టీవీక్షణం: ప్లాస్టిక్ సర్జరీలు ఆపండి! | Stop to Plastic surgery of roles in Daily serials | Sakshi
Sakshi News home page

టీవీక్షణం: ప్లాస్టిక్ సర్జరీలు ఆపండి!

Published Sun, Feb 9 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

Stop to Plastic surgery of roles in Daily serials

సీరియల్ మాంచి రసవత్తరంగా సాగిపోతూ ఉంటుంది. ఓ రోజు సడెన్‌గా... ‘నేటి నుంచి ఫలానా పాత్రలో ఆ నటికి బదులు ఈ నటి కనిపిస్తారు’ అంటూ ఇద్దరి ఫొటోలూ తెరమీద ప్రత్యక్షమౌతాయి. నిర్వాహకులు దాన్ని చాలా సింపుల్‌గా చెప్పేస్తారు. కానీ ప్రేక్షకులు దాన్ని అంత ఈజీగా అంగీకరించలేరన్నది మాత్రం వాస్తవం!
 
 ‘మొగలిరేకులు’లో లిఖిత స్థానంలో కరుణ రావడం ప్రేక్షకులకు పెద్ద షాక్. అంతకుముందు సెల్వస్వామి పాత్రలోకి సెల్వరాజ్ బదులు రవివర్మ, కీర్తన పాత్రలో మేధకు బదులు మరో నటి వచ్చారు. అలాగే ‘అనుబంధాలు’ మీనాతో మొదలైతే, ఇప్పుడు సుహాసిని ఉంది. గతంలో ‘చక్రవాకం’ నుంచి ఇంద్రనీల్ తప్పుకుంటే జాకీ వచ్చాడు. ‘స్రవంతి’గా మీనా కొన్నాళ్లు మెప్పించాక లక్ష్మి వచ్చింది. కళ్యాణి ‘ఆటోభారతి’నంటూ వస్తే, తర్వాత మోనిక స్టీరింగ్ చేతబట్టింది.
 
 ఎందుకిలా మారిపోతున్నారు? తెలీదు. ఏం జరిగిందో అర్థం కాదు. అంతవరకూ ఒకరిని చూసి, ఆ రోల్‌లో ఇంకొకరిని చూడ్డం ఇష్టం ఉండకపోవచ్చు. కానీ చూడాలి అంతే. ‘‘కొందరు పాత్రలో ఒదిగిపోతారు. వాళ్లను చాలా ఇష్టపడతాం. సడెన్‌గా మరొకరిని తెచ్చిపెడితే సొంతవాళ్లు దూరమైనంత బాధ కలుగుతుంది’’ అని ఓ ప్రేక్షకురాలు అన్నారంటే... నటీనటుల మార్పు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చదని అర్థమవుతోంది.


 నిజానికిది కొత్తగా వచ్చిందేం కాదు. ‘పవిత్రబంధం’లో గాయత్రి హీరోయిన్. ఆమెకు డెలివరీ టైమ్ కావడంతో చేయలేనంది. ఏం చేయాలో అర్థం కాని దర్శకుడు హీరోయిన్‌కి యాక్సిడెంట్ చేయించి, ముఖం గాయపడినట్టు చూపించి, ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టుగా కవరింగ్ ఇచ్చి, గాయత్రి ప్లేస్‌లో యమునని ప్రవేశపెట్టాడు. అప్పట్నుంచి ఎవరినైనా మార్చాల్సి వస్తే, ప్రమాదంలో పడేసి ప్లాస్టిక్ సర్జరీలు చేయడం మొదలుపెట్టారు. రానురాను అది కూడా మానేశారు. ఇవాళ్టినుంచి ఈ పాత్రలో ఫలానా నటిని చూడమంటూ చెప్పేస్తున్నారు. ఇక హిందీ సీరియల్స్ అయితే మరీ ఘోరం.
 
 నటీనటులను ఇష్టం వచ్చినట్టు మార్చడంలో ‘బాలికావధు’దే మొదటిస్థానం. హీరోయిన్ ప్రత్యూష స్థానంలో తోరల్ రాస్‌పుత్ర, ‘గంగ’ పాత్రలో శ్రుతి ఝాకి బదులు సర్గుణ్, ‘సుగుణ’గా విభాఆనంద్ బదులు జాన్వీ చెద్దా... ఇలా మారిపోతూనే ఉంటారు. ‘ససురాల్ సిమర్‌కా’లో ‘ప్రేమ్’ పాత్రకు షోయబ్ ఇబ్రహీమ్‌కి బదులు ధీరజ్, ‘సాత్ నిభానా సాథియా’లో జియా మానెక్‌కి బదులు దేవొలీనా... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు అంతే ఉండదు. యాక్టర్స్‌ని మార్చడానికి మా కారణాలు మాకున్నాయి అంటారు దర్శక నిర్మాతలు. వాళ్లు మారిస్తే మేమేం చేస్తాం అంటారు చానెల్ నిర్వాహకులు. మనం మాత్రం ఏం చేయగలం? ఇష్టం లేకున్నా చూసేయడం తప్ప!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement