నా పరిస్థితి నరకంలా ఉంది... | Yandamuri Veerendranath solve of Love problems | Sakshi
Sakshi News home page

నా పరిస్థితి నరకంలా ఉంది...

Published Sun, Jun 12 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

నా పరిస్థితి నరకంలా ఉంది...

నా పరిస్థితి నరకంలా ఉంది...

జీవన గమనం
నాకు ఒక అమ్మాయి పరిచయమైంది. ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అంతా బాగానే ఉందనుకునే లోపు ఈ మధ్యే ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో మ్యారేజ్ జరిగింది. అప్పటి నుంచి ఆమె నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అంటీ ముట్టనట్టుగా ఉంటోంది. ఇది వరకు ఎంతో క్లోజ్‌గా మాట్లాడే తను ఈ మధ్య నాతో ఏదో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతోంది. ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అన్న తనే ఇప్పుడు అదంతా అప్పటి మాట అంటోంది. ఈ పరిస్థితి నాకు నరకంలా ఉంది. తన గురించి ఆలోచించకుండా ఉండలేక పోతున్నా. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. దయ చేసి తగిన పరిష్కారం సూచించండి.
 - జగదీశ్, ఈ-మెయిల్

 
ఒక వ్యక్తి తన మనసులో భావాలు మరో వ్యక్తితో పంచుకోవటం కోసం పెట్టుకున్న పేరే ‘స్నేహం’ అని ఎక్కడో రాశాను. దీనికి తోడు స్త్రీ పురుషుల మధ్య స్నేహంలో ‘ఆకర్షణ’ అనే మరో అంశం కూడా ఉంటుంది. ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలో నాగేశ్వరరావు సావిత్రిని పవిత్రంగా ప్రేమిస్తాడు. అర్ధరాత్రయినా మూడ్ వస్తే (చూడాలన్న మూడ్ వస్తే) నిష్కల్మష హృదయంతో వెళ్లి తలుపు కొడుతూ ఉంటాడు.

వీరి పవిత్ర స్నేహం చూసి సావిత్రి మొగుడుకి ఒళ్లుమండి, నిండు గర్భవతిని ఇంట్లోంచి గెంటేస్తాడు. తాను ఆమెని ‘చెల్లి’గా ప్రేమిస్తున్నానని హీరో క్లారిఫై చేస్తే, అప్పుడు జగ్గయ్య కళ్లు తెరుచుకుంటాయి. స్క్రీన్‌ప్లే చెయ్యటానికి తల ప్రాణం తోకకొచ్చిందని ఆ సినిమా రచయిత గొల్లపూడి మారుతీరావు స్వయంగా చెప్పారు. ఎందుకంటే, అది ‘అన్నా- చెల్లి అనుబంధం’ అని ముందే చెబితే సస్పెన్స్ ఉండదు.

చివర్లో చెబితే, ‘ఈ విషయం ముందే చెప్పి ఏడవొచ్చు కదా’ అని ప్రేక్షకులు విసుక్కునే ప్రమాదం ఉంది. ఈ కత్తి మీద సాముని (ప్రేక్షకులకు మాత్రమే తెలిసేటట్టూ, పాత్రలకు తెలియకుండా నాగేశ్వరరావుకి ఫ్లాష్‌బ్యాక్‌లో ఒక చెల్లిని సృష్టించి, ఆమెతో ‘పాడమని నన్నడగవలెనా/ పాడమని నన్నడగ తగునా’ అన్న రెండర్థాల ఆత్రేయ పాట పాడించి) చేశారు కాబట్టి హిట్టయింది. స్త్రీ పురుషుల మధ్య పవిత్ర స్నేహాన్ని భర్తలే కాదు, ప్రేక్షకులు కూడా ఒప్పుకోరని చెప్పటం ఇక్కడ ఉద్దేశం.
 
పెళ్లవగానే భర్తతో గొడవలెందుకని మీ స్నేహితురాలు మిమ్మల్ని దూరంగా పెట్టి ఉండవచ్చు లేదా మీ మీద ఇంటరెస్టు తగ్గిపోయి ఉండవచ్చు. మీరు ఆమెకు రాఖీ కట్టి వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వటం ఒక మార్గం. దానికన్నా... మీరు కూడా పెళ్లి చేసుకుని, మీ భార్యలోనే మంచి స్నేహితురాల్ని చూసుకోవటం ఉత్తమం.
 
నేను  ఇంటర్‌లో ఉండగా ఒక వ్యక్తిని ప్రేమించాను. నేను డిగ్రీలోకి వచ్చాక ఈ సంగతి తెలిసి మా పేరెంట్స్ హెచ్చరించారు. నేను ప్రేమించడం మాత్రం మానలేదు. దీంతో నన్ను కాలేజీకి పంపడం మానేశారు. మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను అనే మాట ఇచ్చిన తరువాత కొద్దిరోజులుగా కాలేజీకి వెళ్తున్నాను. ఈలోగా అతడు వేరే మతం పుచ్చుకున్నాడని తెలియడంతో  మేం విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోవ్యక్తి  నా జీవితంలోకి వచ్చాడు. నేను టెన్త్‌లో ఉన్నప్పటి నుంచి  నా మీద ప్రేమ పెంచుకున్నాడు.  మేం ఒకే కులానికి చెందిన వాళ్లం. నేను అతనితో ప్రేమలో పడ్డాను. అతనికి ఆస్తులేమీ లేవు. మా పేరెంట్స్ ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆస్తిపరుడైన అబ్బాయి కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి?
 - పేరు రాయలేదు

 
మన జీవితంలోంచి ఒకరు నిష్క్రమించినప్పుడు, ప్రేమని తిరిగి ఫ్రెష్‌గా మొదలుపెట్టవచ్చనీ, ప్రేమను పునః ప్రారంభించటం తప్పు కాదనీ చెప్పే ఒక పాజిటివ్ వివాదాస్పదమైన చర్చ ‘ప్రేమ ఒక కళ’ అన్న పుస్తకంలో జరిగింది. ప్రేమలో ఫెయిల్ అయితే, జీవితం అక్కడే ఆగిపోదు. జీవితంలో కామాలే తప్ప ఫుల్‌స్టాపులు ఉండవు అన్న ఆ పుస్తకంలోని వాక్యాన్ని నిజం చేసినందుకు ముందుగా అభినందనలు.

ఇక మీ సమస్యకొస్తే, ప్రతీ సమస్యకీ రెండు మూడు పరిష్కారాలు ఉంటాయి. ఏ పరిష్కారం మనకు ’ఆరోగ్యకరమైన సంతోషాన్ని’ ఇస్తుందో తెలుసుకుంటే, సగం సమస్యలు ఉండవు. పరిష్కారం మెట్లు మెట్లుగా అలోచించాలి. ప్రేమ ముఖ్యమనుకుంటే ఆ రెండో అబ్బాయిని మీ తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళ్లండి. వాళ్లు వద్దంటే, అబ్బాయిని వదిలెయ్యాలా? మీ పెద్దల్ని వదిలెయ్యాలా తేల్చుకోండి. అబ్బాయిని వదిలెయ్యాలనుకుంటే, పెద్దలు కుదిర్చిన పెళ్లికొడుకుని మూడోసారి ప్రేమించి, జీవితాన్ని సుఖమయం చేసుకోండి.
- యండమూరి వీరేంద్రనాథ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement