భూమినే నమ్ముకొని జమీందారులు, జాగీర్‌దార్లు, దేశ్‌ముఖ్‌ల అరాచకాల కింద బతుకుతున్న మట్టి మనుషులకు భూమి, భుక్తి, వెట్టిచాకిరి నుండి విముక్తి కావాలని, నిజాం నవాబు దుర్మార్గపు పాలనను మట్టుపెట్టాలని సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సేనాని బి.యన్. ఆయన పేరు వినగానే శత్రువుల గుండెలు గుబేలుమంటాయి. ఆయనను స్మరించుకుంటేనే సాయుధ పోరాట స్మృతులు ఉప్పెనలా ఎగిసిపడతాయి. భీమిరెడ్డి నర్సింహ్మరెడ్డి (బి.యన్) దున్నే వానికే భూమి కావాలని, విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఏర్పడాలని, తెలుగు జాతి ప్రజల ఐక్యత కోసం తపించిన గొప్ప వ్యక్తి.
1922లో నల్గొండ జిల్లా (ప్రస్తుతం సూర్యాపేట జిల్లా) తుంగతుర్తి మండలం, కర్విరాల కొత్తగూడెం గ్రామంలో భీమిరెడ్డి చొక్క మ్మ–రామిరెడ్డి దంపతులకు మొదటి సంతానం బి.యన్. ఆయన బాల్యమంతా అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే గడిచింది. ఆ రోజులలో గ్రామాలలో విద్యావకాశాలు లేకపోవడంతో నాల్గో ఫారమ్ చదవటానికి సూర్యాపేట చేరాడు. తెలుగు చదవాలనే మమకారం ఉన్నప్పటికి ఉర్దూ చదవక తప్పలేదు.
నల్గొండ జిల్లాలో 8వ తరగతి వరకు చదివి, తరువాత హైదరాబాద్‌లో బంధువుల సహకారంతో 9,10 తరగతులు ఒకేసారి పరీక్ష రాసి ద్వితీయ శ్రేణిలో పాసైనాడు. చదువుతున్న కాలంలోనే జాతీయంగా వందేమాతర ఉద్యమం, అంతర్జాతీయంగా ప్రపంచ యుద్ధం బి.యన్.లో రాజకీయ ఆసక్తిని పెంచాయి. సరిగ్గా అదే సమయంలో నిజాం పాలనకు వ్యతిరేకత ప్రభంజనంలా మారటం మొదలైంది. 1941–42లో నిజాంకు వ్యతిరేకంగా విద్యార్థులను సమీకరించడానికి బి.యన్. నడుం బిగించారు. 1942 వరంగల్‌లో జరిగిన 9వ ఆంధ్ర మహాసభలో తోబుట్టువులతో, అనుచరులతో కలిసి వాలంటీర్‌గా పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ్ట స్ఫూర్తితో ఎర్రజెండా నీడన గ్రామాలలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. బి.యన్ ఆధ్వ ర్యంలో రావుల పెంట, కోటపాడు, చివ్వెంల గ్రామాలలో జరిగిన దాడులతో సేకరించిన ఆయుధాల ద్వారా పోరాటం ముందుకు సాగింది.
1947 అధికార మార్పిడి తరువాత ఇటు నిజాం సైన్యాలతో, అటు యూనియన్ సైన్యాలతో తలపడవలసి వచ్చింది. దళాలను మైదాన ప్రాంతాల నుండి అడవి ప్రాంతాలకు మలిపి గోదావరి పరీవాహక ప్రాంత రెండు వైపులా సుమారు 200 గ్రామాలలో ఉద్యమాన్ని విస్తరింప జేశారు. ఉన్నతమైన ఆశయాలతో ఏర్పడిన మార్క్సిస్టు పార్టీలో ‘సామాజిక న్యాయం’ కొరవడడంతో సొంతంగా సీపీఎం (బి.యన్) పార్టీని స్థాపించారు. తరువాత మద్దికాయల ఓంకార్ ఏర్పరచిన ఎంసీపీఐ(యు)లో తన పార్టీని విలీనపరిచి చివరి వరకు పొలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగారు. 2008 మే 9న బి.యన్. అమరులైనారు. ఆ మట్టి మనుషుల మనిషికి సామాన్యులెందరో జోహార్లు పలికారు.
(నేడు బి.యన్. 11వ వర్ధంతి)
-వనం సుధాకర్, ఎంసీపీఐ(యు)
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
మొబైల్: 99892 20533
మట్టి మనుషుల మనిషి బి.యన్.
Published Thu, May 9 2019 1:18 AM | Last Updated on Thu, May 9 2019 1:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment