మన కాలం వీరుడు వైఎస్‌ జగన్‌ | Article On YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

మన కాలం వీరుడు వైఎస్‌ జగన్‌

Published Fri, May 31 2019 12:38 AM | Last Updated on Fri, May 31 2019 12:38 AM

Article On YS Jagan Mohan Reddy - Sakshi

ఎవరికైనా 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతి కలిగించి ఉంటే, వాళ్ళు క్షేత్రస్థాయి వాస్తవాలకు  చాలా దూరంగా ఉన్నారని నికార్సుగా చెప్పవచ్చు. ఏపీ ఎన్నికల ఫలితాలు అర్థం కావాలంటే, వాటిని 2011 నాటి కడప పార్లమెంట్‌ ఉపఎన్నిక నుంచి చూడాల్సి ఉంటుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీగా రాజీనామా చేసి, స్వంత పార్టీ పెట్టి పోటీ చేసి గెలిచిన ఎన్నిక అది. అప్పుడు వైఎస్సార్‌సీపీకి 67.5 శాతం ఓట్లు పోలైతే, కాంగ్రెస్‌కు 14.22 శాతం, టీడీపీకి 12.57 శాతం పోలైనాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 44.47 శాతం ఓట్లు రాగా, టీడీపీ, బీజేపీ, జనసేన మూడుపార్టీలు కలిపి 46.3 శాతం పొందాయి. రెండింటి మధ్య తేడా కేవలం 2.6 శాతం. అయితే అప్పటి నుంచి ఒకే తీరుగా నిలకడగా ఉన్ననాయకుడు జగన్‌ అయితే, పలు రాజకీయ విన్యాసాలతో ఉనికిని నిలబెట్టుకున్నది చంద్రబాబు. ఇద్దరూ తలపడిన ఈ ‘ఎరీనా’ మీద వీళ్ళ గత ‘ట్రాక్‌ రికార్డ్‌’ గాని, గడచిన ఐదేళ్ళ పరిపాలనగాని చూసాక, ఈ ఫలితాలు ఇలా కాకుండా ఇంకెలా వుంటాయి? 

ప్రయాణం, ముందుకెళ్ళాలి కానీ ముందు ఉన్నదేంటో తెలియని మంచులో ప్రయాణం. గడచిన ఐదేళ్ళలో టీడీపీలో అందరినీ అటువంటి కళ్ళకు గంతలు కట్టుకున్న స్థితిలో ఉంచడం, ఆపార్టీ అధినేత అసాధారణ ‘మేనేజ్‌మెంట్‌’ నైపుణ్య విజయం! ఇది– ‘స్మోక్‌ స్క్రీన్‌’ స్ట్రాటజీ. ఇందులో ముందుగా వాస్తవ పరిస్థితుల్ని బయటకు కనిపించకుండా వాటిని వెనక్కి నెట్టి, దాని ముందు పై నుంచి కిందికి నాలుగు వైపులా కృత్రిమంగా ఒక దట్టమైన ‘పొగ తెర’ను దించి, దాని వెనుకున్న నిజస్థితిని దాచేస్తారు. ఇక రెండవ దశలో ఆ ‘పొగ తెర’ ముందు క్షణం తీరిక లేనట్టుగా, 24/7 ఎప్పుడూ ఏదో ఒక ‘యాక్టివిటీ’ లైవ్‌లో నడిపిస్తారు. అది దోమలపై యుద్ధం, రెయిన్‌ గన్స్‌తో పంటలు కాపాడ్డం, తుఫానుకు ఎదురెళ్ళడం, భాగస్వామ్య సదస్సులు, అమరావతి మీద ఎయిర్‌ షో లేదా నది మీద ‘రెగట్టా’ పోటీలు, ఇలా ఏదైనా కావొచ్చు... ఏదీ లేదూ జనాన్ని పొలోమని పోలవరం పంపడం, ఏడాది పొడుగునా ఇలా ‘పొగ’ను మాత్రం దట్టంగా ఉంచాలి. 

ఈ వరసలో చివరిగా ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు, ఈ ‘పొగతెర’ మీద దించిన మరో మాయా జలతారు ‘పసుపు–కుంకుమ’! గ్రామీణ మహిళల చేతుల్లో పచ్చనోట్లు పడితే చాలు, వాళ్ల అంతరంగాల్లో ఏముందీ మనకక్కరలేదు, ఇదీ బాబు లెక్క. ఇంత గజిబిజిని ఇక్కడ ముందునుంచి ఇంత చిక్కగా అల్లి మరీ ఉంచారు కనుకనే, నిజంగానే ఇది ‘టఫ్‌ ఫైట్‌’ అనిపించింది. అందుకే 40 రోజులు పైగా ‘విశ్లేషకులు’ ఏపీ గురించి ఇంతగా ఇక్కడ బుర్రలు బద్దలు చేసుకుంది. ఈ పొగతెరను చీల్చుకుని దాని వెనక్కి వాస్తవం వద్దకు ఒక్కొక్క పొర తొలగించుకుంటూ వెళ్లి, అస్సలు అక్కడున్నది ఏమిటో చూడ్డానికి చేసిన ప్రయత్నమే ఈ సర్వే నివేదికలు!

ఇంతకీ అక్కడేముంది? అక్కడ వైఎస్సార్‌ ఉన్నారు! ఆయన ఆర్థిక సంస్కరణల సీఈవో చంద్రబాబు వేగానికి, ‘ఇందిరమ్మ రాజ్యం’ నినాదంతో 2004లో ‘బ్రేకులు’ వేసిన యోధుడు. ఏపీలో 2004లో జరిగిన ఈ మార్పును మరో ఎన్నికగా మాత్రమే చూస్తే, దేశ రాజకీయాల్లో ‘వైఎస్‌ ఫ్యాక్టర్‌’ అర్థం కాదు. బాబు ‘వేగం’ ఒక విపత్తుగా పరిణమించి, వ్యవస్థ మొత్తం కూలబడనున్న కాలమది. సాగుబడి, వైద్యం, విద్య వంటి కీలక రంగాలు కునారిల్లి, పేద దిగువ మధ్యతరగతి జనం మార్పు కోరుతున్న రోజులు. అటువంటి సంధి కాలానికి అవసరమైన ‘హృదయాన్ని’ పరిపాలనకు జోడించి; దానికి ‘ఇందిర’ పేరు పెట్టి, వై.ఎస్‌ ముందుకు తీసుకువెళ్ళాడు. సీఎం అయిన వెంటనే రైతు వెతల మీద సమగ్ర అధ్యయనానికి డిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ప్రొ. జయతీ ఘోష్‌ కమిటీని వేసిన దార్శనికుడు వై.ఎస్‌. ఇలా దేశానికి ఈ సంధి కాలంలో జరగాల్సిన కాయకల్ప చికిత్సను నాడి పట్టి మరీ గుర్తించిన నాయకుడు వైఎస్‌! అందుకే అప్పట్లో సోనియాగాంధీ, మన్మోహన్, తమ సభల్లో తరచూ, ‘ఏ.పి. మోడల్‌’ అంటూ వుండేవారు. ప్రధాని అధికారిక ప్రసంగాలలో ‘రిఫార్మ్స్‌ విత్‌ హ్యూమన్‌ ఫేస్‌’ అంటూ, అప్పట్లో వైఎస్సార్‌ ఏపీని కాంగ్రెస్‌ తరుపున దేశానికి ఒక ‘షో కేస్‌’ గా చూపించుకునేవారు! 

సహజంగా అటువంటి కుటుంబ అంశం ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి తన తండ్రి పేరున్న పార్టీ ద్వారా ఈరోజు చంద్రబాబు వంటి ఒక ‘పొలిటికల్‌ మేనేజర్‌’ని ఏకపక్షంగా ఓడించటం అనేది మరీ విశేషం కాకపోవచ్చు. నిజానికి ప్రస్తుతం జగన్‌ సాధించిన గెలుపు వైఎస్సార్‌ ఆధ్వర్యంలో జరిగిన 2004, 2009 ఎన్నికలకు మరో మెరుగైన పొడిగింపు మాత్రమే. అయితే, కొత్తగా ఇప్పుడు కలుపుకోవల్సినది జగన్‌ పాదయాత్రలో తనకోసం కట్టుకున్న– మమతల కోట! ఈ కోణంలో చూస్తే జగన్‌మోహన్‌రెడ్డి కాలం సృష్టించిన నాయకుడు.

వ్యాసకర్త : జాన్‌సన్‌ చోరగుడి, అభివృద్ధి–సామాజిక విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement