సరిగ్గా.. పుష్కరకాలం వెనక్కి వెళ్లాల్సిన విషయం. మే 6, 2007న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారిక కార్యక్రమం కోసం అమెరికాలో అడుగుపెట్టారు. ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ముఖ్య అతిథిగా రైతు బంధువు వైఎస్సార్‌ను ఆహ్వానించింది అమెరికా ప్రభుత్వం. మే 8న మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం ఎలా వెన్నెముకగా నిలవాలన్న విషయాన్ని చర్చించారు.
ఆ తర్వాత షికాగో వేదికగా ఎన్నారైలను ఉద్దేశించి వైఎస్సార్ చేసిన ప్రసంగం.. ఇప్పటికీ చాలామంది ఎన్నారైల మదిలోనే ఉంది. అమెరికా వెళ్లిన వైఎస్సార్ ఆహార్యంలో ఎలాంటి మార్పు లేదు. తెలుగుదనం ఉట్టిపడేలా రాజసమైన పంచెకట్టులో ఎన్నారైలపై చెరగని ముద్ర వేశారు రాజశేఖరరెడ్డి. సూటు, బూటు వేసుకోవాలంటూ కొందరు సన్నిహితులు పట్టుబట్టి వేయించినా.. కాసేపట్లోనే మళ్లీ పంచెకట్టులోకి వచ్చేశారు. షికాగోలో చక్కటి తెలుగులో ప్రవాసాంధ్రులతో మాట్లాడిన వైఎస్సార్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ పిలుపునిచ్చారు. తన చిరకాల మిత్రుడు ప్రైమ్ హాస్పిటల్స్ అధినేత ప్రేమ్‌సాగర్ రెడ్డితో కలిసి వివిధ వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. భారీగా ఉన్న పెద్ద పెద్ద కమతాల్లో అక్కడి రైతులు అనుసరిస్తున్న ఆధునిక విధానాలను, అత్యాధునిక సాంకేతిక యంత్రాలను చూశారు.
అమెరికాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఇప్పుడు ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ అమెరి కాలో తొలిసారి పర్యటిస్తున్నారు. అమెరికాలో ఉన్న ఏపీకి చెందిన అనేకమంది ప్రముఖులు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలతో సహా సిద్ధంగా ఉన్నారు. సొంతగడ్డకు ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల విషయంలో ప్రచార ఆర్భాటం తప్ప పారిశ్రామిక వేత్తలకు సహకారం లభించలేదన్నది వీరి ఆవేదన.
75 రోజుల పాలన
సీఎంగా వైఎస్ జగన్ పాలన ప్రారంభించి 75 రోజులకు పైగా అవుతోంది. ఈ స్వల్ప కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి భరోసా ఇచ్చేలా ఉన్నాయి. పారదర్శక పాలనను అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్, పూర్తి అవినీతి రహితంగా నడుచుకుంటామన్న ముఖ్యమంత్రి లక్ష్యం ప్రవాసాంధ్రులను ఆకర్షిస్తోంది. ఇన్నాళ్లు రాష్ట్రానికి దూరంగా ఉన్న తమకు స్థానికులకు ఉపాధి కల్పించాలన్నదే అంతిమ లక్ష్యమని, ఇప్పుడు 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలన్న సీఎం ఆలోచన తమకు ఎంతో నచ్చిందంటున్నారు.
ఎన్నారై విభాగంలో కొత్త ఉత్సాహం
సీఎం వైఎస్ జగన్ అమెరికా పర్యటనతో పార్టీ ఎన్నారై విభాగంలో కొత్త ఉత్సాహం వచ్చింది. వైఎస్సార్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి నేతృత్వంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 17 మధ్యాహ్నం డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాసాంధ్రులు భారీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తారు. ఈ భేటీలో పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొంటారని తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా (టీసీఎన్‌ఏ) తెలిపింది. గతంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్సార్ కూడా డల్లాస్ వచ్చారని, ఇప్పుడు అదే డల్లాస్‌కి ఆయన వారసుడు వస్తుండటం తమకి ఎంతో సంతోషంగా ఉందని డల్లాస్ ఎన్నారైలు తెలిపారు. - శ్రీనాథ్ గొల్లపల్లి, సీనియర్ ఔట్‌పుట్ ఎడిటర్, సాక్షి టీవీ.
Comments
Please login to add a commentAdd a comment