ఎన్‌హెచ్ - 9 | two friends story at hyderabad outer ring road | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్ - 9

Published Sun, May 3 2015 1:19 AM | Last Updated on Sat, Mar 23 2019 7:56 PM

ఎన్‌హెచ్ - 9 - Sakshi

ఎన్‌హెచ్ - 9

‘‘హైదరాబాద్ చాలా మారిపోయింది ఈ పదేళ్లలో! ఎక్కడ చూసినా మాల్సు, ఎత్తయిన బిల్డింగులు, వీధి నిండా కార్లు!’’ నవ్వుతూ అన్నాను. ‘‘ఇదొక్కటే కాదు. హైదరాబాద్, విజయవాడ మధ్య రోడ్డు చూసి తీరాలి. నీకు గుర్తుందా? ఇరవయ్యేళ్ల క్రితం రాత్రి పదింటికి విజయవాడలో ఎక్కితే తెల్లారితే కాని హైదరాబాద్ వచ్చేవాళ్లం కాదు. అలాంటిది ఇప్పుడు నాలుగ్గంటల్లో వచ్చేస్తాం! తినబోతూ రుచెందుకు? నువ్వే చూద్దువు గాని!’’నవ్వుతూ అన్నాడు నవీన్. పజరో కారు ఔటర్ రింగురోడ్డు మీదకు ఎక్కింది. నవీన్ కారు డ్రైవ్ చేస్తున్నాడు.

ఔటర్ రింగురోడ్డు చాలా బావుంది. ఉదయాన్నే బయల్దేరడం వలన అంతగా ట్రాఫిక్ లేదు. నవీన్ నా కజిన్! ఇద్దరం రాజమండ్రి బయల్దేరాం. వాడికీ రాజమండ్రిలో పనుందంటూ వాడూ నాతో వస్తానన్నాడు. ముందు రాజమండ్రి విమానంలో వెళదామనుకున్నాను. నవీన్ ప్లానంతా మార్చేశాడు. నవీన్, నేను చిన్నప్పటినుండీ కలిసి పెరిగాం. వాడు చాలా కష్టపడి పైకొచ్చాడు. నాలుగు లైన్ల విశాలమైన రోడ్డు చూడగానే నాకు అమెరికా గుర్తొచ్చింది. అదే అన్నాను నవీన్‌తో! ‘‘చెప్పాగా! సూపర్బ్ రోడ్స్!’’ అంటూ పజరో స్పీడ్ పెంచాడు. మా సంభాషణ అంతా అమెరికా రోడ్ల గురించి, అక్కడి ట్రాఫిక్ గురించి సాగింది. నవీన్ ఆరేళ్ల క్రితం ఒకసారి అమెరికా వచ్చాడు. అక్కడి రోడ్లు, నిబంధనలూ వాడికి పరిచయమే!
 
వెలుతురు వచ్చాక ఇద్దరం ఎక్స్‌ప్రెస్‌వే పక్కనే ఉన్న సెవెన్ రెస్టారెంట్ దగ్గర ఆగాం కాఫీ తాగడానికి.
 ‘‘ఉన్నవాటిలో ఇది చాలా బెటర్! కాస్త నీటుగా ఉంటుంది!’’ అన్నాడు. ఎక్స్‌ప్రెస్ వే పక్కనే ఉండటం వల్ల ఉదయాన్నే చాలా కార్లున్నాయి అక్కడ. లోపలికి వెళ్లగానే చాలా పెద్ద లైనుంది. నేను క్యూలో నిల్చున్నాను. నవీన్ బాత్‌రూమ్‌కి వెళ్లి వచ్చాడు. ఈలోగా ఒకతను నన్ను దాటుకుంటూ క్యూలో ముందుకి వెళ్లడం చూసి నవీన్ అతన్ని నిలవరించాడు.
 
‘‘ఏయ్ మిస్టర్! వెనక్కి రండి. మేం ఇందాకణ్నుండి వెయిట్ చేస్తున్నాం. కనిపించడం లేదూ?’’ అని గట్టిగా అనడంతో అతను వెనక్కి మళ్లుతూ, ‘‘పాపకి... పాలు’’ అని నసుక్కుంటూ వెనక్కి వెళ్లి నించున్నాడు.
 ‘‘ఈ దేశంలో ఇంతే! అమెరికాలో అయితే, ఎక్కడ చూసినా క్యూలో నిల్చుంటారు. ఇక్కడలా కాదు. ప్రతివాడికీ వాడి పని ముందైపోవాలి’’ అని నవీన్ అనడంతో నవ్వేశాను.
 తన కంపెనీలో తనెంత స్ట్రిక్టుగా ఉంటాడు, తనన్నా, తన పద్ధతులన్నా అందరికీ హడలని చెప్పాడు. కాఫీ తాగి బయల్దేరాం.
 
వెలుగొచ్చాక కార్ల సందడి పెరిగింది. ఒకదాన్ని మించిన వేగంతో మరో కారు దూసుకుపోతున్నాయి.
 మధ్యమధ్యలో ఊళ్లు తగిలినప్పుడు అస్తవ్యస్తమైన ట్రాఫిక్ చూసి నవీన్ విసుక్కున్నాడు. హఠాత్తుగా హైవే మీద ఒకతను రోడ్డు దాటుతూ కనిపించాడు. ఒక్కసారి గట్టిగా అరిచాను.
 నవీన్ ఒక్కసారి సడన్ బ్రేక్ వేసి, ‘‘యూ ఈడియట్! లం... కొడకా చస్తావురా!’’ అంటూ గట్టిగా అరిచాడు. అది ఆ వ్యక్తికి వినిపించకపోయుండవచ్చు!
 
నాకైతే చచ్చేటంత భయం వేసింది. రోడ్డు దాటిన అతనూ భయపడినట్లున్నాడు.
 నవీన్ కారాపి అతన్ని చూసి నాలుగు చీవాట్లేశాడు. ఆ వ్యక్తికి యాభయ్యేళ్లు దాటుండచ్చు. చింపిరి జుట్టుతో నల్లగా రివటలా ఉన్నాడు. మాకేసి తప్పయిపోయిందన్నట్లు చూశాడు. అతనికేసి చూస్తూ తప్పన్నట్లు తలాడించాను. నా కళ్లలోకి చూసి తప్పయిందన్నట్లు చేతులు జోడించి గబగబా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
 ‘‘చూశావుగా! ఆ రాస్కెల్‌కి ప్రాణభయం లేదు. వీళ్లంతే! రోడ్డంటే సొంత బెడ్రూమ్‌లాగా ఫీలవుతూ నడుస్తారు. ఈడియట్స్! అసలు సివిక్ సెన్స్ ఉండదు. అమెరికాలో చూశాగా, ఎంత సివిలైజ్డ్ ట్రాఫిక్ ఉంటుందో?’’ అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టాడు.

 ‘‘వాళ్లననుకొని ఏం లాభం? వాళ్లకి చదువు లేదు. గ్రామాల్లో తిరగడం అలవాటైనవాళ్లకి ఈ రోడ్లు ఇంకా అలవాటు పడినట్లుండలేదు. దీనికంతటికీ కారణం ఎడ్యుకేషన్! అదే చాలా సమస్యలకి కారణం. అయినా ఇంత పెద్ద పెద్ద రోడ్లు వేసినవాళ్లు, ఊళ్లొచ్చాక ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టచ్చు కదా! వీళ్లకైతే చదువు రాదు. రోడ్లు వేసేవాళ్లకి ఆ మాత్రం తెలియదా?’’ నవ్వుతూ అన్నాను.
 ‘‘అంత సీను లేదు. అయినా ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? వీళ్లకి చావంటే అస్సలు భయం లేదు. రూల్సూ అవీ పట్టించుకోరు. ఈ దేశాన్ని ఎవరూ బాగు చేయలేరు’’ నవీన్ చికాకంతా అతని మాటల్లో కనిపిస్తోంది.
 హైదరాబాద్ ట్రాఫిక్ చూశాను. అదీ అంతే! ఇంతకంటే అధ్వానం. ఎవరికీ పక్కవాడి గురించి పట్టదు. ముఖ్యంగా రోడ్డుమీద.
 
విజయవాడ చేరేలోగా దారిలో రెండు మూడు యాక్సిడెంట్లు చూశాం.
 ఒకచోటయితే కారు తిరగబడిపోయింది. ఒకరిద్దరి ప్రాణాలు కూడా పోయుంటాయి.
 కోదాడ దాటాక మధ్యలో ఎక్స్‌ప్రెస్ వేకి పక్కగా ఒకచోట పజరో ఆపాడు నవీన్, ఒంటేలు పోసుకోవడానికి. నన్నూ అడిగాడు. అవసరం లేదన్నట్లు తలూపాను.
 పదింటికల్లా విజయవాడ చేరాం. విజయవాడలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపమని అడిగాను. దారి పొడుగునా బిగపెట్టుకొని కూర్చున్నాను. హోటల్లోకి వెళ్లీవెళ్లగానే బాత్రూం వైపు పరిగెత్తాను.
 
‘‘ఇందాకణ్నుంచీ ఉగ్గ పెట్టుక్కూర్చున్నాను! హమ్మయ్య!’’ అంటూ కాఫీ కప్పు తీసుకుంటూ అన్నాను.
 ‘‘మధ్యలో ఆపేవాణ్ని కదా? చెప్పాల్సింది!’’ అన్నాడు నవీన్. పర్లేదన్నట్లు నవ్వేశాను.
 రాజమండ్రి చేరేసరికి పన్నెండయ్యింది. బంధువుల్ని కలిసి ఆ రాత్రికి అక్కడే బస చేశాం. మర్నాడు ఉదయం బయల్దేరి హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం చేశాం.
 ఇంతకుముందులాగే మా సంభాషణలు కార్ల గురించి, విదేశాల్లో రోడ్ల గురించి సాగింది. నవీన్‌కి కార్ల పిచ్చి. కొంత దూరం వెళ్లాక, ఒకచోట పెద్ద యాక్సిడెంట్ అయ్యి, ట్రాఫిక్ ఆగిపోయింది.
 
అవతల లైన్లో వాహనాలన్నీ స్తంభించిపోయాయి. యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికొచ్చాక నవీన్ పజరో స్లో చేశాడు.
 ఒక పిల్లాడు, మరో ఇద్దరు ఆడవాళ్లు కారు కిందపడి, నుజ్జు నుజ్జు అయిపోయారు. దూరంగా అతని బంధువులాగుంది, గుండెలు బాదుకుంటూ ఒకతను కనిపించాడు. అతన్ని చూడగానే స్థాణువయ్యాను. అతనెవరో కాదు, క్రితంసారి మా కారు కింద పడబోయి నవీన్ చేత తిట్లు తిన్న వ్యక్తి.
 నవీన్ అతన్ని గుర్తించినట్లు లేదు. నాకైతే అతని వాలకం బాగానే గుర్తుంది. ఇంతకుముందు మా కారు కింద పడబోయిన వ్యక్తి తాలూకు వాళ్లే అని నవీన్‌కి చెబుదామని అనుకుంటూ ఆగిపోయాను. పైకి అనలేదు.
 
‘‘చూశావుగా! ఇలాగే ఉంటుంది, ప్రతిరోజూ! కనీసం నాలుగైదు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. రోడ్డు క్రాస్ చేసేవాళ్లకి ప్రాణం అంటే లెక్కలేదు! ఈడియట్స్!’’ అంటూ గట్టిగా తిట్టాడు.
 ‘‘ఇలా రూల్సు అతిక్రమించేవాళ్లని జైల్లో పడేయాలి’’ నేను జవాబివ్వకపోయేసరికి మరలా తనే అన్నాడు.
 నాకెందుకో నవీన్‌తో వాదించే ఓపిక, మనసు లేకపోయింది యాక్సిడెంటు వాతావరణం చూశాక!
 కొంతసేపయ్యాక నేను వేరే టాపిక్ మార్చేశాను. ఈ యాక్సిడెంట్ల గురించి మాట్లాడటం ఇష్టం లేక.
 ఇంతలో నవీన్‌కి ఫోన్ కాల్ వచ్చింది. సంభాషణ బట్టి అతని కంపెనీవాళ్లు కాల్ చేశారని గ్రహించాను. నవీన్ ఆ కంపెనీలో ఒక విభాగానికి వైస్ ప్రెసిడెంట్!
 
‘‘అలాగా! ఆర్డరు రావడం కష్టమా? మన కోట్ ఎక్కువన్నాడా? ఓ పని చెయ్. వాడికి ఓ యాభై వేలు ముట్టజెప్పు. మరీ చేస్తే ఓ లక్ష పడెయ్యి. ఈ ఆర్డరు మనకి చాలా ఇంపార్టెంట్.’’
 నవీన్ అవతలవాళ్లతో ఫోన్ పెట్టేశాక, నావైపు తిరిగి, ‘‘ఇక్కడ బిజినెస్ నడపడం మీ అమెరికాలో అంత ఈజీ కాదు. అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తారు’’ అన్నాడు.
 ‘‘ఏ దేశంలో కష్టాలు ఆ దేశానికుంటాయి. పైకి కనిపించేదంతా నిజం కాదు’’ అనేసి ఊరుకున్నాను.
 తన కంపెనీలో ఉండే కష్టాలు, వ్యక్తుల గురించి నవీన్ చెప్పడం ప్రారంభించాడు.
 
రెండింటికల్లా హైదరాబాద్ దగ్గరికి వచ్చాం. ఆదివారం కావడం వలన ఔటర్ రింగురోడ్డులో అంతగా ట్రాఫిక్ లేదు.
 నాలుగు పెద్ద పెద్ద లైన్లలో రోడ్డు చాలా బాగుంది. ఒక్కసారిగా నవీన్ కారు స్పీడు పెంచాడు. స్పీడు నూట నలభై అయ్యింది.
 ‘‘ఎందుకంత స్పీడు?’’ తగ్గించమన్నట్లు చూస్తూ అన్నాను.
 ‘‘ఈ రోడ్లు చూస్తుంటే స్పీడుగా వెళ్లాలనిపిస్తుంది. ఈ హై స్పీడులో కారు డ్రైవింగ్ ఎంత బావుందో కదా? ఐ లైక్ ఇట్!’’

 ‘‘ఈ రోడ్ల మీద పోలీసులు ఉండరా? అయినా స్పీడ్ లిమిట్ ఉండదా?’’
 ‘‘స్పీడు లిమిటా? అయినా ఇక్కడ ఏ పోలీసు లేడు కదా? మీ అమెరికాలోలాగ మాకు టిక్కెట్లు ఇవ్వరు. ఒకవేళ ఉన్నా ఓ వెయ్యి పడేస్తే వాడే వదిలేస్తాడు’’ గట్టిగా నవ్వేశాడు నవీన్.
 నేనేం మాట్లాడలేదు. నాకొక్కసారి యాక్సిడెంట్ దగ్గర శవాలు, ఆ గడ్డం వ్యక్తి గుర్తుకొచ్చారు. మనసంతా అదోలా అయిపోయింది.
 
నవీన్ కారు మితిమీరిన వేగంతోనే నడుపుతున్నాడు.
 ఔటర్ రింగురోడ్డు దాటాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను.
 ఇంటికొచ్చాక నవీన్ భార్య ఏడుస్తూ మాకెదురొచ్చింది.
 ‘‘ఇవాళ మన రోజు బావుంది. వాడెవడో వెధవ పాప ట్యూషన్‌కెళ్లిన చోట రోడ్ క్రాస్ చేస్తూంటే స్పీడుగా కారు పోనిచ్చాడు. అక్కడే ఉన్న ఒక ముష్టాడు చూసి వెంటనే పాపని పక్కకి లాగడంతో బతికిపోయింది. లేదంటే...’’ అంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యింది. నవీన్ కూతురు కూడా భయపడినట్లుంది. తండ్రిని చూడగానే ఒక్కసారి కావలించుకుంది.
 
నవీన్ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. ‘‘అయినా మన డ్రైవర్ వెధవ ఎక్కడ చచ్చాడు?’’
 కారు రోడ్డుకి అవతలవైపే ఆపాడని, వాణ్ని చూడగానే పాప అటుగా వెళ్లిందని
 (కథ తరువాయి భాగం)
 నవీన్ భార్య చెప్పింది.
 ‘‘ఈడియట్స్! ఏ ఒక్క వెధవకీ స్పీడ్ కంట్రోల్ లేదు. రోడ్డంటే వాడి బాబు సొత్తులా ఫీల్ అవుతారు. సిటీలో అంత స్పీడుగా నడపాలా? ట్రాఫిక్ పోలీసెవడూ లేడా? వెధవలు డ్యూటీ చేసి చావరు’’ అంటూ గట్టిగా తిట్టుకున్నాడు.
 ‘‘చూశావట్రా? ఇవాళ మా అదృష్టం బావుండి బతికిపోయాం. ఈ దేశం చచ్చినా బాగుపడదు.’’
 పాప బిక్కుబిక్కుమంటూ నాకేసి చూసింది. తండ్రి కోపాన్ని అర్థం చేసుకోలేకపోతోంది. నేను నా కోపాన్ని దిగమింగుకోలేకపోయాను.    
 
సాయంత్రం వరకూ చికాకు తగ్గలేదు. ఆ సాయంత్రం పాపని తీసుకొని పార్కుకి వెళ్ళాను. పార్కుకి ఓ పక్క చిన్న కొలను... ఒక బాతు పిల్లలతో కలిసి కొలను వైపు వెళ్ళడం చూసి వాటిని పట్టుకుందామని పాప ఒక్క ఉదుటన అటుగా పరిగెత్తింది.
 పాప పరుగుకి భయపడి బాతూ, పిల్లలూ వెనక్కి వెళ్ళిపోయాయి. చటుక్కున వెళ్ళి పాపని వారించి, కళ్ళెర్ర జేశాను. పాప వెనక్కి తగ్గింది. చేయి పట్టుకొని నాతో పాటే తీసుకెళ్ళాను.
 కొంత దూరం నడిచాక పాప వెనక్కి తిరిగి చూసి ఆగిపోయింది.
 నేను వెనక్కి తిరిగి ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను.
 ఆ కాలిబాటన - ముందు తల్లి బాతు!
ఒకే వరుసలో వయ్యారంగా పిల్ల బాతులు!!      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement