ఈ ఏడాది నవంబరు మాసం వచ్చినా కూడా సాధారణంగా ఉండేంత చలి వణికించకపోయినా, మిగతా సీజన్లతో పోలిస్తే చలి కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. చలిగాలులు సోకకుండా ఉన్ని,ఊలు దుస్తులను ధరించడంతోపాటు, రోగనిరోధక శక్తిని కాపాడుకునేలా ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి.
చలికాలంలో శ్వాసకోస వాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అ ప్రమత్తంగా ఉండాలి. శరీరం వేడిగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. స్వెట్లర్లు, సాక్సులు, మంకీ క్యాప్‌లు విధింగా ధరించేలా చూడాలి. లేదంటే జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
తాజా పండ్లు, ఆకుకూరలతో పాటు, తృణధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలి.
నిల్వచేసిన, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారానికి బదులుగా ఎప్పటికప్పుడు వేడిగా తినడం మంచిది. అలాగే చలిగా ఉంది కదా అని మరీ వేడి నీటితో స్నానం చేయకూడదు.
తల స్నానానికి కూడా గోరు వెచ్చని నీరు అయితే మంచిది. చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే, చలికాలంలో జుట్టును శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. మైల్డ్ షాంపూ వాడాలి.
చలికాలంలో వేడి నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. గొంతు నొప్పి లాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ముఖ్యంగా విటమిన్ సీ, ఏ, లభించేలా చూసుకోవాలి. అలాగే చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డీ అందేలా చూసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇలా అనేక రకాల సీజనల్ వ్యాధులను, ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుంచి ఇది కాపాడతాయి. కొవ్వు చేపలు, కోడిగుడ్డు,మష్రూమ్స్, సోయా మిల్క్ వంటి వాటిలో డీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తిని పెంచేలా విటమిన్ సీ లభించే సిట్రస్ పండ్లను తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బ్రోకలీ, బెర్రీ, వివిధ రకాల సిట్రస్ పండ్లపై దృష్టిపెట్టాలి. నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, గుమ్మడి గింజలు, చేపలు వంటివి తీసుకోవాలి.
విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, పాలు, చీజ్ బీఫ్ లివర్, క్యాప్సికం, గుమ్మడి కాయ కూరగాయలను తీసుకోవాలి. విటమిన్ ఏ చర్మానికి, కంటి ఆరోగ్యానికి మంచిది.
వీటితోపాటు, శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన బీ 12,బీ6ను తీసుకోవాలి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులనుంచి రక్షిస్తాయి. సాల్మన్ చేపలు, టునా ఫిష్, చికెన్, కోడిగుడ్లు, పాలు వంటి పదార్థాల్లో విటమిన్ బి 12 లభిస్తుంది.
చలికాలంలో చర్మంపై కూడా చాలా ప్రభావం ఉంటుంది. పగలడం, ఎండిపోయినట్టు అవ్వడం చాలా సాధారణంగా కనిపించే సమస్యు. అందుకే దాహంగా అనిపించకపోయినా, సాధ్యమైనన్ని నీళ్లను తాగుతూ ఉండాలి. దీంతో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా, తేమగా ఉంటుంది. రాగుల జావ, తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.
డ్రై స్కిన్ ఉన్న వారికి చిట పటలాడం, మంట పెట్టడం, దురద పెట్టడం లాంటి ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు ఖ వింటర్ సీజన్ లో మాయిశ్చ రైజింగ్ క్రీములు వాడాలి.
చర్మ సంరక్షణ కోసం రసాయన సబ్బులకు బదులుగా ప్రకృతిసిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న సున్ని పిండి వాడితే ఉత్తమం. లేదా ఆయుర్వేద, లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న సబ్బులను వినియోగించాలి. లేదంటే గ్లిసరిన్ సబ్బులను ఎంచుకోవాలి. విటమిన్ ఇ లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment