టీవీక్షణం: వినోదం వికటిస్తోందా?
ఈ మధ్య ఏ చానెల్ పెట్టినా రెండు రకాల కార్యక్రమాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి హారర్ లేక క్రైమ్, రెండోది డ్యాన్స్. ముఖ్యంగా డ్యాన్స్ షోలు బాగా పెరిగిపోయాయి. బూగీవూగీ, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, నాచ్‌బలియే, డ్యాన్సింగ్ సూపర్‌స్టార్, ఝలక్ దిఖ్‌లాజా అంటూ హిందీ చానెళ్లు... రంగం, ఆట తదితర షోలతో తెలుగు చానెళ్లు సందడి చేస్తున్నాయి. మస్తు మస్తు డ్యాన్సులతో ప్రేక్షకులకు మజాని అందిస్తున్నాయి.
అరవై నాలుగు కళల్లో డ్యాన్స్ కూడా ఒకటి. అయితే సంప్రదాయ నృత్యాలు స్జేజి ప్రదర్శనలకే పరిమితమవుతున్నాయి తప్ప, టెలివిజన్ సెట్లలో స్థానం సంపాదించలేకపోతున్నాయి. పాశ్చాత్య నృత్యరీతులు మాత్రమే టీవీ చానెళ్లలో కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర్నుంచి, నడి వయస్కుల వరకూ వెస్టర్న్ డ్యాన్స్‌నే ఎంచుకుంటున్నారు. చానెళ్లవారు కూడా వాటినే ప్రోత్సహిస్తున్నారు.
ఇప్పటి ట్రెండుని బట్టి ఇందులో తప్పేమీ లేదు. కానీ ఒక్కోసారి ఈ షోల ధోరణి శృతి మించుతోందనడంలో సందేహం లేదు. డ్యాన్సులు విపరీత పోకడలు పోతున్నాయి. ఆట షో గురించి వచ్చిన వివాదం తెలిసిందే. చిన్న పిల్లలకు పొట్టిపొట్టి దుస్తులు వేసి, ద్వంద్వార్థ ధోరణిగల పాటలకు డ్యాన్స్ చేయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిజానికిది ‘ఆట’లో మాత్రమే లేదు. దాదాపు అన్ని డ్యాన్స్ షోలలోనూ జరుగుతోంది. అలాగని పెద్దవాళ్ల డ్యాన్సులతో ఇబ్బంది లేదా అంటే కూడా ఊ అనలేం. వాళ్లు కూడా సినిమాలకు తీసిపోని విధంగా అసభ్య నృత్యరీతులను ప్రదర్శిస్తున్నారు. పైగా ఈ మధ్య సెలెబ్రిటీ జోడీల మధ్య పోటీలు పెడుతున్నారు. జీవిత భాగస్వామియే కాబట్టి ఫర్వాలేదనుకుంటున్నారో ఏమో గానీ... స్టేజిమీద రొమాన్స్‌ని హద్దు దాటిస్తున్నారు వారు. టీవీ అనేది పిల్లలకు కూడా అందుబాటులో ఉండే వినోద సాధనం. అందుకే ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సరికాదు. అయితే వినోదం ఉండకూడదని కాదు. డ్యాన్స్ షోలని నిషేధించాలనీ కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఆ మధ్య ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌కి వచ్చిన ఓ చిన్నపిల్ల ఐటెమ్ సాంగ్ పాడింది.
దాంతో జడ్జిలు ఆ పాప తల్లిని పిలిచి, ఇలాంటివి ప్రోత్సహించి పాప భవిష్యత్తును పాడు చేయకండి, మంచి పాటలు నేర్పించండి అని చెప్పారు. డ్యాన్స్ షోలకు కూడా ఇది వర్తిస్తుంది. పిల్లల మనసులపై చెడు ప్రభావం పడ కుండా ఉండేందుకు కొన్ని పాటల్ని ఎంచుకోకుండా నియంత్రించాలి. పెద్దలకు కూడా కొన్ని రకాల విన్యాసాలు చేయకుండా హద్దులు పెట్టాలి. నియమాలు విధించాలి. లేదంటే చెడును తీసుకెళ్లి స్వయంగా మన పిల్లల చేతుల్లో పెట్టినట్టవుతుంది. ఈమాత్రం జాగ్రత్త కూడా తీసు కోకపోతే వినోదం వికటిస్తుంది. డ్యాన్స్ షో కాస్తా డేంజరస్ షో అవుతుంది!