బ్లడ్ క్యాన్సర్కు కొత్త మందు
లండన్: బ్లడ్ క్యాన్సర్ రోగులకు అందించే కీమోథెరపీ చికిత్సలో కొత్త డ్రగ్ను అభివృద్ధి చేసినట్లు లండన్కు చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇప్పటివరకూ క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ విధానంలో ప్రభావవంతంగా పనిచేసే ఔషదాలు లేని కారణంగా మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి మందుల కన్నా ఎంతో ప్రభావవంతంగా పనిచేసే జీఎస్-4059 అనే ఔషదాన్ని లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 2012లో మొదలైన జీఎస్-4059 ఔషధ ప్రయోగానికి చెందిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ప్రకటించారు.
బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన సుమారు 90 మంది బ్లడ్ క్యాన్సర్(ల్యుకేమియా) వ్యాధిగ్రస్తులపై ఈ ఔషదం మంచి ఫలితాలను చూపిందని శాస్త్రవేత్తలు తెలిపారు. జీఎస్-4059 ఔషధం క్యాన్సర్ కణంలోని బీటీకే అనే ప్రొటీన్ను నిరోధించడం ద్వారా క్యాన్సర్ వృద్ధికి అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ఉన్నటువంటి కీమోథెరపీ చికిత్సా విధానంలో నూతన అధ్యాయానికి ఈ ఔషధం దారి తీస్తుందని లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త హరియత్ వాల్టర్ తెలిపారు.