ఇవాంకా.. ఈ పేరు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 28 నుంచి మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (జీఈఎస్) ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు 180 దేశాల నుంచి సుమారు 2 వేల మంది పారిశ్రామిక వేత్తలతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్, దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు, ఆయా దేశాల నుంచి వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు కూడా పోగవనున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ తరహా అంతర్జాతీయ, ప్రపంచ పారి శ్రామిక వేత్తల సదస్సులు జరగడం మంచిదే. ఇలాంటి వాటి ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనేది ఆచరణకే వదిలేద్దాం. కానీ, ఇవాంకా పర్యటనకు సంబంధించిన చర్చ మొత్తం దేనికి పరిమితం అవుతుందన్నదే కీలకం.
ముఖ్యమైన వ్యక్తులు వస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కానీ, మూడ్రోజుల ముచ్చట కార్యక్రమానికి కొందర్ని బలిచేయడం సరైంది కాదు. అనాథలు, దిక్కుమొక్కులేని యాచకులను బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలించడం, జైలులో నిర్భంధించడం అనేది వారి స్వేచ్ఛకు భంగం కలిగిం చడం. నిజంగానే అందరూ ఉండి కూడా భిక్షాటన చేస్తున్న వాళ్ళను గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడాన్ని హర్షించాల్సిందే. కానీ, ఇవాంకా పర్యటన సందర్భంలోనే ఈ పని ఎందుకు చేపట్టాలి..? నగరంలో ఉన్న సుమారు 6 వేల మంది యాచకులకు నిజంగానే జీవనాధారం కల్పించాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉన్నట్లయితే, ఇంతకు మునుపే ఇలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదు?
గ్లోబల్ సమ్మిట్ జరిగే పరిసర ప్రాంతాల్లో చిరువ్యాపారులకు ఇవాంకా పర్యటనతో ఇక్కట్లు తప్పడం లేదు. మూడ్రోజుల పాటు దుకాణాలన్నీ బంద్ చేయడం, వారి జీవనాధారానికి ఆటంకం. వేలాది కుటుంబాలను తని ఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం, ఆ ప్రాంతా లలో సాధారణ ప్రజలను తిరగనివ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం వంటి చర్యలు సరైనవి కావు.
మూడున్నరేండ్లుగా వర్షాలు వచ్చిన ప్రతిసారీ రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపించినా, ఏనాడు నివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. లక్షలాధి మంది మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బం దులు పడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. హైదరాబాద్ నగరంలో నాలా వ్యవస్థ సరిగా లేక వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం. ఇవాంకా పర్యటన జరిగే ప్రాంతాల్లోని రోడ్లను మాత్రమే బాగు చేస్తున్న ప్రభుత్వం... లక్షలాధి మంది ప్రజలు తరుచుగా పడే ఇబ్బందులను పట్టించుకోనక్కర్లేదా?
ఈ మూడేండ్లలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక ప్రజలు, రైతులు, మహిళలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. దాని గురించి చర్చే లేదు. ఇవాంకా పర్యటనలో వందల కోట్లు ఖర్చు పెట్టడం, ఆమెను మెప్పిం చడం కోసం కానుకలు సమర్పించడం, కొందర్ని అవమానించి ఒక్కరికి బహుమానం ఇవ్వడమేంటని చర్చించుకుంటున్నారు. ఒక పక్క చిరిగిపోయిన చీరలిచ్చి తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ప్రభుత్వం.. అమెరికా బిడ్డకు మాత్రం రాచమర్యాదలు చేయడం సబబేనా!
- కోట రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
మొబైల్ : 96183 39490
Comments
Please login to add a commentAdd a comment