
ట్రుల్లీ... ట్రూలీ అదరహో!
తెల్లటి కొప్పులు పెట్టుకుని, బూడిదరంగు మేఘాలు భూమి మీదికి దిగి బారులు కట్టడం మీరెప్పుడైనా చూశారా?
ఆల్ఫ్ పర్వతశ్రేణి... ఉన్నచోటు నుంచి హఠాత్తుగా మాయమై, చిన్న చిన్న ఇళ్లుగా రూపాంతరం చెందింతే చూడాలని ఉందా?
శిలలు గుడి గోపురాలై దీవించే అద్భుత దృశ్యాన్ని గాంచాలని ఉందా? కొన్ని ప్రదేశాలను భౌగోళిక దృష్టితో మాత్రమే చూడలేం. కావ్య కాల్పనికత మనసులో వెల్లివెరిస్తుంది. ఆల్‌బెరో బెల్లోను చూసినా అంతే. చూసీ చూడగానే ప్రకృతి సృష్టించిన అద్భుతం అనిపిస్తుంది. కానీ కాదు. అది అచ్చంగా మనిషి చేతిలో రూపుదిద్దుకున్న సరికొత్త ప్రపంచం!
ఇటలీలోని ఆల్‌బెరోబెల్లో ప్రదేశం పరంగా కాస్త చిన్నదే కానీ... పేరు పరంగా అతి పెద్ద నగరం. ఈ నగరంలోని 11,000లకు పైగా ఇళ్లు విభిన్నమైన ట్రుల్లీ నిర్మాణశైలిలో ఉంటాయి. ఈ ప్రత్యేకత కారణంగానే ఆల్‌బెరోబెల్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు సంపాదించింది.
పదహారవ శతాబ్దంలో నలభై ఇళ్లతో ఆల్‌బెరోబెల్లోలో ట్రుల్లీ శైలి ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఆ శైలి ప్రత్యేకత ఏమిటంటే, ఇంట్లో ఒకే గది ఉంటుంది. ఒకవేళ ఇల్లు సరిపోవడం లేదు అనుకుంటే, అలాంటివే రెండు మూడు కట్టుకుంటారు తప్ప, మరో గది మాత్రం కట్టరు. అసలు ఇలా ఒకే రకమైన నిర్మాణశైలిలో ఇక్కడి ఇళ్లు ఎందుకు నిర్మాణమయ్యాయి?
పెద్దగా వస్తువులేమీ వాడకుండా దగ్గరలో దొరికే రాతితో చాలా తక్కువ ఖర్చుతో త్వరితగతిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసే సౌలభ్యం ఒక కారణమైతే, ఇంటి పన్ను నుంచి తప్పించుకోవడానికి కొందరు తాత్కాలిక ఆవాసాల పేరుతో వీటిని నిర్మించారని కొందరు చెబుతుం టారు. అయితే అసలీ పట్టణం నిర్మాణం వెనుక మరో ముఖ్యమైన కథ వినిపిస్తూ ఉంటుంది.
ఒకానొక కాలంలో ఆల్‌బెరోబెల్లో నగరంలో ఏదో వ్యాధి సోకి పిల్లలు చనిపోవడం మొదలైంది. పిల్లల్ని మింగే దుష్టశక్తేదో తమను వెంటాడుతోందని భావించిన ప్రజలు ఒక మతగురువు దగ్గరకు వెళ్లారు. అతను ‘ట్రుల్లీ’ శైలిలో ఇళ్లు కట్టుకుంటే దుష్టశక్తులు దరిచేరవని చెప్పాడు. దాంతో ఇలా ఇళ్లు కట్టారట. ఇళ్లపై శిలవలతో సహా రకరకాల గుర్తులు కూడా వేసుకున్నారట. దాంతో దుష్టశక్తి పారిపోయిందని, పిల్లా పాపలు క్షేమంగా ఉన్నారని, నాటి నుంచీ ఈ శైలిలో తప్ప మరో శైలిలో ఇల్లు కట్టకూడదనే నియమం పెట్టుకున్నారట!
‘‘ఏడంతస్తుల మేడలో నివసిస్తున్న సంపన్నుడైనా సరే, ఈ రాతిగుడిసెలను చూస్తే మనసు పారేసుకుంటాడు. వీటిలోనే నివసించాలనుకుంటాడు. స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే ప్రదేశం అనాలా? టైమ్ మిషన్‌లోకి వెనక్కి వెళ్లి గతంలో తచ్చాడడం అనాలా? ఒక చారిత్రక క్షేత్రాన్ని దర్శించుకోవడం అనాలా? ఇలా ఏదీ తేల్చుకోలేని సంభ్రమాశ్చర్యానికి గురవుతాం’’ అని ఆల్‌బెరొబెల్లో గురించి గొప్పగా చెప్పాడు మైఖేల్ టర్టెల్ అనే ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్.
ఆయన మాటలు ముమ్మాటికీ నిజం. ఆ ఇళ్ల సౌందర్యం చెప్పనలవి కానిది. దానికి తోడు అక్కడివాళ్లు చాలా శుభ్రత పాటిస్తారు. ప్రతి ఇంటి ముందూ రంగు రంగుల పూల మొక్కలు పెంచుతారు. దాంతో నగరం మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడి ప్రజలు తయారుచేసే కళాకృతులు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. వారి సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. అందుకే ఈ శ్వేత నగరాన్ని (ఆల్ బెరొబెల్లోను ‘వైట్ సిటీ’ అని పిలుస్తారు) చూడటానికి పర్యాటకులు ప్రతి యేటా పోటెత్తుతుంటారు.