చినుకంత ఆశలు | this month full rains | Sakshi
Sakshi News home page

చినుకంత ఆశలు

Published Sat, Jul 9 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

చినుకంత ఆశలు

చినుకంత ఆశలు

వాతావరణం
రెండేళ్ల కరువు రైతులను కుదేలు చేసింది. తగిన వానలు లేక చాలాచోట్ల నేల బీడువారింది. అయితే, ఈ ఏడాది వాతావరణ శాఖ ప్రకటించిన అంచనాలతో రైతుల్లో చినుకంత ఆశలు చిగురిస్తున్నాయి. వరుసగా రెండేళ్లు వర్షాభావంతో అల్లాడిన రైతులకు వాతావరణ శాఖ అంచనాలు నెత్తిన పాలవాన కురిపించినట్లే ఉన్నాయి. ఈ అంచనాలే నిజమైతే అన్నదాతలకు అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. దేశవ్యాప్తంగా ఈసారి ఇబ్బడి ముబ్బడిగా వర్షాలు కురుస్తాయని, ‘లా నినా’ ప్రభావం వల్ల సాధారణ వర్షపాతాన్ని మించిన వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ రుతుపవనాల రాకకు ముందే ప్రకటించింది.
 
గడచిన రెండేళ్లూ మబ్బులు రైతులను దగా చేశాయి. చాలాచోట్ల నేల తడిసీ తడవని రీతిలో చినుకులు రాలాయి. ఫలితంగా పంటలు దెబ్బతిన్నాయి. కుదేలైన రైతుల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. సాగుతో బతుకు సాగక పలువురు అన్నదాతలు ‘అన్నమో రామచంద్రా!’ అంటూ పట్టణాలకు, నగరాలకు వలస బాటపట్టారు. సాధారణ వర్షపాతం కంటే 2014లో కేవలం 88 శాతం, 2015లో 86 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది.

ఈసారి అలాకాకుండా, రెండేళ్ల కరువు తీరిపోయేలా ఏకంగా 106 శాతం వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ ఎల్.ఎస్.రాథోడ్ చల్లని వార్త వినిపించారు. మహారాష్ట్రలో తీవ్రమైన కరువుతో అల్లాడిన విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో కూడా పుష్కలంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడులోని కొద్ది ప్రాంతాలు మినహా దేశం నలుచెరగులా సాధారణ వర్షపాతం కంటే అధికంగానే వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
 
యథా గ్రీష్మం... తథా వర్షం
ఈసారి వేసవిలో ఎండలు మండిపడ్డాయి. దేశంలో చాలాచోట్ల సాధారణం కంటే ఎక్కువగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి నైరుతి రుతుపవనాలు బలం పుంజుకోవడానికి బాగా అనుకూలిస్తుందని భారత వాతావరణ శాఖ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డి.ఎస్.పాయ్ చెబుతున్నారు. మరోవైపు, హిమాలయ ప్రాంతంలో పేరుకుంటున్న మంచు కూడా పుష్కలంగా వర్షాలు కురవడానికి అనుకూలిస్తుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే, వర్షాభావానికి దారితీసిన ‘ఎల్-నినో’ పరిస్థితి బలహీనపడింది. ఫలితంగా ఈసారి పసిఫిక్ సముద్రం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి, ‘లా నినా’ పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీనివల్ల పుష్కలంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ‘లా నినా’ వల్ల ముఖ్యంగా సెప్టెంబర్ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తోంది.
 
106% ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయి. వాతావరణ అంచనాల్లో 4% తేడా ఉండొచ్చు.
 
107% జూలై వర్షపాతం అంచనా
 
104% ఆగస్టు వర్షపాతం అంచనా
 
సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement