గుంటూరు, శావల్యాపురం: అంతా శూన్యం..అంతా నిర్వేదం..అంతా నిస్సత్తువ..ఎన్నో ఏళ్లుగా నా చుట్టూ అల్లుకున్న బంధాలు, అనుబంధాలు అన్నీ తీరిపోయాయి. కట్టెగా మారిన నా శరీరం వద్ద రాలిన కన్నీటి బొట్లు నా ఆత్మఘోషకు ఆజ్యం పోశాయి. సొంత ఇంటిని, పుట్టిన ఊరిని, ఈ లోకాన్ని వదిలిన నన్ను సాగనంపుతున్న వేళ.. ఇదిగో వాగు..కొద్దిసేపు ఆగు అంటూ నాతోపాటు నన్ను తీసుకెళుతున్న వారినీ నిలేసింది. తన ఉధృతితో చచ్చిన నన్ను తీసుకెళుతున్న బతికున్న వారినీ భయపెట్టింది.
వీడి చావు మన చావుకొచ్చిందిరా అంటూ ఆ వాగు దాటలేక నా బంధువే ఒకరు అన్న మాటలు ఆగిన నా గుండెల్లో కన్నీటి సుడులయ్యాయి. అప్పుడు నా కళ్ల ముందు అధికారులకిచ్చిన వినతిపత్రాలు, పాలకులు ఇచ్చిన హామీలు పొరలు పొరలుగా కనిపించాయి. జన్మభూమి అంటూ ఊళ్లోకి వచ్చిన వారికి వాగు దాటే దారి చూపించండయ్యా అంటూ వేడుకున్న గుర్తులు ఈ ప్రవాహంలో కలిసిపోతున్నట్టే అనిపించాయి. అందుకే పాలకులారా ? అధికారులారా ? మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటున్నా, బతికున్నప్పుడు ఎలాగూ మా సమస్యలు పట్టించుకోలేదు.. కనీసం చచ్చాకైనా మా కాలనీవాసుల అంతిమయాత్ర వెంట నలుగురు నడిచేలా దారి చూపించండి. – శావల్యాపురం మండలం బొందిలిపాలెం దళితవాడలో ఓ మృతుని ఆత్మఘోష
Comments
Please login to add a commentAdd a comment