యోగాతో కూడా డేంజరే
ఆయురారోగ్యాలతోపాటు మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో మంచిదని నమ్ముతున్న భారతీయులు దాదాపు ఐదువేల సంవత్సరాల నుంచి యోగాను అభ్యాసం చేస్తున్న విషయం తెల్సిందే. అందుకనే భరత దేశం ఇచ్చిన పిలుపు మేరకు ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని ప్రపంచయోగా దినోత్సవంగా కూడా ప్రకటించింది. హాలివుడ్ సెలబ్రిటీలు బెయాన్స్, లేడీ గగాలు, బ్రెజిల్ సూపర్ మోడల్ గిస్లీ బుండ్‌చెన్‌లతోపాటు డేవిడ్, విక్టోరియా బెకమ్‌లు యోగాను ప్రమోట్ చేస్తున్నారు. యోగావల్ల శరీర అవయవాలకు, ముఖ్యంగా చేతులకు ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.
యోగా చేస్తున్న పది మందిలో ఒకరికన్నా ఎక్కువ మందికి ‘మస్క్యులోస్కెలెటల్’ పెయిన్స్ అంటే కండస్థ ఎముకలకు సంబంధించిన నొప్పులు వస్తాయని వెల్లడైంది. ఇంతకు ముందే అవయవ నొప్పులు ఉన్నవారు యోగా చేస్తే అవి మరింత పెరిగే అవకాశం ఉందని సిడ్నీ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఎవాంజలస్ పప్పాస్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. యోగా వల్ల భుజాలు, మోచేతులు, ముంచేతులకు నొప్పులు వస్తాయని, కొన్ని సార్లు కాళ్లకు కూడా నొప్పులు వస్తాయని ఆయన చెప్పారు. ఇతర క్రీడల వల్ల శరీరానికి ఎలా గాయాలయ్యే అవకాశం ఉందో, యోగా వల్ల కండరాలకు గాయాలయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. యోగా వల్ల తాము ఇంతకుముందు అంచనావేసిన ముప్పు కంటే ఇప్పుడు ముప్పు పదింతలు ఎక్కువని స్పష్టమైందని ఆయన చెప్పారు.
ఈ యోగా అధ్యయన వివరాలను ‘బాడీ వర్క్ అండ్ మూవ్‌మెంట్ థెరపీస్’ అనే పుస్తకంలో ప్రచురించారు. న్యూయార్క్‌లో రెండు వేర్వేరు యోగా క్లాసులకు హాజరవుతున్న 350 మందిపై అధ్యయనం జరపడం ద్వారా ఈ వివరాలను సేకరించినట్లు ఆయన చెప్పారు. వారిలో మొత్తం 26 శాతం మంది యోగాభ్యాసకులు సమస్యలు తలెత్తాయి. కొందరిలో పాత నొప్పులు తిరగతోడగా లేదా ఎక్కువకాగా, కొంత మందికి కొత్తగా నొప్పులు మొదలయ్యాయి. తమకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని మిగతా 76 శాతం మంది అభ్యాసకులు తెలిపారు. కండస్థ ఎముక నొప్పులతో బాధపడుతున్న తమకు ఆ నొప్పులు తగ్గాయని కూడా కొంత మంది చెప్పారు.
రక్తపోటును, గుండెపోటు, మానసిక ఒత్తిడిని అరికట్టడంలో యోగా నిర్వహిస్తున్న పాత్రను విస్మరించలేమని, కానీ కండర సంబంధిత సమస్యలు యోగా వల్ల ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. సంక్లిష్టమైన, కఠినమైన యోగాసనాలకు బదులుగా సులభమైన యోగాసనాలే మంచిదని వారంటున్నారు. యోగా శిక్షణ ఇచ్చే టీచర్లు కూడా తమ విద్యార్థులకు ఏమైనా నొప్పులతో బాధపడుతున్నారా?, యోగాభ్యాసం వల్ల కొత్తగా నొప్పులు వచ్చాయా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటే వాటిని ముందుగానే అరికట్టవచ్చని ప్రొఫెసర్ ఎవాంజలస్ అభిప్రాయపడ్డారు. తమ అధ్యయనాలు కూడా ఎక్కువగా యోగా శిక్షకులకు ఉపయోగపడేవేనని ఆయన చెప్పారు.