చాక్‌లెట్లు ఆ భావనలు పెంచుతాయా?
అవాస్తవం
చాక్‌లెట్లు రొమాంటిక్ భావనలను పెంచుతాయనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. చాక్‌లెట్స్‌కు అవసరమైన మూల పదార్థాలు ఒకప్పుడు చాలా అరుదుగా లభ్యమయ్యేవి. దక్షిణ అమెరికాలోని వర్షాధార అడవుల్లోనే అవి దొరికేవి. చాక్‌లెట్ల మూలపదార్థాలు ఈ ‘కొకోవా చెట్ల’ నుంచి లభ్యమయ్యేవి. దాంతో అక్కడి ప్రాచీన మాయ నాగరికతకు చెందిన వారు ఆ చెట్టును ‘దేవుడి ఆహారపు’ చెట్టుగా కొలిచేవారు. చాక్‌లెట్లలో ‘ఫీల్‌గుడ్’ అనుభూతిని, సంతోషభావనను పెంచే జీవరసాయనమైన సెరిటోనిన్ ఉంటుంది.
ఈ సెరిటోనిన్‌తో పాటు చాక్‌లెట్స్‌లోని ఫినైల్ ఇథైల్‌ఎమైన్ (పీఈఏ) రసాయనం నాడీ వ్యవస్థపై కాస్త స్టిమ్యులెంట్స్‌గా పనిచేస్తుంది. అప్పట్లో చాక్‌లెట్లు చాలా అరుదుగానూ, పరిమితంగానూ దొరికే ఆహారం కావడంతో పాటు, ఆనంద భావననూ, ఉల్లాసాన్ని కలిగించేవి. దాంతో చాక్‌లెట్స్ తయారయ్యే తొలినాళ్లలో వాటిని రొమాంటిక్ ఫీలింగ్స్ కలిగించేవిగా పరిగణించేవారు.
ఇప్పుడు ఆధునిక పరిశోధనలతో చాక్లెట్ వల్ల కోరిక పెరగడం జరగదని తేలింది, అయితే చాక్‌లెట్లలోని ‘ఫీల్ గుడ్’ భావన వల్ల, స్టిమ్యులెంట్స్ వల్ల మనసు ఉత్తేజితమవుతుందని తెలిసింది. ఇక పరిమితంగా తింటే డార్క్ చాక్లెట్లు గుండెకు ఒకింత మేలు చేస్తాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే అవి సెక్స్‌ను ఉత్తేజితం చేస్తాయనడం కంటే మనసును ఉల్లాసంగా ఉంచేలా చూస్తాయనడమే సబబు.