ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో, కాంగ్రెస్ పార్టీతో బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయ పొత్తుకు సిద్ధమవుతున్న పరిణామాలు భారతీయ జనతా పార్టీకి కంటిమీద నిద్రలేకుండా చేస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 71 పార్లమెంటు స్థానాలు గెల్చుకున్న ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏర్పడనున్న వినూత్న పొత్తు హిందుత్వ రాజకీయాలకు దృఢమైన సవాలును విసురుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాబట్టి బీజేపీ 2014 నాటి తన అద్భుతమైన పని తీరును పునరావృతం చేయాలంటే ఇలాంటి మహా కూటమి ఏర్పాటును అడ్డుకునే వ్యూహం తప్పనిసరిగా రచించాల్సి ఉంటుంది. పైగా ఉత్తరప్రదేశ్‌లో ఈ మూడు బలమైన పార్టీలను మినహాయిస్తే.. తాను ఎన్నికల పొత్తు కుదుర్చుకోగలిగే రాజకీయ పార్టీలు పెద్దగా లేవని కూడా బీజేపీకి తెలుసు. అందుచేత, ప్రతిపక్ష పార్టీల రాజకీయ పొత్తును సవాలు చేయాలంటే గత ఎన్నికలల్లో తనకు ఓటు వేసిన సామాజిక పునాదిని భారతీయ జనతాపార్టీ మరింత విస్తృత పర్చుకుని బలోపేతం కావాల్సి ఉంటుంది.
‘విభజించు–పాలించు’ వ్యూహంతో దాడి
ఉత్తరప్రదేశ్‌లో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ తర్వాత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ విభజించు పాలించు వ్యూహాన్ని ఎంపిక చేసుకుంది. దళితుల్లో, ఓబీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలు, సామాజికంగా ఎంతో వెనుకబడిన బృందాలను హిందుత్వ శక్తుల పక్షాన గణనీయంగా సమీకరించారు. సామాజికంగా వెనుకబడిన బృందాలకు చెందిన విస్తృత సెక్షన్లకు చెందిన ప్రజానీకానికి దళిత/బహుజన/పిచ్డా (వెనుకబడిన) వంటి సామూహిక పరిభాష అంత సులభంగా అందుబాటులో ఉండదు. అలవడదు కూడా.
తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు తరచుగా సంకుచితమైన కుల వర్గాలను ఉపయోగిస్తుంటారు. సమాజంలోని అన్ని కులాల తరపున ఒక ఏకైక కులం అధికారం చలాయించకూడదన్న సూచనతో కుల ప్రాతిపదికన సామాజిక విభజనను విస్తృతం చేయడమే బీజేపీ వ్యూహం. దాంట్లో భాగంగానే అత్యంత వెనుకబడిన కొన్ని నిర్దిష్ట కులాలను, బృందాలకు రాజకీయాలు అంటించిన బీజేపీ వాటిని యాదవులు, జాతవులు, ముస్లింలతో కూడిన సాంప్రదాయిక రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబెట్టింది.
సామాజిక ఇంజనీరింగ్‌లో బీజేపీ పైచేయి
ఉత్తరప్రదేశ్‌లో అంతవరకూ బలంగా కనిపించిన రాజకీయ శక్తులను అప్రధానమైన రాజకీయ ప్రత్యర్థులుగా వేరుపర్చడంలో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. అంతకుమించి ఆ పార్టీ తన సామాజిక ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని మరింత గొప్పగా మెరుగుపర్చుకుంది. దిగువస్థాయిలోని ఓబీసీల్లోకి, రాజకీయంగా పూర్తిగా ఏకాకితనంలో ఉన్న దళిత బృందాల్లోకి విస్తరించడం ద్వారా అత్యంత సృజనాత్మక పార్టీగా బీజేపీ తనను తాను నిర్వచించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రాజకీయ పునాది ఒక్కసారిగా ద్విగుణీకృతం కావడానికి దారితీసిన మూలకారణం ఇదే.
ఇన్నాళ్లుగా ఈ బృందాలను ఎస్పీ, బీఎస్పీ పార్టీల సాంప్రదాయిక రాజకీయ సమీకరణల్లో చాలా చిన్న చూపు చూసేవారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల సాంప్రదాయిక ఓట్లలోనూ కుల విభజనలు ప్రేరేపించిన బీజేపీ 2012లో యూపీలో సాధించిన 15 శాతం ఓట్లను 2017 అసెంబ్లీ ఎన్నికల నాటికి 42 శాతానికి పెంచుకుంది. ఈ ప్రాతిపదికన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ తన సామాజిక పునాదిని నిలబెట్టుకోగలనని ప్రగాఢంగా విశ్వసిస్తోంది. అందుకే ప్రతిపక్షాల రాజకీయ కూటమి బీజేపీ దృష్టిలో ఇప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది
విభిన్న రాజకీయ వ్యూహాలు
ఉత్తరప్రదేశ్‌లో మూడు విభిన్న రాజకీయ వ్యూహాలను అవలంబించడం ద్వారా బీజేపీ అంతటి ప్రభావశీలమైన సామాజిక పొత్తును సాధించింది. ఒకటి– రాష్ట్రంలో కుల వ్యవస్థ ఇప్పటికీ బలంగా పనిచేస్తోందని, విభిన్న కుల బృందాలు సామాజిక పొత్తులు లేక పరస్పర సంబంధాలకు ఇప్పటికీ దూరంగానే ఉన్నాయని బీజేపీ గ్రహించింది. పరస్పరం అవిశ్వాసం, శత్రుత్వం, అసూయ ప్రాతిపదికన కులాలు ఇప్పటికీ సమాజంలో పనిచేస్తున్నాయి.
అలాంటి కుల విభజనలను సవాలు చేసే మౌలికమైన సంస్కరణాత్మక శక్తి సమాజంలో ఇంకా ఏర్పడలేదు. పైగా కుల బృందాలను సామాజిక సంస్కరణకు గురిచేయడంపై బీజేపీ ఎలాంటి ఆసక్తీ ప్రదర్శించలేదు. దానికి బదులుగా, అది కుల విభజనను ఎంతగా ప్రోత్సహించి, రాజకీయం చేసి పడేసిందంటే, ఉత్తరప్రదేశ్‌లో దళితులు లేక ఓబీసీల వంటి ఏకీకృత రాజకీయ సామూహిక శక్తి ఇకపై ఎన్నటికీ ఏర్పడటం కష్టం. అలాంటి పరిణామం సామాజికంగా ఉన్నత శ్రేణిలో ఉన్న ఆధిపత్య శక్తుల రాజకీయాలను తప్పకుండా సవాలు చేయగలదని బీజేపీ చక్కగా గ్రహించింది కూడా.
కాబట్టి, దళితుల, ఓబీసీల సామూహిక ఉనికిని, అస్తిత్వాన్ని విచ్ఛిన్న పర్చడానికి సమాయత్తం అవుతున్న కుల బృందాలకు సహాయం చేయడం, ప్రోత్సహించడమే బీజేపీ ప్రధాన వ్యూహంలాగా మారింది. బీఎస్పీలోని జాతవ నాయకత్వానికి వ్యతిరేకంగా రాజ్‌భర్, పాసి, ధోబీ, ఖటిక్ వంటి కులాలను ప్రోత్సహించడంపై బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది.
ఆధిపత్య కుల రాజకీయాలపై ప్రచారం
ఓబీసీలలోని మౌర్యులు, కుర్మీలు, లోధీలను హిందుత్వ రాజకీయాలను బలపర్చే ప్రధాన శక్తులుగా బీజేపీ ఎగదోసింది. దీంతో సమాజ్‌వాదీ పార్టీ కేవలం యాదవుల ఆధిపత్యం ఉన్న పార్టీ స్థాయికి పరిమితమైపోయింది. కుల బృందాల మధ్య రోజువారీగా తలెత్తుతున్న తీవ్రమైన సామాజిక వ్యత్యాసాలను విస్పష్టమైన సామాజిక, రాజ కీయ శత్రుత్వాల్లోకి మార్చడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేసింది. రెండు, యూపీలోని కుల విభేదాలను సజీవంగా ఉంచడానికి బీజేపీ పలు రాజకీయ ప్రకటనలు, విధానపరమైన వాగ్దానాలను తన ఎన్నికల ప్రచారంలో గుప్పించింది. ఉదాహరణకు, రిజర్వేషన్ విధానాన్ని వర్గీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆసక్తి ప్రదర్శించింది. దీంతో రాష్ట్రంలో యాదవులు, జాతవులు, మరికొన్ని కులాలు రిజర్వేషన్ విధానం ద్వారా లభ్యమవుతున్న ప్రయోజనాలను గుత్తకు తీసుకున్నాయని బీజేపీ ప్రచారం చేసింది. కాబట్టి రిజర్వేషన్ విధానాన్ని సంస్కరించవలసిన సమయం ఆసన్నమైందని, అప్పుడే రిజర్వేషన్ ఫలితాలు సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు చేరుకుంటాయని బీజేపీ ప్రచారం చేసింది. ఆవిధంగా ఒకే కుల సామాజిక పునాదిలో అవిశ్వాసాన్ని, శత్రుత్వాన్ని పెంచి పోషించడమే కాకుండా, కీలకమైన ఆర్థిక, రాజకీయ వనరులపై అగ్రకుల కులీనుల ఆధిపత్యం కొనసాగడాన్ని కూడా బీజేపీ అనుమతించింది.
మతపరమైన ఘర్షణలకు ఆజ్యం
మూడు– నిమ్న కులాల్లో సామాజిక, మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉండే సాంస్కృతిక, జానపద అంశాల్లో బీజేపీ మతత్వాన్ని రంగరించింది. దళిత్–ఓబీసీ కులాలకు చెందిన పలు వర్గాలు హిందూ మత సంప్ర దాయాలతో సన్నిహితంగా ఉండటంతోపాటు ఆ ఆచా రాల్లో, సంప్రదాయాల్లో పాలుపంచుకుంటాయి. ఆరెస్సెస్, బీజేపీలు ఒక పద్ధతి ప్రకారం వీటిల్లో జోక్యం చేసుకుని మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టేలా వినియోగించుకుం టున్నాయి. గ్రామ దేవతలు, జానపద నాయకులు, గ్రామీణ సంప్రదాయాలు, ఇతర సాంస్కృతిక కళాఖం డాలు వగైరాలకు క్రమంగా హిందుత్వ రాజకీయాలతో బాంధవ్యం ఏర్పడేలా చూస్తున్నాయి.
అంతేకాక గోరక్షణ, రామ మందిరం, హిందూ మహి ళల గౌరవ పరిరక్షణ వంటి సామాజిక పరమైన సున్నిత అంశాలను ముస్లిం వ్యతిరేకతకు బీజేపీ వాడుకుం టోంది. నిమ్నకులాలకు సంబంధించిన మతపరమైన, సాంస్కృతిక పరమైన అంశాల్లో తరచు ఆరెస్సెస్–బీజేపీలు జోక్యం చేసు కుంటున్న తీరు బీజేపీ మద్దతు పెరగడానికి దోహదకారి అవు తోంది. ఈ కపట వ్యూహాలు గత ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టి బీజేపీకి లబ్ధి చేకూర్చాయి. కనుక సహజంగానే రాబోయే ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఈ తరహా వ్యూహా లపైనే ఆధారపడదల్చుకుంది.
కానీ ఈసారి సామాజిక, ఆర్ధిక న్యాయానికి సంబం ధించిన ప్రశ్నలకు బీజేపీ సరైన జవాబిచ్చే స్థితిలో లేదు. ఓబీసీల్లోని కింది కులాలు, దళితుల్లోని అట్టడుగు కులాలు మానవాభివృద్ధి సూచీల్లో మెరుగుపడిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ కులాలన్నీ ఇప్పటికీ సామాజికంగా వివ క్షను, వేధింపులను ఎదుర్కొంటున్నాయి. అత్యంత దారు ణమైన పేదరికంలో మగ్గుతు న్నాయి. బీజేపీ నినాదం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ ఈ అట్టడుగు కులాలను దయ నీయమైన స్థితినుంచి బయట పడేయలేకపోయింది. ఇప్ప టికీ ఆ కులాలు అధికారానికి చాలాదూరంలో ఉన్నాయి. కేవలం మతతత్వ, కుల సమీకరణాల కారణంగా మాత్రమే అవి భారతీయ జనతా పార్టీ ఛత్రఛాయలో మనుగడ సాగిస్తున్నాయి.
సమగ్ర వ్యూహంలేని విపక్షాలు
ఎస్–బీఎస్‌పీ–కాంగ్రెస్ కూటమి కాగితాలపై చాలా ఆక ర్షణీయంగా కనిపిస్తుంది. యాదవ్–జాతవ్–ముస్లిం కల యిక సామాజికపరమైన అద్భుత వ్యూహమని, అది గెలుపును అందిస్తుందని విపక్షాలకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆరెస్సెస్–బీజేపీ శక్తులు దీనికన్నా అతి పెద్ద సామా జిక సముదాయాన్ని సమీకరించగలవు. క్షేత్ర స్థాయిలో బీజేపీ తన సొంత కుల–మత రాజకీయాల బ్రాండ్‌ను సమర్థవంతంగా అమలుచేస్తోంది. దానికి సమగ్రమైన ప్రతివ్యూహాన్ని విపక్షాలు ఇంకా రూపొందించుకోలేక పోయాయి.
కేవలం రాజకీయ కూటమిని ఏర్పాటు చేయడంతోనే తమ లక్ష్యం నెరవేరే అవకాశం లేదని ఆ కూటమిలోని పార్టీలు గుర్తించాలి. ఆ కూటమి తన సామాజిక పునాదిని విస్తరించుకుని ఇంతవరకూ ఎలాంటి ప్రాధాన్యతకూ నోచని గ్రూపులకు సమాన హోదానిచ్చి వాటికి సన్నిహితం కాగలిగితే అదొక తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. తనపై ఇంతకాలంనుంచీ ఉంటున్న వ్యతిరేక భావనలను, ప్రత్యే కించి ఇందులోని పార్టీలన్నీ ఏదో ఒక కులానికే ప్రాతినిధ్యం వహిస్తుంటాయన్న అభిప్రాయాన్ని పోగొట్టుకోవటం ఈ కూటమికుండే ప్రధాన సవాళ్లు.
కొత్త ఆర్థిక సంక్షేమ ఎజెండా అవశ్యం
సమాజంలో బాగా అణచివేతకు గురవుతున్న కులాలకు పార్టీ కార్యకలాపాల్లోనూ, సంస్థాగత అధికార నిర్మా ణాల్లోనూ మంచి ప్రాధాన్యత నిచ్చి ఈ పార్టీలు తమ సామాజిక పునాదిని విస్తృతపరచుకోవాల్సి ఉంది. అదే సమయంలో బీజేపీ అనుసరించే అలంకారప్రాయమైన అభివృద్ధి మంత్రానికి భిన్నంగా కూటమి ఒక కొత్త ఆర్థిక సంక్షేమ ఎజెండాను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సామాజిక న్యాయం, సోషలిజం వంటి విలువల ఆధారంగా రూపొందే ప్రభావవంతమైన సైద్ధాంతిక ప్రక టన ఆ కూటమినుంచి వెలువడాలి. అది మాత్రమే భారతీయ జనతా పార్టీ వేర్పాటువాద సామాజిక నిర్మాణాన్ని తుత్తునియలు చేస్తుంది.
హరీష్ ఎస్. వాంఖెడే
వ్యాసకర్త జవహర్‌లాల్ యూనివర్సిటీ రాజకీయ అధ్యయన కేంద్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment