టీవీక్షణం: నిజంగానే దూసుకెళ్తోంది! | Television Game shows attracting TV audience | Sakshi
Sakshi News home page

టీవీక్షణం: నిజంగానే దూసుకెళ్తోంది!

Published Sun, Apr 20 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

Television Game shows attracting TV audience

సీరియళ్లు సెంటిమెంటుతో కట్టిపడేస్తే... గేమ్ షోలు టెన్షన్ పెట్టి అట్రాక్ట్ చేస్తుంటాయి. ఆడేది తాను కాకపోయినా ఆట ఏమైపోతుందో అని ఆతృత పడుతుంటాడు ప్రేక్షకుడు. ఇక తన ఫేవరేట్ సెలెబ్రిటీ ఆడుతుంటే ఆ ఆదుర్దా గురించి చెప్పాల్సిన పని లేదు. ఇదిగో... ప్రేక్షకులలోని ఈ ఆసక్తి కారణంగానే గేమ్‌షోలు సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్నాయి.  ‘దూసుకెళ్తా’ కూడా అందుకే విజయాన్ని మూటగట్టుకుంది. యాంకర్‌గా మంచు లక్ష్మికి ఇప్పటికే మంచి పేరుంది. లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి వంటి కార్యక్రమాలతో బుల్లితెర మీద తనదైన ముద్రను వేసింది లక్ష్మి. ఇప్పుడు ‘దూసుకెళ్తా’తో మరోసారి తన సత్తా చూపిస్తోంది. మాటీవీలో ప్రసారమవుతోన్న ఈ షోలో సెలెబ్రిటీలను ఆటగాళ్లుగా మార్చి లక్ష్మి ఆడే తీరు అందరినీ ఆకర్షిస్తోంది. సినీతారల ఫ్యాన్ ఫాలోయింగుకు, ఆమె యాంకరింగ్ స్టైల్ తోడవడంతో షో నిజంగానే దూసుకెళ్తోంది. టీఆర్పీ విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది!
 
మనోజ్ కూడా మొదలెట్టాడోచ్!
 క్రైమ్ షోలకి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. టీఆర్పీలు పడిపోకుండా ఎప్పుడూ ఒకేలా సాగిపోతున్న షోలు అవేనంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే రోజుకో కొత్త క్రైమ్ షో పుట్టుకొస్తోంది. ముఖ్యంగా హిందీ చానెళ్లలో వీటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే సీఐడీ, క్రైమ్ పెట్రోల్ వంటి షోలతో లాభాలను మూటగట్టుకుంటోన్న సోనీ చానెల్ మరో క్రైమ్ షోకి ఊపిరి పోసింది. అదే... ఎన్‌కౌంటర్. దేశవ్యాప్తంగా ఇప్పటికి ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగాయి. అవి ఎందుకు జరిగాయి, ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయి వంటి వివరాలతో రూపొందింది ఈ షో. దీనికి ప్రధాన ఆక ర్షణ... ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ విశ్లేషణ. ‘సావధాన్ ఇండియా’కి సుశాంత్ సింగ్, ‘క్రైమ్ పెట్రోల్’కి అనూప్ సోనీ, ‘ఇష్క్ కిల్స్’కి విక్రమ్ భట్ హోస్టులుగా వ్యవహరిస్తున్నట్టుగా.. ‘ఎన్‌కౌంటర్’కి మనోజ్ హోస్ట్ అయ్యారు. అయితే ఇప్పటి వరకూ అనూప్ సోనీ అంత అద్భుతంగా ఎవరూ క్రైమ్ షోలకి యాంకరింగ్ చేయలేదని అందరూ అంటూంటారు. మరి ఆ మాటని మనోజ్ నిజం చేస్తాడో లేక అనూప్‌ని అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పుతాడో చూడాలి!
 
 స్ట్రాంగ్ అవుతోంది!
 సెలెబ్రిటీలు పాల్గొనే కార్యక్రమాల పట్ల ప్రేక్షకులకు యమా క్రేజ్ ఉంటుంది. అందుకే ఏదో ఒక విధంగా సెలెబ్రిటీలను బుల్లితెరకు లాక్కొస్తుంటారు నిర్వాహకులు. అయితే ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నా ఇంటర్వ్యూల తీరు వేరు. సెలెబ్రిటీలు తమ గురించిన వివరాలు తామే చెబుతుంటే వినడానికి ఆడియెన్స్ ఇష్టపడతారు. అందుకే పలు చానెళ్లలో వివిధ రకాలుగా ఇంటర్వ్యూలు వస్తున్నాయి. వాటిలో ఒకటి ‘కాఫీ విత్ కరణ్’. స్టార్ వరల్డ్ చానెల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహిస్తున్నారు. ఇద్దరు సెలెబ్రిటీలను ఒక్క చోటికి చేర్చి, ఇద్దరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేస్తుంటాడు కరణ్. అయితే సెలెబ్రిటీల ఎంపిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అఫైర్ నడుస్తోందని అనుకున్నవారిని, ప్రేమలో ఉన్నవారిని, భార్యాభర్తల్ని, అస్సలు సరిపడక గొడవలు పడుతున్నవారిని తీసుకొచ్చి ఒకచోట కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు.
 
 అంతవరకూ బాగానే ఉంటుంది. కానీ వారి వ్యక్తిగత విషయాల గురించి అతడు అడిగే ప్రశ్నలు ఒక్కోసారి ఆ సెలెబ్రిటీలను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు వారి మధ్య చిచ్చు కూడా పెడుతూ ఉంటాయి. ఫేమస్ డెరైక్టర్ కావడంతో ఎవరూ తనని ఏమీ అనలేరనుకుంటాడేమో ఏ ప్రశ్న పడితే ఆ ప్రశ్న అడిగేస్తుంటాడు. అందుకే ఈ మధ్య ఈ షో పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. సంచలనాలు, వివాదాలు సృష్టించే లక్ష్యంతోనే దీన్ని నిర్వహిస్తున్నారు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ప్రజల అభిమానాన్ని కోల్పోతే ఏ షోకి అయినా తెరపడాల్సిందే. ఈ విషయాన్ని గుర్తించి కరణ్ తన షో తీరును మారుస్తాడో లేదో మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement