సాక్షి, విజయవాడ: జిల్లాలోని మొవ్వ మండలానికి చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ మొవ్వ పద్మ దుర్గగుడి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పద్మ ప్రస్తుతం ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లదేవస్థానం (దుర్గగుడి) ఈఓ బాధ్యతలతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దుర్గగుడిలో జరిగిన తాంత్రిక పూజలకు బాధ్యురాలిని చేస్తూ తొలి మహిళా ఐఏఎస్ అధికారి ఎ.సూర్యకుమారిని ఈఓ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. మళ్లీ ఈఓగా మహిళా ఐఏఎస్ అధికారినే నియమించింది.
ఆధార్ అనుసంధానంలో....
పద్మ కృష్ణాజిల్లాలో జన్మించినా విద్యాభాసం తిరుపతిలోనే జరిగింది. ఎస్‌వీ యూనివర్పీటీలోనే పీజీ, పీహెచ్‌డీ చేశారు. 1993లో గ్రూపు–1 అధికారిగా ఉద్యోగంలో చేరారు. 2004 బ్యాచ్‌లో ఐఏఎస్ అధికారిగా మారారు. దశాబ్ద కాలంగా ల్యాండ్ రికార్డ్స్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమశాఖ, పౌరసరఫరాలశాఖలో వివిధ హోదాల్లో పద్మ బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగ విద్యార్థులకు ఉపకారవేతనాలు సక్రమంగా అందేందుకు వీలుగా సెంట్రర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కింద ప్రత్యేక ఆన్‌లైన్ అప్లికేషన్ తయారీలో ఆమె కీలక పాత్ర పోషించారు. వివిధ పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేయడంలో కృషి చేశారు. గిరిజన సంక్షేమ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె భర్త వి.వి.ఆర్.ప్రసాద్ ఈసీఐఎల్‌లో డీజీఎం గాపని చేసి ఉద్యోగవిరమణ పొందారు.
అమ్మవారి దయతో అన్నీ చక్కదిద్దుతా
ఈఓగా నియమితులైన పద్మ ‘సాక్షి’తో మాట్లాడారు. అమ్మవారి దయతో దుర్గగుడిలోని అన్ని సమస్యలను చక్కదిద్దుతానన్నారు. వచ్చేవారం ఈఓగా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. కనకదుర్గమ్మకు సేవ చేసే అవకాశం రావడంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధే తనకు ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment