వజ్రపుకొత్తూరు: తోటలో పనిచేయడానికి వెళ్తున్న వ్యక్తులపై ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కొండపల్లి గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మడ్డు రామకృష్ణ(50), అంబటి పాపారావు(45) జీడి తోటలో కూలి పనికి వెళ్తున్న సమయంలో మూడు ఎలుగు బంట్లు వారిపై దాడికి దిగాయి.
ఈ దాడిలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో విశాఖకు తీసుకెళ్లారు. కాగా ఈ నెలలో ఎలుగు బంట్లు దాడి చేయడం ఇది మూడవసారి అయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆందోళన చేస్తున్నారు.