున్నవారిని తీసుకొచ్చి ఒకచోట కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అంతవరకూ బాగానే ఉంటుంది. కానీ వారి వ్యక్తిగత విషయాల గురించి అతడు అడిగే ప్రశ్నలు ఒక్కోసారి ఆ సెలెబ్రిటీలను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు వారి మధ్య చిచ్చు కూడా పెడుతూ ఉంటాయి. ఫేమస్ డెరైక్టర్ కావడంతో ఎవరూ తనని ఏమీ అనలేరనుకుంటాడేమో ఏ ప్రశ్న పడితే ఆ ప్రశ్న అడిగేస్తుంటాడు. అందుకే ఈ మధ్య ఈ షో పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. సంచలనాలు, వివాదాలు సృష్టించే లక్ష్యంతోనే దీన్ని నిర్వహిస్తున్నారు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ప్రజల అభిమానాన్ని కోల్పోతే ఏ షోకి అయినా తెరపడాల్సిందే. ఈ విషయాన్ని గుర్తించి కరణ్ తన షో తీరును మారుస్తాడో లేదో మరి! -
టీవీక్షణం: వినోదం వికటిస్తోందా?
ఈ మధ్య ఏ చానెల్ పెట్టినా రెండు రకాల కార్యక్రమాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి హారర్ లేక క్రైమ్, రెండోది డ్యాన్స్. ముఖ్యంగా డ్యాన్స్ షోలు బాగా పెరిగిపోయాయి. బూగీవూగీ, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, నాచ్‌బలియే, డ్యాన్సింగ్ సూపర్‌స్టార్, ఝలక్ దిఖ్లాజా అంటూ హిందీ చానెళ్లు... రంగం, ఆట తదితర షోలతో తెలుగు చానెళ్లు సందడి చేస్తున్నాయి. మస్తు మస్తు డ్యాన్సులతో ప్రేక్షకులకు మజాని అందిస్తున్నాయి. అరవై నాలుగు కళల్లో డ్యాన్స్ కూడా ఒకటి. అయితే సంప్రదాయ నృత్యాలు స్జేజి ప్రదర్శనలకే పరిమితమవుతున్నాయి తప్ప, టెలివిజన్ సెట్లలో స్థానం సంపాదించలేకపోతున్నాయి. పాశ్చాత్య నృత్యరీతులు మాత్రమే టీవీ చానెళ్లలో కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర్నుంచి, నడి వయస్కుల వరకూ వెస్టర్న్ డ్యాన్స్‌నే ఎంచుకుంటున్నారు. చానెళ్లవారు కూడా వాటినే ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి ట్రెండుని బట్టి ఇందులో తప్పేమీ లేదు. కానీ ఒక్కోసారి ఈ షోల ధోరణి శృతి మించుతోందనడంలో సందేహం లేదు. డ్యాన్సులు విపరీత పోకడలు పోతున్నాయి. ఆట షో గురించి వచ్చిన వివాదం తెలిసిందే. చిన్న పిల్లలకు పొట్టిపొట్టి దుస్తులు వేసి, ద్వంద్వార్థ ధోరణిగల పాటలకు డ్యాన్స్ చేయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిజానికిది ‘ఆట’లో మాత్రమే లేదు. దాదాపు అన్ని డ్యాన్స్ షోలలోనూ జరుగుతోంది. అలాగని పెద్దవాళ్ల డ్యాన్సులతో ఇబ్బంది లేదా అంటే కూడా ఊ అనలేం. వాళ్లు కూడా సినిమాలకు తీసిపోని విధంగా అసభ్య నృత్యరీతులను ప్రదర్శిస్తున్నారు. పైగా ఈ మధ్య సెలెబ్రిటీ జోడీల మధ్య పోటీలు పెడుతున్నారు. జీవిత భాగస్వామియే కాబట్టి ఫర్వాలేదనుకుంటున్నారో ఏమో గానీ... స్టేజిమీద రొమాన్స్‌ని హద్దు దాటిస్తున్నారు వారు. టీవీ అనేది పిల్లలకు కూడా అందుబాటులో ఉండే వినోద సాధనం. అందుకే ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సరికాదు. అయితే వినోదం ఉండకూడదని కాదు. డ్యాన్స్ షోలని నిషేధించాలనీ కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఆ మధ్య ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌కి వచ్చిన ఓ చిన్నపిల్ల ఐటెమ్ సాంగ్ పాడింది. దాంతో జడ్జిలు ఆ పాప తల్లిని పిలిచి, ఇలాంటివి ప్రోత్సహించి పాప భవిష్యత్తును పాడు చేయకండి, మంచి పాటలు నేర్పించండి అని చెప్పారు. డ్యాన్స్ షోలకు కూడా ఇది వర్తిస్తుంది. పిల్లల మనసులపై చెడు ప్రభావం పడ కుండా ఉండేందుకు కొన్ని పాటల్ని ఎంచుకోకుండా నియంత్రించాలి. పెద్దలకు కూడా కొన్ని రకాల విన్యాసాలు చేయకుండా హద్దులు పెట్టాలి. నియమాలు విధించాలి. లేదంటే చెడును తీసుకెళ్లి స్వయంగా మన పిల్లల చేతుల్లో పెట్టినట్టవుతుంది. ఈమాత్రం జాగ్రత్త కూడా తీసు కోకపోతే వినోదం వికటిస్తుంది. డ్యాన్స్ షో కాస్తా డేంజరస్ షో అవుతుంది! -
టీవీక్షణం: ప్లాస్టిక్ సర్జరీలు ఆపండి!
సీరియల్ మాంచి రసవత్తరంగా సాగిపోతూ ఉంటుంది. ఓ రోజు సడెన్‌గా... ‘నేటి నుంచి ఫలానా పాత్రలో ఆ నటికి బదులు ఈ నటి కనిపిస్తారు’ అంటూ ఇద్దరి ఫొటోలూ తెరమీద ప్రత్యక్షమౌతాయి. నిర్వాహకులు దాన్ని చాలా సింపుల్‌గా చెప్పేస్తారు. కానీ ప్రేక్షకులు దాన్ని అంత ఈజీగా అంగీకరించలేరన్నది మాత్రం వాస్తవం! ‘మొగలిరేకులు’లో లిఖిత స్థానంలో కరుణ రావడం ప్రేక్షకులకు పెద్ద షాక్. అంతకుముందు సెల్వస్వామి పాత్రలోకి సెల్వరాజ్ బదులు రవివర్మ, కీర్తన పాత్రలో మేధకు బదులు మరో నటి వచ్చారు. అలాగే ‘అనుబంధాలు’ మీనాతో మొదలైతే, ఇప్పుడు సుహాసిని ఉంది. గతంలో ‘చక్రవాకం’ నుంచి ఇంద్రనీల్ తప్పుకుంటే జాకీ వచ్చాడు. ‘స్రవంతి’గా మీనా కొన్నాళ్లు మెప్పించాక లక్ష్మి వచ్చింది. కళ్యాణి ‘ఆటోభారతి’నంటూ వస్తే, తర్వాత మోనిక స్టీరింగ్ చేతబట్టింది. ఎందుకిలా మారిపోతున్నారు? తెలీదు. ఏం జరిగిందో అర్థం కాదు. అంతవరకూ ఒకరిని చూసి, ఆ రోల్లో ఇంకొకరిని చూడ్డం ఇష్టం ఉండకపోవచ్చు. కానీ చూడాలి అంతే. ‘‘కొందరు పాత్రలో ఒదిగిపోతారు. వాళ్లను చాలా ఇష్టపడతాం. సడెన్‌గా మరొకరిని తెచ్చిపెడితే సొంతవాళ్లు దూరమైనంత బాధ కలుగుతుంది’’ అని ఓ ప్రేక్షకురాలు అన్నారంటే... నటీనటుల మార్పు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చదని అర్థమవుతోంది. నిజానికిది కొత్తగా వచ్చిందేం కాదు. ‘పవిత్రబంధం’లో గాయత్రి హీరోయిన్. ఆమెకు డెలివరీ టైమ్ కావడంతో చేయలేనంది. ఏం చేయాలో అర్థం కాని దర్శకుడు హీరోయిన్‌కి యాక్సిడెంట్ చేయించి, ముఖం గాయపడినట్టు చూపించి, ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టుగా కవరింగ్ ఇచ్చి, గాయత్రి ప్లేస్‌లో యమునని ప్రవేశపెట్టాడు. అప్పట్నుంచి ఎవరినైనా మార్చాల్సి వస్తే, ప్రమాదంలో పడేసి ప్లాస్టిక్ సర్జరీలు చేయడం మొదలుపెట్టారు. రానురాను అది కూడా మానేశారు. ఇవాళ్టినుంచి ఈ పాత్రలో ఫలానా నటిని చూడమంటూ చెప్పేస్తున్నారు. ఇక హిందీ సీరియల్స్ అయితే మరీ ఘోరం. నటీనటులను ఇష్టం వచ్చినట్టు మార్చడంలో ‘బాలికావధు’దే మొదటిస్థానం. హీరోయిన్ ప్రత్యూష స్థానంలో తోరల్ రాస్పుత్ర, ‘గంగ’ పాత్రలో శ్రుతి ఝాకి బదులు సర్గుణ్, ‘సుగుణ’గా విభాఆనంద్ బదులు జాన్వీ చెద్దా... ఇలా మారిపోతూనే ఉంటారు. ‘ససురాల్ సిమర్‌కా’లో ‘ప్రేమ్’ పాత్రకు షోయబ్ ఇబ్రహీమ్‌కి బదులు ధీరజ్, ‘సాత్ నిభానా సాథియా’లో జియా మానెక్‌కి బదులు దేవొలీనా... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు అంతే ఉండదు. యాక్టర్స్‌ని మార్చడానికి మా కారణాలు మాకున్నాయి అంటారు దర్శక నిర్మాతలు. వాళ్లు మారిస్తే మేమేం చేస్తాం అంటారు చానెల్ నిర్వాహకులు. మనం మాత్రం ఏం చేయగలం? ఇష్టం లేకున్నా చూసేయడం తప్ప!