పరిస్థితుల ప్రభావానికి, కాలగతికి ఎవరూ, ఏమీ అతీతులు కారనడానికి రూపురేఖలు కోల్పోయి, ఓనాటి వైభవానికి నిదర్శనంగా మిగిలిన ఈ ఆలయమే నిదర్శనం. కోట్లకు అధిపతి అయిన బిడ్డ ప్రపంచంలోనే అతి సంపన్న దేవుడిగా ఎదిగినా, తల్లి మాత్రం పూరిగుడిసెలో ఉంటుందనటానికి ఉదాహరణ ఆ ఆలయం. శతాబ్దాల తరబడి ధూప, దీప నైవేద్యాలకు, కనీసం భక్తులు దర్శించుకునేందుకు, ఆలన పాలనకు నోచుకోని దుస్థితిలో ఉన్న ఆలయం ఎవరిదో అనే కదా మీ సంశయం. ఇది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి తల్లి వకుళామాత ఆలయం. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి కూతవేటు దూరంలో పేరూరు బండపై ఉన్న ఈ ఆలయానికి పూర్వవైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
బిడ్డ కోసం నాలుగు యుగాల నిరీక్షణ....
దేవతల తల్లి అదితి విష్ణుమూర్తి తన కొడుకుగా కావాలని తలంచింది. తన భర్తౖయెన కశ్యప ప్రజాపతితో కలిసి వేల సంవత్సరాలు తపస్సు చేయగా విష్ణుమూర్తి వామనావతారంగా అదితిదేవి గర్భంలో భాద్రపద శుక్ల ద్వాదశి నాడు జన్మించాడు. పుట్టడంతోనే ఒక చేతిలో కమండలం, మరో చేతిలో గొడుగుతో ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లవాడిగా పుట్టి బలి చక్రవర్తి చేసే యాగశాల వైపు వెళ్లనారంభించాడు. కన్నకొడుకు తీరుతో తల్లడిల్లిన ఆ తల్లి ‘పుట్టడంతోనే అలా వెళ్లిపోయావు, కనీసం గోరుముద్దలైనా తినిపించలేదు. ఇదేనా నా తపఃఫలితం’ అని బాధపడింది. దీంతో ‘అమ్మా... అందుకు విచారపడకు, త్రేతాయుగంలో నీ కోరిక తీరుస్తా’ అని వామనుడు మాట ఇచ్చాడు.
త్రేతాయుగంలో రామావతారంలో అదితి, శబరిగా కనిపిస్తుంది. క్రితం జన్మలో విష్ణుమూర్తి తనకిచ్చిన మాట కోసం ఎదురు చూస్తుంది. రాముడు శబరి మాత ఇచ్చిన పళ్లు తిని మాట నిలబెట్టుకుంటాడు. మళ్లీ శబరి బాధతో ‘కనీసం నాతో కలిసి కొన్ని రోజులైనా ఉండవా...’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో రాముడు ‘తల్లీ, నీ కోరిక ద్వాపరయుగంలో తీరుస్తాను’ అంటూ బయలుదేరుతాడు.
ద్వాపర యుగంలో అదితి, యశోదగా పునర్జన్మనెత్తుతుంది. పరిస్థితుల ప్రభావం చేత తన కొడుకు కొంత కాలం దూరంగా ఉన్నా తిరిగి తన దగ్గరకే వచ్చారు శ్రీకృష్ణుల వారు. కానీ ఇంకా తన మనస్సులో వెలితి మాత్రం మిగిలిపోయింది. అష్టభార్యలను కట్టుకున్నా, అవేమీ తన సమక్షంలో జరగలేదన్న తల్లి పడుతున్న బాధను గమనించిన కృష్ణుడు ఆమె కోరికను కలియుగంలో తీరుస్తానని మాటిస్తాడు.
కలియుగంలో వెంకటేశ్వరస్వామిగా అవతారం ఎత్తిన సమయంలో వకుళాదేవిగా జన్మిస్తుంది. వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని పెళ్లి అంగరంగ వైభవంగా తన ఆధ్వర్యంలో జరిపించి యుగ యుగాల తన కోరిక తీర్చుకుంది.
పేరూరు కొండపై ఆలయం..
మన పూర్వీకులు నిర్మించిన...ప్రతిష్ట కలిగిన ఆలయాలన్నీ దాదాపు కొండపైనే ఉంటాయి. వకుళమాత ఆలయం కూడా పేరూరు కొండపైనే ఉంది. ఈ ఆలయం నిర్మాణం 500 ఏళ్ల క్రితం శ్రీ కృష్ణదేవరాయల కాలంలో జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. 50 ఎకరాల్లో ఈ కొండ విస్తరించి ఉంది. ఇక్కడే పరిమళ పుష్కరిణి, నారద తీర్థం ఉండేవని పేర్కొంటారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఈ ఆలయం కూడలిగా ఉండేది. భక్తులు ఇక్కడ సేదతీరి, అన్నం తిని, నిద్రచేసి కొండకు వెళ్లేవారని చెబుతుంటారు. నాడు ఆధ్యాత్మిక వెలుగులు నింపిన ఆ ఆలయం హైదర్ అలీ దండయాత్రలో దెబ్బతింది. కానీ తిరుపతిలోని చాలా ఆలయాలను సమూలంగా నాశనం చేయాలని హుకుం జారీ చేశాడు. ఎన్ని ఆలయాలు కూలిపోయినా వకుళమాత ఆలయం పాడుకాలేదు. కానీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తర్వాత శతాబ్దాల పాటు ఈ ఆలయం దీప, ధూప నైవేద్యాలకు నోచుకోలేదు. చాలా మంది ఆ ఆలయం ఆమెది కాదని వాదించారు. స్థానికులు ఎన్ని సార్లు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని టీటీడీని వేడుకున్నా పట్టించుకోలేదు.
స్వామి పరిపూర్ణానంద స్వామి పోరాటంతో...
తల్లి ప్రేమకు ప్రతీకగా ఉన్న వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ కోసం శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భక్తులతో కలిసి పాదయాత్రలు చేశారు. భక్తి పోరాటం చేశారు. న్యాయ స్థానంలో కేసులు వేయించి అనుకూల తీర్పును సాధించారు. టీటీడీనే వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ చేయాలని కోర్టులు సైతం తీర్పు ఇచ్చాయి. స్వామి పోరాటానికి రాజకీయ నేతలు, అధికారులు సైతం తోడ్పాటు అందించారు. దీంతో టీటీడీ రూ.2 కోట్లను మంజూరు చేసింది. 2017 మార్చి 5న ఆలయ జీర్ణోద్ధరణ పనులను స్వామి పరిపూర్ణానంద చేతుల మీదుగా ప్రారంభించారు.
శరవేగంగా పనులు...
పనులు ప్రారంభించిన నాటి నుంచి శరవేగంగా సాగుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న కొండకు క్రమపద్ధతిలో ఘాట్ రోడ్డును నిర్మిస్తున్నారు. తర్వాత దశల వారీగా ఇక్కడ నామకరణం, అన్నప్రాçశన, అక్షరాభ్యాసం వంటి సంస్కారాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలివేలు మంగాపురం తరహాలో త్వరలోనే ఇదో దివ్యధామంగా తీర్చిదిద్దనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
– సౌపాటి ప్రకాష్‌బాబు, తిరుపతి
అమ్మకు ఆలయం
Published Sun, Oct 7 2018 1:38 AM | Last Updated on Sun, Oct 7 2018 1:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment