సీతాపూర్ ఎన్నికల సభలో మోదీ
కనౌజ్/హర్దొయి/సీతాపూర్: విపక్ష కూటమి కుల రాజకీయాలు ఫలించవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అవకాశవాదుల కూటమికి కేంద్రంలో బలమైన (మజ్‌బూత్) ప్రభుత్వం కాకుండా నిస్సహాయ (మజ్‌బూర్) ప్రభుత్వం కావాలని, ఎందుకంటే ప్రజాధనాన్ని దోచుకుంటూ కులాల మంత్రం జపించడమే వారి లక్ష్యమని విమర్శించారు. తనను కుల రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి మంచి పట్టున్న కనౌజ్‌తో పాటు హర్దొయి, సీతాపూర్‌లలో నిర్వహించిన ఎన్నికల సభల్లో మోదీ మాట్లాడారు.
ఎస్పీతో పాటు విపక్ష బీఎస్పీ, ఆర్‌ఎల్డీలపై విరుచుకుపడ్డారు. ఆదో పెద్ద కల్తీ (మహా మిలావతి) కూటమిగా అభివర్ణించారు. కుల రాజకీయాలపై తనకు నమ్మకం లేదన్నారు. అంబేడ్కర్‌కు కాంగ్రెస్ కనీస గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల యాప్‌కు ‘భీమ్’గా నామకరణం చేసిందని గుర్తుచేశారు. బీజేపీకి మద్దతు పలకాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘మీరు వేసే ప్రతి ఓటూ నేరుగా మోదీ ఖాతాలోకే వస్తుంది. మాయావతీజీ, నేను చాలా వెనుకబడిన వారం. కానీ నన్ను మాత్రం కుల రాజకీయాల్లోకి లాగొద్దని చేతులు జోడించి కోరుతున్నా. మొత్తం 130 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమే.
నన్ను విమర్శించేవారు చెప్పేవరకు దేశానికి నా కులమేంటో తెలియదు. వెనుకబడిన కులంలో పుట్టడమనేది దేశానికి సేవ చేయడానికి లభించిన ఓ అవకాశంగా నేను భావిస్తున్నా..’అని మోదీ అన్నారు. ఓటమి అంచుల్లో ఉన్న విపక్షాలు దుర్భాషలకు దిగుతున్నాయని విమర్శించారు. మీరెన్ని (విపక్షాలు) ప్రయత్నాలు చేసినా వచ్చేది.. అని మోదీ అనగానే ప్రజలు ‘మళ్లీ మోదీనే’అంటూ నినదించారు. ఎస్పీ, బీఎస్పీల అవకాశవాదాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అంబేడ్కర్‌ను అగౌరవ పరిచిన ఎస్పీ కోసం మాయావతి ఓట్లు అడుగుతున్నారని మోదీ అన్నారు. కేవలం అధికారం కోసమే మాయావతి ఎస్పీ మద్దతు కోరుతున్నారని విమర్శించారు.
మే 23న చరిత్ర సృష్టిస్తాం
కొందరు తెలివైనవారు బంగాళాదుంప నుంచి బంగారం వెలికితీస్తామనే హామీ ఇచ్చారని రాహుల్‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటి హామీ తాను కానీ, తన పార్టీ కానీ ఇవ్వలేదన్నారు. నెరవేర్చలేని వాగ్దానాలు తాము చెయ్యబోమని, అబద్ధాలు చెప్పమని అన్నారు. మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత చరిత్ర సృష్టిస్తామని మోదీ అన్నారు. మండుటెండలో సైతం తన సభలకు జనం పోటెత్తడాన్ని బట్టి. 2014 నాటి రికార్డును తిరగరాసేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నట్టుగా కన్పిస్తోందని చెప్పారు. చౌకీదార్‌ను, రామభక్తులను విమర్శించిన వారి పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను నిద్రపోనివ్వని, అవినీతిపరులను వణికించే, దేశానికి మరిన్ని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టే బీజేపీకి ఓటేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment