జిల్లాలోని గుంటూరు నగరంతో పాటు ఇతర పట్టణాల్లో గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి నెలలో అధికారులు, బీఎల్వోలు, విద్యార్థులు ఐఆర్‌ఈఆర్ (ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్) సర్వే చేపట్టారు. సర్వేను తప్పుల తడకగా చేపట్టడంతో జిల్లాలో వేలాది ఓట్లు గల్లంతయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ఎవరి ఓట్లు ఏ పోలింగ్ బూత్‌లకు మారాయో తెలియని పరిస్థితి. కొన్నిచోట్ల బీఎల్వోలు సక్రమంగా సర్వే చేయకపోవడం, అవగాహన లేని కళాశాలల విద్యార్థులతో సర్వే చేయించడం, అధికార పార్టీ కుయుక్తుల కారణంగానే ఈ పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య తగ్గి పట్టణాల్లో ఓట్లు పెరగాల్సి ఉండగా అందుకు భిన్నంగా పట్టణాల్లో ఓట్లు తగ్గిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
సాక్షి, అమరావతి బ్యూరో: వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలంలో కొత్తగా ఓటర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు వాటిని పరిశీలించకుండా పక్కన పడేశారు. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు మీకోసం గ్రీవెన్స్‌లో కలెక్టర్ కోనశశిధర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి దరఖాస్తులను పరిశీలించేలా చేసి సమస్యను పరిష్కరించారు. ఇదే పరిస్థితి నియోజకవర్గంలోని మిగతా మండలాల్లోనూ ఉంది.
సత్తెనపల్లెలో ఓ వర్గం వారిని టార్గెట్ చేసి..
సత్తెనపల్లె పట్టణంలో ఓ వర్గం వారి ఓట్లనే టార్గెట్ చేసి తొలగించినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. పట్టణంలోని పోలేరమ్మ వీధి ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కాపు వర్గానికి చెందిన 50 మందికి పైగా ఓట్లను తొలగించారు. రాజుపాలెం మండలంలో గతంలో 33,297 ఓట్లు ఉండగా వాటి సంఖ్య ప్రస్తుతం 35,935కు చేరింది. నకరికల్లు మండలంలో గతంలో 46,136 ఓట్లు ఉండగా, ప్రసుత్తం వాటి సంఖ్య 47,137 నమోదైంది. ముప్పాళ్లలో గతంలో 31,772 ఓట్లు ఉండగా, ప్రస్తుతం ఓట్ల సంఖ్య 32,608గా ఉంది. సత్తెనపల్లి రూరల్ మండలంలో గతంలో 54,348 ఓట్లుండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 56,490గా నమోదు అయ్యింది.ఇలా పట్టణంలో 9 వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి.
నరసరావుపేటలో మారిన ఓట్లు..
నరసరావుపేటలో ఐఆర్‌ఈఆర్ సర్వే తప్పుల తడకగా మారింది. ఓ పోలింగ్ బూత్ పరిధిలోని బూత్ లెవల్ ఆఫీసర్‌ను, ఇంకో పోలింగ్ బూత్‌కు మార్చి సర్వే చేయించడం, కొన్నిచోట్ల కళాశాల విద్యార్థులను వినియోగించడంతో తప్పులు నమోదయ్యాయి. నరసరావుపేటలో 21,000 ఓట్లు తగ్గిపోయాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేయడంతో కళ్లు తెరిచిన అధికారులు కొన్ని తప్పులను సరి దిద్దారు. కొంతమంది ఓటర్లను మాత్రం సంబంధం లేని మరో ప్రాంతంలో బూత్‌లు పెట్టారు.
వినుకొండ కథ వేరు..
వినుకొండ నియోజకవర్గంలో కొత్తగా ఓటర్లు నమోదు చేసుకొన్న వారి దరఖాస్తులు పరిశీలించకుండా పక్కన వేస్తున్నారు. ప్రధానంగా టీడీపీకి అనుకూలంగా ఉన్న బీఎల్వోలు ఉన్న చోట ఈ తంతు సాగుతోంది. కొన్ని చోట్ల ఉదాహరణకు 20 మంది దరఖాస్తు చేసుకొంటే నామమాత్రంగా పరిశీలించి మిగతా వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు.
‘ఈ ఫొటోలోని వ్యక్తి అంబటి రాంబాబు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావు పేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు. పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి. తనతో పాటు ఆయన, కుటంబ సభ్యులకు సంబంధించిన నాలుగు ఓట్లు గల్లంతు అయ్యాయి’ ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతల ఓట్లు గల్లంతయ్యాయి. గతంలో పట్టణంలో 44,107 ఓట్లు ఉండగా ప్రస్తుతం 34,475 ఓట్లు మాత్రమే ఉండటం గమనార్హం. 9632 ఓట్లు సర్వేలో గల్లంతయ్యాయి’
‘ఈ ఫొటోలోని వ్యక్తి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. నరసరావుపేట ఎమ్మెల్యే. గతంలో ఈయన 150 నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటర్‌గా ఉండేవారు. ప్రస్తుతం ఆయన ఓటు 162 పోలింగ్ బూత్‌లోకి మారింది. ఇలా నరసరావుపేటలో 21 వేలకు పైగా ఓటర్లను ఇష్టారీతిన సర్వే పేరుతో ఇతర బూత్‌లకు మార్చారు. సంబంధం లేని దూరప్రాంతాల బూత్‌లకు మార్చారు.
ఓటు హక్కు కోల్పోవడం ప్రమాదకరం
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కోల్పోవడం ప్రమాదకరం. సత్తెనపల్లి పట్టణంలో అధికార పార్టీ నేతలు పనిగట్టుకొని దాదాపు 9 వేలకు పైగా ఓట్లు తీసివేయించారు. ఓ అధికారి పార్టీ నేతకు కమిషనర్ తొత్తుగా వ్యవహరించి ఓట్ల తొలగింపులో కీలక పాత్ర పోషించారు. ఓట్లు గల్లంతు కావడం హేయమైన చర్య. ఈ విషయాన్ని తక్షణం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరతాం. పరిష్కరించకపోతే తగిన విధంగా పోరాడతాం.– వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment