యాతమేసి తోడినా...
‘ప్రాణం ఖరీదు’ చిత్రంలోని జాలాది రచించిన ‘యాతమేసి తోడినా...’ పాటపై జయరాజ్ అనుభూతులు ఆయన మాటల్లోనే...
జాలాది రాసిన ఈ పాటలో అమ్మతనం , ప్రేమ, అనురాగాలు అణువణువునా కనిపిస్తాయి. కోటానుకోట్ల ప్రజలను తన వెంట తీసుకుని సూర్యుని చుట్టూ తిరిగి రావడంలో పుడమిలో అమ్మతనం కనిపిస్తుంది.
అమ్మ చనుబాల ఋణం తీర్చుకోలేనిది. స్త్రీ ఒక బిడ్డను కని బలహీనమైనప్పటి నుంచి పురుషుడి ఆధిక్యత, స్త్రీ మీద పెత్తనం ప్రారంభమయ్యాయి. మారిన ఈ సమాజంలో అమ్మతనం, మాతృత్వం తెలిపే పాట, మనందరికీ ప్రాణమైన అమ్మ గురించి తెలిపే పాట. యాతమేసి తోడినా ఏరు ఎండదు/ పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు/ దేవుడి గుడిలోదైనా పూరిగుడిసెలోదైనా/ గాలి ఇసిరి కొడితే.../ ఆ దీపముండదు... ఆ దీపముండదు...ఎంతో వేదాంతాన్ని ప్రబోధించే పాట ఇది. దీపం దేవుడి గుడిలో వెలిగించినా, పూరి గుడిసెలో వెలిగించినా, పెనుగాలి వీస్తే ఆ దీపం కొండెక్కుతుంది. భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటే. ఆయనకు పెద్దా, చిన్నా తేడా లేదు... అని ఈ పల్లవిలో చెప్పారు జాలాది.
అలా రాస్తూ రాస్తూ...
పలుపు తాడు మెడకేస్తే పాడియావురా/ పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా.../ కుడితి నీళ్లు పోసినా... అది పాలు కుడుపుతాది/ కడుపు కోత కోసినా... అది మనిషికే జన్మ ఇత్తాది/ బొడ్డు పేగు తెగి పడ్డ రోజు తెలుసుకో గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో... అంటారు.పలుపుతాడు మెడకేస్తే పాడియావురా పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా... అని స్త్రీని వర్ణించిన అద్భుతమైన ఈ పాట విన్నప్పుడల్లా గుండె బద్దలవుతుంది. నాకు ఇష్టమైన పాట. మధురమైన పాట. నేను మర్చిపోలేని పాట.
అందరూ నడిచిన తోవ ఒక్కటే/ చీము నెత్తురులు పారే తూము ఒక్కటే/ భగవంతుడి సృష్టిలో మనమందరం సమానమే. అందరం నడిచే మార్గం ఒకలాగే ఉంటుంది. పేదలకు ఒక తోవ, సంపన్నులకు ఒక తోవ ఉండదు. అదేవిధంగా అందరిలోనూ చీము నెత్తురులు ప్రవహించే మార్గం ఒక్కటే అంటూ ఎంతో వేదాంతాన్ని బోధించారు జాలాది ఈ చరణంలో.
భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేననే భావం ఈ పాటలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. జాలాది ఈ పాటలో ఎంతో వేదాంతాన్ని ప్రబోధించారు. పదికాలాల పాటు మనసులో నిలబడే పాట, అందరి మనసులనూ హత్తుకునే పాట. నాకు ఎంతో ఇష్టమైన పాట.
– సంభాషణ: డా. వైజయంతి