కేసీఆర్‌ తీరు.. జైట్లీ సందేహం పటాపంచలు! | Telangana CM KCR Succes In Administration | Sakshi
Sakshi News home page

ఉద్యమ యోధుని పాలనా దక్షత

Published Sat, Sep 1 2018 1:07 AM | Last Updated on Sat, Sep 1 2018 11:41 AM

Telangana CM KCR Succes In Administration - Sakshi

యాభై ఏళ్ల తెలంగాణ ప్రజల స్వప్నాన్ని నిజం చేసిన ఉద్యమనేత తన జాతి ప్రజల కలలను నిజం చేయడానికి తనను తాను పరిపాలనాదక్షుడిగా మలుచుకున్న తీరు అద్భుతం. ఈ సవాల్‌ను చిరునవ్వుతో స్వీకరించిన ఆయన ఈ నాలుగేళ్ల కాలంలోనే ఎన్నో విజయాలను సాధించారు. లెక్కలేనన్ని హృదయాలను గెల్చు కున్నారు. ఇవాళ తెలంగాణ తొలి ప్రభుత్వ పనితీరుకు ఆసేతు హిమాచలం జైకొడుతున్నది. లేదంటే ఒక్క మిషన్‌ భగీరథ ప్రాజెక్టును చూడడానికి 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చిపోతారా? తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు పనుల గురించి యావత్‌ దేశం మాట్లాడుకుంటుందా? తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లలో సాధించిన ప్రగతిని వివరించడానికి నా స్వానుభవంతో ప్రారంభిస్తాను.

ఒక ఉద్యమకారుడు పాలనాదక్షుడు కాగలడా..?
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి ఇదొక సమాధానం దొరకని ప్రశ్నగానే ఉండేది. కానీ, కేసీఆర్‌ పరిపాలనా తీరును చూసిన తర్వాత ఆయన సందేహం పటాపంచ లైంది. ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్లినప్పుడు స్వయంగా ఆయన ఈ విషయం చెప్పారు. ‘ఉద్యమకారులు అధికారం లోకి రావడాన్ని చూశాను. వాళ్లు మంచి పరిపాలన అందించడాన్ని మాత్రం చూడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇందుకు మినహాయింపు’. అని ఆయన అన్నారు. అవును... ఆర్థిక మంత్రిగారి ఈ మాటలు ముమ్మాటికీ నిజం. ఆశయసాధన కోసం అనితర సాధ్యమైన ఉద్యమాలు చేయడానికి, ప్రజల ఆకాంక్షలకు అను గుణంగా ‘నభూతో నభవిష్యత్‌’ అన్న రీతిలో సుపరిపాలన అందించడా నికి జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌ ఉంటుంది. అధికార పరిమితులకు లోబడి సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు.

కానీ కేసీఆర్‌ అనే మూడక్షరాలు మాత్రం ఇందుకు అతీతం. యాభై ఏళ్ల తెలంగాణ ప్రజల స్వప్నాన్ని నిజం చేసిన ఉద్యమనేత తన జాతి ప్రజల కలలను నిజం చేయడానికి తనను తాను పరిపాలనాధ్యక్షుడిగా మలుచుకున్న తీరు అద్భుతం. 2014 జూన్‌ 2న తెలంగాణ జెండా సగర్వంగా ఎగురుతున్న క్షణాన్నే ఈ సవాల్‌ను చిరు నవ్వుతో స్వీకరించిన ఆయన ఈ నాలుగేళ్ల కాలంలోనే ఎన్నో విజయా లను సాధించారు. లెక్కలేనన్ని హృదయాలను గెల్చుకున్నారు. మా రాజ కీయ ప్రత్యర్థి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇందులో ఒకరు. నిండు లోక్‌సభలో కేసీఆర్‌గారి పరిణతిని, పాలనాదక్షతను ఆయన మెచ్చు కోవడం తెలంగాణ ప్రజలకు దక్కిన అపూర్వగౌరవం. వెన్నెముక లేని నాయకుల వ్యవహార శైలి, ఢిల్లీ గద్దెల ముందు బానిసలుగా ఉండ డానికే ఇష్టపడే కొంతమంది నేతల స్వభావంతో తెలంగాణ ప్రజలకు పరిపాలించడం చేతకాదన్న అపప్రధ ఉండేది. ఆ మచ్చను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు అనతికాలంలోనే చెరిపివేశారు.

తెలంగాణ తొలి ప్రభుత్వ పనితీరుకు ఆసేతు హిమాచలం జైకొడు తున్నది. లేదంటే ఒక్క మిషన్‌ భగీరథ ప్రాజెక్టును చూడడానికి 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చిపోతారా? తెలంగాణ జీవధార కాళే శ్వరం ప్రాజెక్టు పనుల గురించి యావత్‌ దేశం మాట్లాడుకుంటుందా? టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి ప్రతీ రోజూ ఏదో ఒక రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి హైదరాబాద్‌కు వస్తూనే ఉన్నాడు. తెలంగాణ మూల మూలకు వెళుతున్నాడు. అయితే ఇదంతా ఎలా సాధ్యమయింది? ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గర మంత్రదండం ఏదైనా ఉందా? లేదంటే రాత్రికి రాత్రే మాయచేసే తాయత్తు ఏమైనా ఉందా? ఇవేం లేవు కానీ అంతకన్నా శక్తి వంతమైనది ఉంది. ఏ రాజకీయ నాయకుడి దగ్గర లేని ఒకే ఒక్క గుణం సబ్బండ వర్ణాల గుండెల్లో ఆయన కొలువు కావడానికి కారణం అయింది. అదే ‘ఆర్తి’. తెలంగాణ జీవితాలు, సంఘర్షణల పట్ల ఉన్న అవగాహన, మానవీయతే కేసీఆర్‌ను నడిపిస్తున్నాయి.  

ఉద్యమ జెండాను భుజాన వేసుకుని పన్నెండేళ్లు తెలంగాణ మూల మూలకు వెళ్లిన కేసీఆర్‌కు ఇక్కడి ప్రజలకు ఏం కావాలో స్పష్టంగా తెలుసు. ఆదిలాబాద్‌ అడవి బిడ్డలకు ఏం కావాలో, సిరిసిల్ల నేతన్నలకు ఏం చేయాలో, నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధితులకు ఏం ఇయ్యాలో, పాల మూరు వలసలను ఎలా ఆపాలో స్పష్టంగా తెలుసు. అందుకే అధికా రంలోకి వచ్చిన మరుక్షణం నుంచే సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రారంభించారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన తీరని అన్యాయాన్ని సరిదిద్దేందుకు మన ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. నీళ్ల విషయానికొస్తే, ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ ఇంటికి తాగునీరు లక్ష్యంగా పనిచేస్తోంది. కేసీఆర్‌ లోని కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్‌ అంటే రిజర్వాయర్లు అన్న ట్టుగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. ఏటా 25 వేల కోట్ల రూపాయలను ఇందుకు ఖర్చు చేస్తున్నాము. వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరిని తెలంగాణ వరప్రదాయనిగా మార్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు, మహబూబ్‌నగర్‌ వలసలను ఆపేం దుకు పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాటు సీతారామ ప్రాజెక్టులతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలంగాణలోని ఏ ఆడబిడ్డ కూడా తాగునీటి కోసం తన్లాడొద్దని విశ్వమెరుగని మహాకార్యమైన మిషన్‌ భగీరథను మన ప్రభుత్వం మొదలుపెట్టింది. ఒకప్పుడు తాగడానికి గుక్కెడు నీళ్లు అడిగితే దేవుడే దిక్కు అన్న సీమాంధ్ర పాలకులు సిగ్గుపడేలా త్వరలో మిషన్‌ భగీరథతో ప్రతీ ఆవాసానికి శుద్ధి చేసిన తాగునీటిని అందించబోతున్నాము. కాంగ్రె స్‌లో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన నాయకులు కూడా తమ సొంత జిల్లాలోని రెండు లక్షల మంది ఫ్లోరైడ్‌ బాధితులకు మంచినీళ్లు ఇవ్వలేక పోయారు. కానీ మేం మాత్రం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఫ్లోరైడ్‌ రక్కసిని తరిమేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికత తో రూపొందిన విప్లవాత్మకమైన టీఎస్‌ఐపాస్‌ విధానం రాష్ట్రంలో ఒక నూతన పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చింది. ప్రపంచంలోని అనేక దిగ్గజ కంపెనీలకు తెలంగాణ ‘పెట్టుబడుల కేంద్రం’గా మారింది. యాపిల్, గూగుల్, అమెజాన్, ఊబర్, జెడ్‌ఎఫ్, నోవార్టిస్, ఐటీసీ వంటి ప్రఖ్యాత కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలు విస్తరించాయి. ఈ  నాలుగేళ్లలో మా ప్రభుత్వం 6,500 పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది. ఫలితంగా 1,23,000 కోట్ల రూపాయలు పెట్టుబ డుల రూపంలో వచ్చాయి. దాదాపు 6 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించ బడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ అగ్ర స్థానంలో ఉంది.

తెలంగాణ ఏర్పడితే నిధులకు కటకట ఏర్పడుతుందన్న అనుమా నాలను పటాపంచలు చేస్తూ ఏటికేడు రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నది. ముఖ్యమంత్రి గారి దార్శనికత, ప్రగతి శీల విధానాలతో రాష్ట్ర ఆదాయం 17.5% పెరిగింది. దేశంలోని ఏ రాష్ట్రం కూడా మన దరిదాపుల్లో లేదు. ఇది సామాన్యమైన విషయం కాదు. రాష్ట్ర ఆదాయం పెరుగుతున్న ఫలి తంగా ప్రజల తలసరి ఆదాయం పెరుగుతున్నది. రాష్ట్ర ఖజానాలో చేరు తున్న ప్రతీపైసాను తిరిగి ప్రజల బాగు కోసమే మా ప్రభుత్వం విని యోగిస్తోంది. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ,  వృత్తుల వారీగా సంక్షేమ కార్యక్రమాలు, మహిళా శిశు సంక్షేమంపై భారీగా ఖర్చు చేస్తున్నది. సంక్షేమ రంగంలో తెలంగాణ చూపిస్తున్న శ్రద్ధను చూసి మిగతా రాష్ట్రాలు నోరెళ్లబెడుతున్నాయి.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరి గింది. ఆ నష్టాన్ని భర్తీ చేసి, భవిష్యత్తులో మరెప్పుడూ జరగకుండా స్థానికులకే సంపూర్ణంగా ఉద్యోగాలు దక్కాలన్న సదుద్దేశంతో ముఖ్య మంత్రి కేసీఆర్‌గారు నూతన జోనల్‌ వ్యవస్థకు రూపకల్పన చేశారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రులను ఒప్పించి ఏడు కొత్త జోన్లు, 2 మల్టీ జోన్‌ లతో 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేయడం మామూలు విష యం కాదు. కేసీఆర్‌ గారి ఆలోచనను సంపూర్ణంగా సమర్థించిన కేంద్రం ఎలాంటి మార్పులు లేకుండా జోనల్‌ వ్యవస్థకు ఓకే చెప్పింది. ముఖ్య మంత్రి కేసీఆర్‌ గారు సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటి.
నిధులు, నీళ్లు, నియామకాల కోసమే కాదు నేతన్నల బాగు కోసం కూడా తెలంగాణ ఉద్యమం పిడికిలి బిగించింది. తెలంగాణ కీర్తి పతా కాన్ని విశ్వవ్యాప్తం చేసిన నేతన్నల సంక్షేమం కోసం ఒకనాడు జోలెపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు, ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో వాళ్లకు ఎంత చేయాలో అంత చేస్తున్నారు. మా ప్రభుత్వం అమలుచేసిన పలు పథకాలతో నేతన్నల ఆదాయం రెట్టింపయింది. నేతన్నకు చేయూత, త్రిఫ్ట్, బీమా పథకం, రుణాల మాఫీ, బతుకమ్మ చీరలతో నేతన్నలకు భవిష్యత్‌ మీద ఆశ కల్పించగలిగాము.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేయబోతున్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్న దాతకు పెట్టుబడి సహాయం అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పడానికి నేను గర్వపడతాను. బీమాతో రైతు కుటుంబానికి ధీమా ఇస్తున్నాము. వ్యవసాయ రుణాల మాఫీతో సాగును సులభతరం చేస్తు న్నాము. 24 గంటల ఉచిత కరెంటుతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాము. రైతు సమన్వయ సమితులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చబోతు న్నామని చెప్పడానికి నేను ఏ మాత్రం సంకో చించను.
ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే, పరలోకానికి పోయినట్టే అనుకునేవారు. మేం అధికారంలోకి వచ్చిన తక్కువకాలంలోనే ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న అపనమ్మకాన్ని తొలగించాము. ఇందు కోసం రెండంచెల విధానాన్ని రూపొందించాము. ముందుగా సర్కార్‌ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచినాము. ఆ తరువాత ఆరోగ్యలక్ష్మీ, కేసీఆర్‌ కిట్స్‌తో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించాము. కంటివెలుగు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌తో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాము.

ఒక దేశ భవిష్యత్‌ రాబోయే తరాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నిజం తెలుసు కాబట్టే రేపటి తరంపై మా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. చదువుతోనే ఈ సమాజాన్ని మార్చగలమన్న నమ్మకంతో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నాము. రెసిడె న్షియల్‌ స్కూళ్లు, గురుకులాల ఏర్పాటుతో నాణ్యమైన విద్యను ఉచి తంగా అందిస్తున్నాము. ప్రైవేటు రంగంలో ఒక విద్యార్థిపై సుమారుగా 80–90 వేలు ఖర్చు పెడుతుంటే, ప్రభుత్వ రంగంలో సుమారు లక్షా 30 వేల రూపాయలను ఖర్చు చేస్తున్నాము. విద్య, వైద్య రంగాల్లో మా ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న మార్పులతో ప్రజలకు సర్కార్‌ వ్యవస్థల మీద నమ్మకం కలిగింది. ఈ విశ్వాసాన్ని సడలకుండా చూసే బాధ్యతను కూడా మేం తీసుకున్నాము. అందులో భాగంగానే పరిపాలనను వికేంద్రీకరించాము. కొత్త జిల్లాలు, కొత్త గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేశాము. హైద రాబాద్‌ మహానగరంలోనూ సర్కిళ్ల పెంపుతో ప్రభుత్వ పాలనను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాము.

తెలంగాణ ఏర్పడితే చీకట్లే శరణ్యం అన్న వారు చీకట్లో కలిశారు కానీ తెలంగాణ మాత్రం దేదీప్యమానంగా వెలుగుతోంది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, హరితహారం, ఉద్యోగుల పీఆర్సీ, కాంట్రాక్ట్‌ కార్మికుల రెగ్యు లరైజేషన్, షీ టీమ్స్‌... ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ట్రెండ్‌ సెట్టింగ్‌ కార్యక్రమాలే. వీటన్నింటి గురించి చెప్పడానికి ఒక్క రోజు సరిపోదు. రాయడానికి ఒక్క పేజీ సరిపోదు. ఇది అతిశయోక్తి కాదు. మా మీద మాకున్న విశ్వాసం. అంతకంటే ఎక్కువగా ప్రజలపై ఉన్న నమ్మకం. మేం ఏది చేసినా ప్రజల కోసం, ప్రజల కోణంలో ఆలోచించి, ప్రజల బాగు కోసమే చేస్తాము. ఈ నిజం ప్రతిపక్షాలకు తెలియదు కానీ ప్రజ లకు మాత్రం బాగా తెలుసు. అందుకే తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ప్రతీ ఎన్నికలోనూ మా పట్ల ప్రజల నమ్మకం చెక్కుచెదరలేదు. మెదక్‌ ఉప ఎన్నిక నుంచి నుంచి మొదలుపెడితే మొన్న జరిగిన పాలేరు ఎన్నిక వరకు టీఆర్‌ఎస్‌దే విజయం. గులాబీ పార్టీని ప్రజలు ఎంతగా గుండెల్లో పెట్టుకున్నారంటే కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు చనిపోయిన పాలేరు, నారాయణ ఖేడ్‌లకు జరిగిన ఉపఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇక మినీ ఇండియా లాంటి హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. ఒకప్పుడు టీఆర్‌ఎస్‌కు ఒక్క కార్పొరేటర్‌ కూడా లేని నగరంలో ఈరోజుæ99 మంది కార్పొరేటర్లు గెలిచారంటే, కేసీఆర్‌ పాల నకు ఎంతటి ప్రజామోదం ఉన్నదో అర్థమవుతోంది. ప్రజలకు మంచి చేయడమే తప్ప మరేం తెలియని సీఎం కేసీఆర్‌ పాలన పట్ల విద్వేషాన్ని నింపుకుని విషం చిమ్ముతున్న ప్రతిపక్షపార్టీల కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు కర్రు కాల్చి వాతపెడుతూనే ఉన్నారు.

మా ఈ నాలుగేళ్ల పరిపాలన ఆరంభం మాత్రమే. నిజం చెప్పా లంటే మేం పూర్తిస్థాయిలో అధికారంలో ఉన్నది కేవలం మూడున్నరేళ్లు మాత్రమే. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో విచిత్రమైన, గందరగోళ పరి స్థితులు ఉండేవి. మంత్రులతై ఉండేవారు కానీ వాళ్ల దగ్గర అధికారులు లేకుండిరి. మంత్రిగా నేను రెండు శాఖల బాధ్యతలు చూస్తే, నా శాఖ ముఖ్యకార్యదర్శి ఐదు శాఖల బాధ్యతలు చూశారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సివిల్‌ సర్వీస్‌ అధికారుల విభజనపై కేంద్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణితో ఆ పరిస్థితి తలెత్తింది. మేం విధానాలు రూపొందించినా, వాటిని అమలుచేసేందుకు సరైన అధికార వ్యవస్థ లేకుండానే ఒక సంవత్సరం వృథా అయింది. దీనికి తోడు పక్క రాష్ట్రం నుంచి ఎదురైన అనేక ఇబ్బందులను ముఖ్యంగా ఉమ్మడి సంస్థల విభ జన జరగకపోవడం, ఖమ్మంలోని ఏడు మండలాలను ఆంధ్రలో కల పడం, సీలేరు విద్యుత్‌ కేంద్రాన్ని కోల్పోవడం వంటి ఎన్నో సమస్యలను ముఖ్యమంత్రి గారి పరిపాలనాదక్షతతో ఈ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో పనిచేయడాన్ని గౌరవంగా భావించే నేను ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని స్పష్టం చేయదల్చుకు న్నాను. మన ఈ నాలుగేళ్ల పాలన తొలి అడుగే. సబ్బండ వర్ణాల సంక్షే మమే లక్ష్యంగా సాగే సుపరిపాలన కోసం ఇంకొన్ని అడుగులు వేయాల్సి ఉంది. అయితే మేం వేస్తున్న ఈ తొలి అడుగులే అభివృద్ధి బాటలుగా యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రానున్న కాలంలో బంగారు తెలంగాణ కేంద్రంగా యావత్‌ దేశానికి మార్గనిర్దేశనం చేస్తామనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.


వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర ఐటీ,
మున్సిపల్, పరిశ్రమల శాఖా మంత్రి
కల్వకుంట్ల తారక రామారావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement