చలికాలంలో రక్షణ ఇలా..! | Winter Care , Temperature | Sakshi
Sakshi News home page

చలికాలంలో రక్షణ ఇలా..!

Published Sun, Nov 6 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

చలికాలంలో రక్షణ ఇలా..!

చలికాలంలో రక్షణ ఇలా..!

శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసుకోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి.
 
  జీవామృతాన్ని 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10-15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.   ఆచ్ఛాదన: కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది.  ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులు: టమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి.
 
 పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నే మసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే.
 
 పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండిపోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామర పురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు.
 
 బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది.  రసం పీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలు రసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయాన్ని (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7-10 రోజులకోసారి పిచికారీ చేయాలి.
 
 వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు).  వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి.
 
 వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బుపొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి.
 
  నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ప్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు.
 
 రసం పీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే?
 రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్‌హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి.
 - డా. గడ్డం రాజశేఖర్ (83329 45368),
 సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement