కాంగ్రెస్ పార్టీ నిజమైన పతనం ఇప్పుడే ప్రారంభం అయివుండవచ్చు. కాంగ్రెస్ యువనేతల్లోని అత్యంత ప్రతిభాశాలులలో ఒకరైన జ్యోతిరాదిత్య సింధియా(మధ్యప్రదేశ్ రాజకుటుంబం వారసుడు, కాంగ్రెస్ మాజీనేత మాధవరావు సింధియా తనయుడు, గాంధీ కుటుంబ విధేయుడు) భారత రాజ కీయాల్లో కురువృద్ధ పార్టీకి లాంఛనంగా వీడ్కోలు పలికారు. పైగా కాంగ్రెస్‌కు మరింత అవమానం కలిగిస్తూ దాని బద్ధ విరోధి అయిన భారతీయ జనతాపార్టీలో చేరిపోయారు.
కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా సింధియా చేసిన తిరుగుబాటు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ పతనానికి దారితీయడమే కాదు.. పార్టీలో తాము ఒంటరులుగా మిగిలిపోయాం అని, అవమానాల పాలవుతున్నామని భావిస్తున్న ఇతరులకు కూడా కాస్త ధైర్యమిచ్చింది. దీనికి కాంగ్రెస్ పార్టీ తన్నుతాను తప్పుపట్టుకోవలసిందే కాని ఇతరులను నిందించలేదు.
లక్ష్మణరేఖను ఇలా దాటగలడా?
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా తన రాజీనామాను ప్రకటించడానికి ముందు, చివర నిమిషం వరకు సింధియా లక్ష్మణరేఖను దాటగలడని నమ్మడానికే కాంగ్రెస్ అంగీకరించలేదు. కాంగ్రెస్ కుటుంబానికి సింధియా విధేయత పట్ల ఎన్నడూ సందేహం కలగలేదు. పైగా ఆయన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుడు కూడా. అందుకే కాంగ్రెస్ పార్టీ సింధియాను రాజీనామా చేసిన తర్వాత లాంఛనప్రాయంగా బహిష్కరించింది తప్ప తనపై చర్య తీసుకోవడంలో విఫలమైంది.
కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలంగా ఎదుర్కొంటూ వచ్చిన ఉత్థానపతనాల చరిత్రలో ఒక నాయకుడు పార్టీని వదిలి వెళ్లడం అనేది చాలా చిన్న విషయమే అవుతుంది. కానీ సింధియాను పార్టీ వదులుకోవలసి రావడం, పైగా తనను పోగొట్టుకున్న సమయం కలిగించే ప్రభావం చాలా విస్తృతమైనది. ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న దీనావస్థలో సింధియా నిష్క్రమణ దానికి మరిన్ని చిక్కులను కొనితేవచ్చు.
ఇక బీజేపీ విషయానికి వస్తే సింధియా చేరిక పార్టీకి లడ్డూ్డ లాంటి అవకాశమనే చెప్పాలి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ సాగిస్తున్న భావజాల సమరంలో సింధియా చర్య కాషాయ పార్టీకి ఎంతో మేలు చేస్తుంది. కాంగ్రెస్ ఉచ్చులోంచి తప్పించుకోవాలని చూస్తున్న అనేకమంది ప్రతిభావంతులను సింధియా అయస్కాంతంలా బీజేపీలోకి ఆకర్శించగలరు. బీజేపీలో లాంఛనంగా చేరిన తర్వాత మీడియాతో క్లుప్తంగా మాట్లాడిన సింధియా, కాంగ్రెస్ తిరస్కృత జీవితం గడుపుతోందని క్షేత్ర వాస్తవికతను అది పట్టించుకోవడం లేదని విమర్శించారు.
భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయిన యువనేతలు
పార్టీకి, దేశానికి కూడా సేవ చేయాలనుకుని వచ్చిన ఎంతోమంది యువనాయకులను కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహం ఇవ్వడం లేదని ఆరోపించారు. సింధియా ప్రకటన తర్వాత అయినా కాంగ్రెస్ కాస్త మేలుకుని ఈ సందర్భంలో పార్టీ నుంచి ఇతరులు వెళ్లిపోకుండా అడ్డుకోవాల్సి ఉంది. కానీ పార్టీలో ఇక తమకు భవిష్యత్తు లేదని భావిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్న తరుణంలో వెళ్లిపోదలుస్తున్న వారిని నిలుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి కష్టసాధ్యమే కావచ్చు.
కాంగ్రెస్ అధిష్టానం క్షేత్ర వాస్తవికతకు దూరమైందని, గతంలోనే జీవిస్తూ పార్టీ శ్రేణుల కొత్త ఆలోచనలను, భావోద్వేగాలను, ఆకాంక్షలను నిర్లక్ష్యం చేస్తోందని సింధియా ఆషామాషీగా చెప్పడం లేదు, పార్టీలోని కురువృద్ధులకు, యువతరానికి మధ్య సాగుతున్న కుమ్ములాట కాంగ్రెస్‌ని మరింత బలహీనపర్చవచ్చు కూడా. నిజానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చే ఇలాంటి అవకాశంకోసం పొంచి ఉంటున్న బీజేపీ చేతుల్లోకి సింధియాను కాంగ్రెస్ చేతురాలా అప్పగించేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలివైన వృద్ధ జంబూకమే కావచ్చు కానీ తన ప్రభుత్వాన్ని నిలుపుకోవడం కష్టసాధ్యమని గుర్తించక తప్పదు. ఎందుకంటే బీజేపీ మొదలెట్టిన ఆపరేషన్ కమల్ పరాకాష్టకు చేరింది మరి.
సీఎం పదవిని ఆశించి భంగపాటు
మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో 2018 నవంబర్‌లో ప్రభుత్వాలు ఏర్పడుతున్న సమయంలో సింధియా, సచిన్ పైలట్ ఈ రెండు రాష్ట్రాల్లో సీఎం పదవిని ఆశించారు. కానీ రాహుల్ వారిని వృద్ధులకు అవకాశం ఇద్దామని చెప్పీ నిలువరిం చారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నేతలు తమకు ఊపిరాడటం లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నేతల బాగోగులను కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోకపోతే, వారి ఆకాంక్షలను నెరవేర్చుకోకపోతే పార్టీనుంచి చాలామంది వెళ్లిపోవచ్చు కూడా.
ఆంధ్రప్రదేశ్ ఉదంతాన్నే తీసుకుందాం. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విషాద మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పట్ల నిరాదరణ చూపింది. ఆయన కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. దాని ఫలితం మనందరం చూశాం. 1977లో 42 ఎంపీ సీట్లకు గాను 41 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ హయాంలో 30 పైగా ఎంపీ సీట్ల దన్నుతో యూపీఏ1, యూపీఏ 2 ప్రభుత్వాలను నడపగలిగిన కాంగ్రెస్ ఈరోజు విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎంపీ సీటుకు కూడా నోచుకోని దౌర్భాగ్య స్థితిలో కూరుకుపోయింది.
చరిత్ర నిర్మాణం.. చరిత్రలో కలిసిపోవడం!
ఏపీలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణమే నేడు ఆవిరైపోయింది. పైగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతోంది. మరోవైపున బీజేపీ అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి కురువృద్ధులను పక్కన పెట్టి నరేంద్రమోదీ పట్ల విశ్వాసం ఉంచి 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.
తదుపరి చరిత్ర అంతా తెలిసిందే. కానీ మరోవైపున కాంగ్రెస్ మాత్రం చరిత్రలో కలిసిపోయేటట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వంపై సింధియా తిరుగుబాటు పంపుతున్న సందేశం స్పష్టంగానే ఉంది. కాంగ్రెస్ నాయకత్వం తాను సమర్థంగా పనిచేయాలి, తన నేతలు సమర్థంగా పనిచేసేలా చూడాలి. అలా కాదంటే నాయకులకు అన్ని అవకాశాలూ తెరుచుకునే ఉన్నాయి.
పార్టీనుంచి వేరయిపోయామని, తమ ప్రతిభ వృథా అవుతోందని, తాను నాయకత్వంతో సంబంధాలు కోల్పోయామని బలంగా నమ్ముతున్న నాయకులకు కాంగ్రెస్ సాధికారత కల్పించాల్సి ఉంది.
లక్ష్మణ్ వెంకట్ కూచి(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)
Comments
Please login to add a commentAdd a comment