ఎవరు? | who? | Sakshi
Sakshi News home page

ఎవరు?

Published Sun, Dec 28 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

ఎవరు?

ఎవరు?

దీప్తి శ్రీ కవులూరు
‘‘సాయంత్రం నాలుగు గంటలకల్లా ఆఫీస్ దగ్గరకి వస్తే మా బాస్‌తో మాట్లాడిస్తాను, అప్పుడైతే ఆయన ఫ్రీగా ఉంటారు, మళ్లీ 6 దాటితే వెళ్లిపోతారు, ఈ లోపే రా, జాబ్ సంగతి డిసైడ్ చేసేద్దాం...’’ గబగబా చెప్పేసి ఫోన్ పెట్టేసింది అన్హిత. మంచి కంపెనీ, పైగా పార్ట్‌టైమ్ వర్క్. మంచి అవకాశమే అనిపించింది నాకు. సెలక్ట్ కానేమో అనే భయం లేదు. ఎక్స్‌పీరియన్స్, అన్హిత రికమండేషన్ రెండూ ప్లస్సే అని నాకు తెలుసు. ముందే అడ్రస్ చెప్పినా గాని ఎందుకో ఓసారి కన్ఫర్మ్ చేసుకోవాలనిపించింది. నాలుగు గంటలకల్లా ఆఫీస్ దగ్గరకు చేరి ఫోన్ చేశాను.
 
‘‘థర్డ్ ఫ్లోర్‌కి వచ్చి రిసెప్షన్‌లో కూర్చో, నాకో అరగంట పట్టొచ్చు’’ అంది.
 నా టూ వీలర్ పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరకొచ్చాను. కారిడార్ అంతా చీకటిగా ఉంది. బటన్ నొక్కిన చాలాసేపటికి వచ్చింది లిఫ్ట్. చాలా పాతకాలం నాటి బిల్డింగ్. ఎనిమిదంతస్తులు అనుకుంటా. చాలా ఇరుకుగా, గాలి, వెలుతురు చొరబడనట్టుంది. లిఫ్ట్ తలుపు మూసి థర్డ్ ఫ్లోర్‌నొక్కాను. ఓ కుదుపు కుదిపి కదిలిందది. కాని థర్డ్‌లో ఆగలేదు. తిన్నగా ఆరవ ఫ్లోర్‌కి వెళ్ళి ఆగింది. లిఫ్ట్ తలుపు ఎదురుగానే ఉన్న ఓ ఫ్లాట్ తాళం వేసి ఉంది. నేను మళ్లీ 3వ నంబర్ నొక్కాను. లిఫ్ట్ చాలా నెమ్మదిగా వెళుతోంది. ఆశ్చర్యం! ఈసారీ అది మూడు దగ్గర ఆగలేదు. తిన్నగా వెళ్లి అండర్ గ్రౌండ్ దగ్గర ఆగింది. అక్కడంతా కటిక చీకటిగా ఉంది. లిఫ్ట్‌లో లైట్ లేదు. పగలే ఇంత చీకటా... అనిపించింది.
 
లాభం లేదు. మెట్లెక్కి వెళ్లిపోవడం నయం అనుకుని గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కాను. ఈసారి చెప్పిన చోటే ఆగింది. రక్షించావు దేవుడా అనుకుంటూ తలుపు తీయబోయాను. ఎంత లాగినా గ్రిల్ తెరుచుకోవడం లేదు. ఇందాక వచ్చినప్పుడు తేలిగ్గానే తెరుచుకుంది మరి, ఇప్పుడెందుకిలా బిగుసుకుపోయిందో! నాలుగైదుసార్లు ప్రయత్నించినా గ్రిల్ తెరుచుకోకపోవడంతో నాలో అంత వరకూ అణిచిపెట్టుకున్న కోపం ఎక్కువైపోయింది. దిక్కుమాలిన లిఫ్ట్. అసలు ఫస్టే మెట్లమీదుగా వెళ్ళిపోయి ఉండాల్సింది! బయట ఎవరైనా కనిపిస్తారేమో చూశాను. వాచ్‌మెన్ అని పిలిచాను... హలో... హలో... అంటూ కేకలు పెట్టినా అక్కడ నామాట తప్ప మరో మాట వినిపిస్తేగా! అస్సలు మనుష్య సంచారమే లేనట్టున్న ఈ బిల్డింగ్‌లో ఆఫీసులున్నాయా? వేరే ఫ్లోర్‌లో ఆగుతుందేమో చూద్దామని రెండవ ఫ్లోర్ బటన్ నొక్కాను. ఎందుకైనా మంచిదని వరుసపెట్టి ఎనిమిది ఫ్లోర్‌ల బటన్స్ టపీటపీమని నొక్కేసాను కచ్చిగా. లిఫ్ట్ ప్రయాణం మళ్లీ మొదలైంది. ఈసారి అది తిన్నగా వెళ్లి ఎనిమిదో ఫ్లోర్లో ఆగింది. లిఫ్టు వెళుతున్న ఫ్లోర్‌లు అన్నీ అలికిడే లేనట్టు ఉండడంతో నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇక ఈ లిఫ్ట్ ఆటలు చాలించి దిగి నడవడం బెటర్ అనిపించింది. అప్పటికే నేనువచ్చి పది నిమిషాలు దాటి ఉంటుంది. నెమ్మదిగా దిగి వెళ్లినా అను చెప్పిన టైమ్ లోపల రిసెప్షన్‌లో పడొచ్చు.
 
దేవుడికి మనసులోనే దణ్ణం పెట్టుకుని లిఫ్ట్ తలుపు లాగాను. తేలిగ్గానే తెరుచుకుంది. బిల్డింగ్‌కి ఇదే పై అంతస్తు. లిఫ్ట్ తలుపు ఎదురుగా ఓ ఫ్లాట్ ఉంది. డ్రీమ్స్ టెక్నాలజీస్ బోర్డ్ దగ్గర లైట్ వెలుగుతోంది. ఫ్లోర్ అంతా మసక చీకటి అలుముకుని ఉంది. మెట్లు ఎటు ఉన్నాయో చూస్తున్నాను. ఫ్లోర్ అంతా ఎంత నిశబ్దంగా ఉందంటే నా అడుగుల చప్పుడు నాకే భయంకరంగా వినిపిస్తోంది. వీలైనంత త్వరగా కిందకి వెళ్లిపోవాలి! లక్కీగా లిఫ్ట్‌కి కొంచెం దూరం తర్వాత కుడివైపు మెట్లు కనబడ్డాయి. అన్నీ దుమ్ముకొట్టుకుపోయాయి. గోడల మీద చేయి వేయడానికి లేనట్టున్నాయి. మెట్లు దిగుతూ ఏడవ ఫ్లోర్‌కి వచ్చాను. ఫ్లోర్ అంతా చీకటిగా ఉంది. మెట్ల దగ్గర్నుంచి కారిడార్ అంతా రకరకాల అట్టపెట్టెలు పడున్నాయి. వాటి మధ్య దారి చేసుకుంటూ వెళ్తుంటే తర్వాత ఫ్లోర్‌కి దిగాల్సిన చోట మెట్లకు అడ్డంగా చెక్కలు పేర్చి ఉన్నాయి. కిందినుంచి పైకి రాకుండా అడ్డుపెట్టినట్టుంది. మెట్లకి అవతల మరో ఫ్లాట్‌లోంచి వెలుతురు కనిపిస్తోంది. అక్కడెవరో ఉన్నట్టున్నారు!
 
నెమ్మదిగా అట్టలు దాటుకుంటూ ఆ వెలుతురు వైపు వెళ్లాను. అది ఫ్లాట్ కాదు. టాయిలెట్స్ ప్లేస్. గోడ ఎడ్జ్ దగ్గరున్న కిటికీలోంచి కొద్దిగా వెలుతురు పడుతోంది. మళ్లీ తిరిగి మెట్ల దగ్గరకొచ్చాను. తెలియకుండా నాలో నెమ్మదిగా భయం మొదలైందని అర్థం అవుతోంది నాకు. కాస్త చెమటలు కూడా పడుతున్నాయి. ఒకసారి అన్హితకి ఫోన్ చేస్తే మంచిదనిపించింది. బ్యాగ్‌లోంచి సెల్ బయటకు తీసి కాల్ చేశాను. ఫోన్ రింగ్ కావడం లేదు. రెండు మూడు సార్లు ట్రై చేసినా అసలెలాంటి సౌండ్ రావడం లేదు. డౌట్ వచ్చి చూశా. సిగ్నల్ లేదు. నా భయం రెట్టింపైంది. ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచించాక, తిరిగి ఎనిమిదో ఫ్లోర్‌లోకి వెళ్లి లిఫ్ట్‌లో కిందికెళ్లిపోవడం కరెక్ట్ అనిపించింది. కిందికెళ్లాక తలుపు తెరుచుకోకపోతే కనీసం ఎవరినైనా కేకలేసి పిలవచ్చు. ఆ ఆలోచన రాగానే స్పీడ్‌గా ఎనిమిదో ఫ్లోర్‌లోకి చేరాను.
 
అప్పుడే లిఫ్ట్ కిందకెళిపోయినట్టుంది. బటన్ నొక్కాను. అది వచ్చేలోగా నా చూపులు ఆ ఫ్లోర్‌ని మళ్లీ పరిశీలించడం మొదలెట్టాయి. ఇందాక వెలుగుతున్న డ్రీమ్స్ టెక్నాలజీ బోర్డు దగ్గర లైట్ ఆరిపోయింది. అంటే పవర్ లేదా? కానీ లిఫ్ట్ కదులుతున్న సౌండ్ మాత్రం వస్తోందే! రెండు, మూడు నిమిషాలు గడిచాయి. లిఫ్ట్ సౌండ్ తప్ప లిఫ్ట్ రాలేదు. అతి కష్టం మీద కూడదీసుకుంటున్న ధైర్యం జారిపోతోంది. ఎదురుగా ఉన్న ఫ్లాట్ తలుపు అలాగే ఓరగా వేసుంది. లోపలెవరైనా ఉన్నారేమో కాస్త పిలిస్తే... అనిపించింది. వెనక్కి తిరిగి లిఫ్ట్ కోసం చూస్తూనే ఫ్లాట్ తలుపు దగ్గరికి వెళ్లాను. నెమ్మదిగా డోర్ పూర్తిగా తీసా. ఒకవైపు సోఫా, రిసెప్షన్ టేబుల్, గోడకి అద్దాల అల్మరా. అందులో ఒక్క వస్తువు కూడా లేదు. దాని పక్కనే మరో గది తలుపు. ‘హలో ఎక్స్‌క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా?’ నా గొంతులో వణుకు నాకు మరింత వణుకు పుట్టించింది. అలా వెనక్కి చూసుకుంటూనే, రెండడుగులు ముందుకేసాను. లోపలెవరైనా ఉంటే కనిపిస్తారని.
 
లోపల గది నాకిప్పుడు బాగా కనిపిస్తోంది. ఆ గది అద్దాల కిటికీలోంచి వెలుతురు గదిలో పరుచుకుని ఉంది. సగం విరిగిన కుర్చీలు, కుషన్ మొత్తం పాడైపోయిన సోఫాలు, పాత ట్యూబ్‌లైట్లు, రకరకాల వస్తువులతో నిండిపోయి ఉందా రూమ్. ఈ మొత్తం బిల్డింగ్‌కి స్టోర్‌రూమ్ అనిపించేలా ఉంది. సో ఇక్కడెవరూ లేరన్న మాట. నా మనసెందుకో కీడును శంకిస్తోంది. అరచేతిలోనే ఉన్న ఫోన్‌ను చూసుకున్నా ఒకసారి. ఇక్కడేమన్నా సిగ్నల్ వస్తుందేమోనని. లేదు. ఫోన్‌ని కాస్త అటు ఇటూ కదిపి చూశా. ఒక మూల కాకపోతే ఒక మూలైనా సిగ్నల్ తగులుతుందని. ఇప్పుడు నా దృష్టి బ్యాటరీ మీద పడింది. జస్ట్ 5 పర్సంట్ చూపిస్తోంది.
 
ఇక తెగించి ఏదైనా చేయాల్సిందే అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్ల మీద నించి దిగి వెళ్లిపోవాల్సిందే. 7వ ఫ్లోర్‌లో అడ్డంగా ఉన్న చెక్కలను జరిపి వెళ్లిపోతేనో! అనుకుందే తడవుగా మళ్లీ సెవెంత్ ఫ్లోర్‌లోకి వెళ్లాను. మెట్లకు అడ్డంగా వాలుగా పెట్టి ఉన్న చెక్కలను ఒక్కొక్కటే తీసాను. కొన్ని తీసేసరికి దాటి వెళ్లేందుకు వీలైంది. కాస్త ఇబ్బందనిపించినా, వాటిని దాటుకుని మెట్లు దిగేశాను. హమ్మయ్య ఇక మూడు ఫ్లోర్‌లు దిగిపోతే చాలు అనుకోగానే చాలా ఉత్సాహం వచ్చేసింది. 6వ ఫ్లోర్‌కి వచ్చేశాను. అక్కడ నుండి మెట్లు దిగబోతుండగా మెట్ల అవతల నుంచి అలికిడి వినిపించింది. ఎవరైనా ఉన్నారా.... ఇక్కడ ఎవరైనా ఉన్నారా.... అంటూ ఎవరిదో గొంతు ఆ ఫ్లోర్‌లో ప్రతిధ్వనిస్తూ వినిపిస్తోంది. మెట్లు దిగి వెళ్లిపోవాలన్న నా ప్రయత్నం ఎందుకో ఆగిపోయింది. నాలాగే ఇంకెవరన్నా వచ్చి ఇరుక్కున్నారేమో అనిపించింది. ఎవరైనా ఉన్నారా హలో! హలో...! మళ్లీ వినిపిస్తున్న ఆ కంఠం నన్ను మెట్లు దిగనివ్వడం లేదు.
 
గబగబా ఆ వైపు కదిలాను నేను. 7వ ఫ్లోర్లో వెలుతురు కనిపించిన బాత్‌రూమ్స్‌కి సరిగ్గా కిందే ఉంది నాకా మాటలు వినిపించే చోటు. దగ్గరికి వెళ్లే కొద్దీ నాకాగొంతు దూరమవుతున్నట్టు వినిపిస్తోంది చిత్రంగా. ఎవరండీ...? మీరెక్కడున్నారు? అంటూ సాధ్యమైనంత గట్టిగా అనడానికే ప్రయత్నించా. కానీ పీలగా వస్తోంది నా గొంతు.టాయిలెట్స్ అని రాసి ఉన్న గదిలోకి అడుగుపెట్టాను. ఎదురుగా పొడవాటి అద్దం ఉంది. చాలా పాతబడిపోయి, వెలిసిపోయిన ఫొటో ఫ్రేమ్‌లా ఉంది. అందులో చూసుకుంటే ఎవరి ముఖం వాళ్లు గుర్తుపట్టడం కష్టమే. ఆ అద్దానికి పక్కగా వరుసగా మూడు టాయిలెట్స్ ఉన్నాయి. అన్నీ తలుపు మూసి, బయట గొళ్లాలు పెట్టి ఉన్నాయి.
 
హలో! ఎవరు? మీరిక్కడే ఉన్నారా. లోపలెవరైనా ఉండిపోయారేమో అనుకుంటూ పిలుస్తున్నాను. నేను పిలవడం ఆపేసినా... హలో... హలో.... హలో....! నా హలో నా చెవుల్లో మారుమోగుతోంది. నా పిలుపు కాదు నా ఫోన్ రింగ్ టోన్ అని అర్థం అవ్వడానికి కొన్ని సెకన్లు పట్టింది. చప్పున ఫోన్ చూసుకున్నా. ఏ నంబరూ లేదు... మిస్డ్ కాలూ లేదు. అక్కడ మరో మనిషి అలికిడీ లేదు.
 గుండె వేగం హెచ్చింది. వెనక్కి తిరిగి మెట్ల దగ్గరకి పరిగెత్తాను. దేవుడా నన్నీ భూత్ బంగ్లా నుంచి బయటపడేలా చేయి స్వామీ! మనసులో వంద మొక్కులు మొక్కుకుంటూ పరిగెడుతున్నాను.

నా చీర కుచ్చిళ్లు నా కాళ్లకే అడ్డం పడుతున్నాయి. ఇలాంటి దిక్కుమాలిన చోట ఉద్యోగం చేస్తున్న అన్హిత మీద ఎక్కడలేని కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని భయం డామినేట్  చేస్తోంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కిందకి దిగిపోవాలి. ఆరో ఫ్లోర్ దాటి ఐదో ఫ్లోర్లోకి వచ్చేసాను. ఇంకెన్ని...? రెండే... రెండు ఫ్లోర్‌లు దిగిపోతే చాలు. అన్హిత ఆఫీసు ఉన్న ప్లోర్ వచ్చేస్తుంది. బయటపడిపోయినట్టే. ఇక శబ్దాలు వినబడ్డా ఆగకూడదు... ఆగకూడదు... మనసుకి గట్టిగా చెప్పుకుంటున్నా.
 
ఐదో ఫ్లోర్ మెట్ల దగ్గరలో ఉన్నా. అంతలో మెట్ల అవతల టాయిలెట్స్ వైపు నుంచి హఠాత్తుగా ఓ కంఠం పిలిచింది ‘ప్రణతీ’ అని. ఆశ్చర్యంగా ఉంది. కరెక్ట్‌గా పైఫ్లోర్‌లో నాకు గొంతు వినిపించిన అదే బాత్ రూమ్ ప్లేస్. నా కాళ్లు అక్కడే ఆగిపోయాయి. ‘ప్రణతీ...’ ఈసారి మరింత స్పష్టంగా వినిపించింది ఆ గొంతు. నాపేరు పిలుస్తున్న ఆ గొంతు ఎవరిదో పోల్చుకోవాలని ప్రయత్నిస్తున్నా. కచ్చితంగా అన్హితది కాదు. ఎవరు మరి నన్ను పిలిచేది? నా కాళ్లు ముందుకు సాగడం లేదు. కాని నా కళ్లు మాత్రం వేగంగా పరిగెడుతున్నాయి, పరికిస్తున్నాయి. ఇప్పటిదాకా ఆగకుండా పిలిచిన గొంతు ఉన్నట్టుండి ఆగిపోయింది. అప్పుడు కనిపించింది సన్నటి నీడ. బాత్‌రూమ్ ఎదురు గోడ మీద. నీడనుబట్టి అది ఆడో, మగో అర్థం కావడం లేదు. కాని ఆ నీడ కదులుతోందని మాత్రం తెలుస్తోంది. అది నా దగ్గరికే వస్తోందని అర్థం అవుతోంది.
 
ఎవరది? అడగాలని చాలా ప్రయత్నం చేస్తున్నా. నా గొంతు పెగలడం లేదు. అసలు పెదాలే కదలడం లేదు. అరిచేతులు బిగుసుకుంటున్నాయి. ఫోన్ చూశాను. బ్యాటరీ అయిపోయి నిర్జీవంగా కనిపిస్తోంది. ఏం చేయాలి? ఏం చేయాలి? నీడ కదులుతోంది..! నావైపే కదులుతోంది..! ఏం చేయాలి...? నేనెందుకు కదలలేకపోతున్నాను? అసలు స్పృహలోనే ఉన్నానా...? ఏమో...! నాకు దిక్కుతోచడం లేదు. కళ్లు మూసుకుంటేనో! బిగుసుకుపోయిన రెండు చేతులను, ఊపిరితో సహా మరింత బిగదీసుకుని రెండు కళ్లూ మూసుకున్నాను. ఇక నా చేతుల్లో ఏమీ లేనట్టే. ఏం జరిగినా సరే. కళ్లు తెరవకూడదు. మనసులో మెదిలిన చివరి ఆలోచన... నా పని ఫినిష్ అయిపోయినట్టేనా...!
    
కళ్లు తెరిచాను. ఎలా? ఎవరు తెరవమన్నారు? రెండు చేతులూ కదిలాయి. చేతుల్లో ఏమీ లేవు. పైగా నిలబడి లేను. పడుకుని ఉన్నా. నా ఎదురుగా ఎవరో ఉన్నారు. కానీ మసగ్గా ఉంది. కళ్లు నులుముకున్నాను. ఇప్పుడు ఎదురుగా ఉన్నదెవరో అర్థం అయింది. అన్హిత!
 ‘‘అన్హిత...’’ నేను ఏదో చెప్పబోయాను. పక్కనుంచి ఎవరో వారించారు. ‘‘కంగారు పడకండి. ఏం భయం లేదు’’. ఆ గొంతు వినిపించిన వైపు చూశాను. ఆరడుగుల ఎత్తు, సూట్ వేసుకున్న మనిషి. ‘ఇప్పుడు మీరు బాగానే ఉన్నా’రని చెబుతున్నాడు.
 
నాకేమైంది...? అన్హిత వైపు చూస్తూ అడిగాను. ‘‘కంగారుపడకే. కాస్త అన్‌కాన్షస్ అయ్యావంతే. లక్కీగా నా కొలీగ్ సతీష్ చూసి నిన్ను హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. అయినా నువ్వా పాడుబడ్డ బిల్డింగ్‌లోకి ఎందుకెళ్లావు?’’ ఆశ్చర్యంగా అడిగింది అన్హిత.
 ‘‘నువు చెప్పిన అడ్రస్ అదే కదా!’’ అంతే ఆశ్చర్యంగా అన్నాను అది చెప్పిన అడ్రస్ గుర్తు చేసుకుంటూ.
 ‘‘నేను చెప్పింది ఈ లైన్‌లో మూడో బిల్డింగ్‌కి రమ్మని. నువ్వు నాలుగో బిల్డింగ్‌లోకి వెళ్లావు. అది చాలాకాలంగా పాడుబడి ఉంది. నేను మీటింగ్‌లో ఉన్నానని, నిన్ను రిసీవ్ చేసుకొమ్మని సతీష్‌కి కాల్ చేశా. ఆ టైమ్‌కి అతను కిందే ఉన్నాడు. నీ బైక్ ఆ బిల్డింగ్‌లోకి వెళ్లడం చూశాడట. నువ్వే తిరిగి వస్తావని పదినిమిషాలు వెయిట్ చేసి ఎంతకీ రాకపోయేసరికి తనే లోపలకి వచ్చాడు. వచ్చేసరికి నీ బైక్ తప్ప నువు కనిపించకపోవడంతో తను బిల్డింగ్‌లోకి వచ్చాడు’’.
 
సతీష్ అందుకున్నాడు. ‘‘మీరు లోపలికి వెళ్లారేమో అని గెస్ చేశాను. అక్కడ లిఫ్ట్ సరిగా పని చేయడం లేదు. అందుకే మెట్ల మీద నుంచి పైదాకా వచ్చాను. 7వ ఫ్లోర్ దగ్గర చెక్కలు అడ్డంగా ఉన్నాయి. అంతకంటే పైకి వెళ్లి ఉండరేమో అనుకున్నా. అక్కడ నుండి కిందకి వచ్చేసాక పైన లిఫ్ట్ కదులుతున్న చప్పుడైంది. అందుకే మీరు లోపలున్నారేమో అని పిలుస్తూ వచ్చాను. బాత్‌రూమ్స్ దగ్గర నుండి చప్పుడయ్యేసరికి వరుసగా అన్ని ఫ్లోర్‌లలోనూ చెక్ చేసుకుంటూ వస్తుంటే... అక్కడ మీరు కళ్లు మూసుకుని భయంతో బిగుసుకుపోయి కనిపించారు. ఎంత పిలిచినా పలకలేదు. తట్టి చూసేసరికి పడిపోబోయారు. కిందకి తీసుకొచ్చి అన్హితకి కాల్ చేశాను. ఇద్దరం కలసి ఇక్కడ అడ్మిట్ చేశాం’’.
 
హమ్మయ్య అనిపించింది నాకు. ‘‘చాలా థాంక్సండీ. ప్రణతీ ప్రణతీ అని పిలుస్తుంటే ఎవరిదా తెలియని గొంతు అనుకుని ఎంత భయపడిపోయానో. 5వ ఫ్లోర్‌లో బాత్‌రూమ్‌ల దగ్గర నుండి వస్తున్న మీ నీడను చూసి ఇంకా బెదిరిపోయాను’’ ఆ క్షణాల్ని గుర్తుచేసుకుంటూ అన్నాను. అతను నా వైపు విచిత్రంగా చూశాడు. ‘‘నేను 5వ ఫ్లోర్ బాత్‌రూమ్స్ దగ్గర నుంచి రాలేదే. కింద ఫ్లోర్ నుంచి వచ్చాను. అయినా మీ పేరు నేను పిలవనేలేదే! అన్హిత హడావుడిగా చెప్పి పెట్టేసింది. మీ మోపెడ్ మాత్రం గుర్తుపట్టి లోపలికొచ్చా. పేరు గుర్తురాకే ఎవరైనా ఉన్నారా’’ అంటూ పిలిచాను.మరి నన్ను పేరు పెట్టి పిలిచిన ఆ అజ్ఞాత కంఠం ఎవరిదీ!? బాత్‌రూమ్ ఎదురు గోడ మీద నావైపు వస్తూ కనిపించిన నీడెవరిదీ??! ఆలోచిస్తూ హాస్పిటల్ బెడ్ మీదే మళ్లీ గట్టిగా కళ్లు మూసుకున్నాను.
 
ఇందాక వెలుగుతున్న డ్రీమ్స్ టెక్నాలజీ బోర్డు దగ్గర లైట్ ఆరిపోయింది. అంటే పవర్ లేదా? కానీ లిఫ్ట్ కదులుతున్న సౌండ్ మాత్రం వస్తోందే! రెండు, మూడు నిమిషాలు గడిచాయి. లిఫ్ట్ సౌండ్ తప్ప లిఫ్ట్ రాలేదు.

దేవుడా నన్నీ భూత్ బంగ్లా నుంచి బయటపడేలా చేయి స్వామీ! మనసులో వంద మొక్కులు మొక్కుకుంటూ పరిగెడుతున్నాను. నా చీర కుచ్చిళ్లు నా కాళ్లకే అడ్డం పడుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement