తెలుగుజాతిని కదిలించిన చేతనా పాళి నార్ల వెంకటేశ్వరరావు. గడుసుదనమే బాణిగా, వ్యంగ్య చమత్కారాలే పాళిగా, సూటిదనమే శైలిగా తెలుగు పత్రికా రంగాన్ని 5 దశాబ్దాలపాటు ఏలిన సంపాదక శిరోమణి నార్ల వెంకటేశ్వరరావు. 1940వ దశకంలో జాతి పిత మహాత్మాగాంధీ మాటకు తిరుగు లేదు. ఆయన బాటకు ఎదురు లేదు. అలాంటి సందర్భంలో గాంధీ నిర్ణయాన్ని సైతం ప్రశ్నించిన నిర్భీతికలిగిన పాత్రికేయుడు నార్ల. తెలుగు వారంటే చులకన బావమున్న చక్రవర్తుల రాజగోపాలాచారిని 1946లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు గాం«ధీ ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే గాంధీ నిర్ణయాన్ని, రాజాజీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ నార్ల ప్రశ్నించి సంచలనం కలిగించారు.
1908 డిసెంబరు 1న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన నార్ల ప్రాథమిక విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగింది. బాల్యం నుండి సామాజిక స్పృహ ఆధికంగా కలిగిన నార్ల వెంకటేశ్వరరావు తన కలంతో సామాజిక రుగ్మతలపై ఆలుపెరగని పోరుసల్పారు. పత్రికా రచనలో నూతన పోకడలకు శ్రీకారం చుట్టి వ్యక్తీకరణను అందులో చొప్పించారు. స్వరాజ్య, జనవాణి, ప్రజామిత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల ద్వారా తెలుగు జాతిని జాగృతం చేసారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా తెలుగు పత్రికారంగ చరిత్రను కొత్త పుంతలు తొక్కిం చారు. వాడుక భాషకు పట్టం కట్టిన నార్ల పత్రికల్లో ‘బడులు వాడే వాడు బడుద్దాయి’ అని చమత్కరించారు.
సంపాదకుడు కాదు ఎడిటర్ అనాలని సరి దిద్దారు. వీఆర్ నార్లగా నాటికలు, కవితలు, చరిత్ర గ్రంథాలు రాశారు. మూఢ విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ ‘సీతాజోస్యం’ అనే నవల రచిం చారు. జాబాలి, నరకంలో హరిశ్చం ద్రుడు, ద్రౌపది, హిరణ్యకశ్యప వధ అనేవి ఆయన ఇతర రచనలు. ‘మనం మన దాస్యబుద్ధి’ అనే శీర్షికతో ఆయన ఎమర్జెన్సీని విధించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె తనయుడు సంజయ్‌గాంధీలపై చేసిన సూటి విమర్శ సంచలనం కలిగించింది. 1985 ఫిబ్రవరి 16న ఈ కలం యోధుడు తెలుగు పత్రికా రంగానికి శాశ్వతంగా వీడ్కోలు పలికి తుదిశ్వాస విడిచారు.
(నేడు నార్ల వెంకటేశ్వరావు వర్ధంతి)
వ్యాసకర్త :డా‘‘ యస్. బాబురావు
మొబైల్ : 95730 11844
Comments
Please login to add a commentAdd a comment