రచయిత సీఎస్‌ రావు ఇకలేరు  | Telugu Veteran Writer CS Rao Passes Away | Sakshi
Sakshi News home page

రచయిత సీఎస్‌ రావు ఇకలేరు 

Published Wed, Apr 15 2020 9:10 AM | Last Updated on Wed, Apr 15 2020 9:10 AM

Telugu Veteran Writer CS Rao Passes Away - Sakshi

ప్రముఖ సినీ, నవలా, నాటక రచయిత చింతపెంట సత్యనారాయణరావు (సీఎస్‌ రావు) ఇకలేరు. కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో 1935 డిసెంబరు 20న జన్మించిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. వృత్తి పరంగా లెక్చరర్‌ అయినప్పటికీ రచయితగా 80 కథలు, 18 నవలలతో పాటు పలు రేడియో నాటికలు, వేదిక నాటకాలు రాశారు. 

చిరంజీవి నటించిన మొదటి చిత్రం ‘ప్రాణం ఖరీదు’తో పాటు ‘ఊరుమ్మడి బతుకులు, కమలమ్మ కమతం, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, తరం మారింది, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు, యజ్ఞం, దీక్ష’ వంటి చిత్రాలకు కథలు, మాటలు అందించారు. ‘ఊరుమ్మడి బతుకులు’ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ‘సరదా రాముడు, సొమ్మొకడిది సోకొకడిది, మట్టి మనుషులు’ వంటి చిత్రాల్లో, పలు నాటకాల్లో నటించారు సీఎస్‌ రావు. తన సినీ, నాటక జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు. పలువురు నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చి, మంచి గురువుగా పేరు తెచ్చుకున్నారాయన. 

సినీ జీవితానికి దూరంగా ఉంటున్న ఆయన చిక్కడపల్లిలోని గీతాంజలి స్కూల్‌ కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఓ కుమారుడు సింగపూర్‌లో ఉన్నారు. కరోనా నేపథ్యంలో నెలకొన్న లాక్‌డౌన్‌ కారణంగా కుమారుడు అంత్యక్రియలకు రాలేని పరిస్థితి. సీఎస్‌ రావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, రచయితలు సంతాపం తెలిపారు. కాగా, నేడు హైదరాబాద్‌లో సీఎస్‌ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన సతీమణి సూర్యమణి తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బంధుమిత్రులెవరూ వ్యక్తిగత పరామర్శకు రావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement