కిచెన్‌లో యూట్యూబ్
ఒకప్పుడు కొత్త కొత్త వంటలు నేర్చుకునేందుకు... వంటల పుస్తకాలు దొరికేవి. అలాగే.. టీవీ షోల్లో బోలెడు వంటల కార్యక్రమాలు వస్తున్నాయి. దాంట్లో చూస్తూ... ఆ రెసిపీలను పేపర్లలో రాసుకునే వారు. అలా మగువలు పుస్తకాలను పట్టుకొని, చదువుకుంటూ వంట చేసేవారు. కానీ ఇప్పుడు జమానా బదల్ గయా. టెక్నాలజీ హైటెక్కు టమారాలను నేర్చుకుంది. యూట్యూబ్‌లో చూసి వంటలు చేసే కాలం వచ్చేసింది. అయితే, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లను కిచెన్‌లోకి తీసుకెళ్లడం సాధ్యమయ్యే పనికాదు కదా! దీనికీ పరిష్కారం అందుబాటులోకి వచ్చేసింది.
ఐప్యాడ్‌లోనే యూట్యూబ్ ఆన్ చేసుకొని, చూసుకుంటూ వంట చేయొచ్చు. ఎలాగంటారా..? ఇదిగో ఈ ‘ఐప్యాడ్ కిచెన్ సెట్’తో ఇట్టే వంట కానిచ్చేవచ్చు. ఇందులోని బ్లూటూత్ టెక్నాలజీతో పని చేసే స్పీకర్లు బ్యాటరీతో పని చేస్తాయి. కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని నిటారుగా నిలబెట్టి పెట్టుకోవడానికి వీలుగా స్టాండ్, నూనె వంటివి చింది ఐపాడ్ తెర పాడవకుండా ఉండేందుకు రిమూవబుల్ స్క్రీన్ షీల్డ్ ఉంటాయి.
ఐప్యాడ్ కింద పడిపోకుండా ఈ స్టాండ్‌లో పెట్టి మనకు అనుకూలమైన రీతిలో బిగించుకోవచ్చు. అలా వీటి సాయంతో ఇకపై కిచెన్‌లోనే యూట్యూబ్ వీడియోలను చూస్తూ, ఎలా చేయాలో వింటూ హ్యాపీగా బోలెడన్ని వెరైటీ వంటకాలను ట్రై చేయొచ్చు. మరెందుకు ఆలస్యం, ప్రపంచంలోని అన్ని రకాల డిషెస్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.