
గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్ర బడ్జెట్‌లో నాలుగు శాతం నామమాత్రపు కేటాయింపులు చేశారు. వీటితో ఆరున్నర లక్షల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన అంటే 21వ శతాబ్దపు మయసభను ఊహించుకోవటం తప్ప మరో మార్గం లేదు.
గత మూడేళ్లుగా గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న దుర్భిక్షం నేపథ్యంలో 2018 బడ్జెట్ గ్రామీణ ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తుందని భావించారు. బడ్జెట్ ఉపన్యాసం కూడా అదే ధోరణిని ధ్వనించింది. అయితే ఆర్థికమంత్రి చూస్తున్న గ్రామీణ భారతం, ప్రజలనుభవిస్తున్న గ్రామీణ భారతం ఒక్కటేనా అన్నది ఇప్పుడు మనముందున్న సమస్య. గత 3 బడ్జెట్లలో మాట వరుసకన్నా ఉపాధి, నైపుణ్యం, గ్రామీణ ఉపాధి, ఉత్పత్తి వంటి పదాలు వినిపించాయి. ఈ బడ్జెట్‌లో అవి కూడా కరువయ్యాయి. గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య బీమా ఈ బడ్జెట్ ప్రాధాన్యతలుగా ముందుకొచ్చాయి. 2008 బడ్జెట్‌లో యూపీఏ ప్రతిపాదించిన రుణమాఫీ పథకం 2009 ఎన్నికల్లో ఫలితాన్నిచ్చినట్లుగా ఈ ఆరోగ్యబీమా ఎన్డీయేకు 2019లో అచ్చొస్తుందా అన్నది వేచి చూడాలి.
ఈ రెండు పథకాల మధ్య మౌలికమైన తేడా ఉంది. రైతు రుణమాఫీ పథకం ఎన్ని పరిమితులతోనైనా రైతుల చేతుల్లో రొక్కం మిగి ల్చింది. కానీ మోదీ ప్రభుత్వ ఆరోగ్యబీమా పథకం కార్పొరేట్ ఆసుపత్రుల ఖజానాను నింపే పథకమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యబీమా పథకాన్ని ముందుకు తేవటంతో 2014 ఎన్నికల్లో గ్రామీణ ప్రజల ఆదాయాలు రెట్టింపు చేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, అవినీతిని అంతమొందిస్తామని బీజేపీ వాగ్దానాలు నీటిమీద రాతలయ్యాయన్న అంగీకరించినట్లైంది. విత్తనాలు వేయటానికి ముందు రైతు ఆకాశంలో కనపడే ప్రతి మేఘమూ కురవటానికే వచ్చిందా అన్నట్లు చూస్తాడు. మోదీ మాయాజాలం కూడా ప్రజలకు కురవని మేఘాలు చూపించి కాలక్షేపం చేస్తోంది.
బడ్జెట్ ప్రసంగానికి, కేటాయింపులకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోటానికి ఒక్క గ్రామీణ మౌలిక రంగం గురించి ప్రస్తావనను చూస్తే సరిపోతుంది. గ్రామీణాభివృద్ధికి క్లస్టర్ విధానాన్ని అనుసరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే పాతిక ముప్పై గ్రామాలకు ఉపయోగపడేలా మౌలికసదుపాయాల కల్పన వ్యూహం. కానీ గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయింపులు 4 శాతానికి మించి పెరగలేదు. మరి ఆరున్నర లక్షల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించటం అంటే 21వ శతాబ్దపు మయసభను ఊహించుకోవటం తప్ప మరో మార్గం లేదు.
ప్రభుత్వానికి ప్రాణప్రదమైన పథకాలు స్వచ్ఛభారత్ అభియాన్, ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన, ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయి. ఆవాస్ యోజన కేటాయింపులు 9 శాతం తగ్గితే ఉపాధి హామీ కేటాయింపులు యథాతథంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు రెండు కోట్ల పాయఖానాలు, యాభై లక్షల నివాసాలు నిర్మాణం లక్ష్యంగా నిర్ణయించింది. కానీ కేటాయింపులు తగ్గట్టుగా లేవు. ఒక్క ఏపీలోనే 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని డిసెంబరులో హూంకరించిన టీడీపీ తన విజ్ఞప్తిని కనీసం ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం కూడా చేయకపోవటం గమనిస్తే రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల ఆగ్రహావేశాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నమే తప్ప మరోటి కాదని తేటతెల్లమవుతుంది.
ఇక ఆరోగ్య బీమా పథకంపై ఆర్థిక మంత్రి ప్రకటన రెండు కీలక అంశాలు చర్చకు పెడుతోంది. మొదటిది దేశంలో పేదలెందరు అన్న ప్రశ్న. దావోస్ మొదలు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, ప్రపంచ వాణిజ్య సంస్థలకిచ్చిన లెక్కల్లో దేశ జనాభాలో పేదలు 20 శాతంలోపే అన్న వాదన వినిపించిన ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న యాభై కోట్ల ప్రజానీకం కోసం ఆరోగ్య బీమా పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఏది మోసం, ఏది వాస్తవం అన్నది ప్రజలే నిర్ణయిం చుకోవాలి. పైగా 2008లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకు (ఆరెస్బీవై) నేడు మోదీ రంగు మార్చి చెప్పుకుంటున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకానికి మధ్య పేర్లలో తప్ప తేడా లేదు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పదుల కొద్దీ పథకాలకు పేర్లు మార్చటం తప్ప మోదీ గ్రామీణ ప్రజలకు కొత్తగా ఇచ్చిన వరాలు ఏమీ లేవు.
రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకు పునాది నాటి ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఆరెస్బీవై అమలు కొన్ని రాష్ట్రాల్లో తప్ప విజయవంతం కాలేదు. ప్రజల్లో ఈ పథకం, దాని ప్రయోజనం పట్ల సరైన అవగాహన లేకపోవటం ఒక కారణమైతే ప్రాథమిక వైద్యసేవలను పటిష్టం చేయకపోవటం మరో కారణం. చివరిగా 2018 బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆరోగ్యబీమా పథకం నేరుగా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరవేయటం కాకుండా బీమా కంపెనీల ద్వారా చేరవేయటానికి సంకల్పించింది. నేరుగా అందించాల్సిన సేవల విషయంలోనే ప్రభుత్వ వైఫల్యం బట్టబయలవుతుంటే మార్కెట్ నియంత్రిత సేవలు ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కల్గిస్తాయని నమ్మటం ఎలా? ప్రైవేటు వైద్య, ఇంజ నీరింగ్ కళాశాలలనే నియంత్రించలేని మనదేశంలో లక్షల కోట్ల రూపాయలతో కూడిన ప్రైవేటు ఆరోగ్య బీమా కంపెనీలను నియంత్రించి ప్రజల ఆరోగ్యానికి బీమా హామీ కల్పిస్తుందని ఆశించటం ఎలా?
వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు
కొండూరి వీరయ్య
98717 94037
Comments
Please login to add a commentAdd a comment