ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోమవారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ముందు హాజరయ్యారు. కేసులో బెయిల్ మంజూరు చేస్తూ.. నియోజకవర్గం వదిలి వెళ్లరాదని హైకోర్టు షరతు విధించింది. దీనిని చూపుతూ ఏసీబీ కోర్టు గత విచారణకు రేవంత్ హాజరుకాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి... తదుపరి విచారణకు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రేవంత్ కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ కూడా కోర్టుకు హాజరయ్యారు.
అయితే చార్జిషీట్‌ను విచారణకు పంపిన తర్వాతే కోర్టుకు హాజరుకావాలని చెప్పినా.. ఎందుకు వచ్చారంటూ న్యాయమూర్తి వారిని ప్రశ్నించారు. ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరుకాగా.. కోర్టుకు వెళ్లాలని సూచించారని, అందుకే వచ్చామని వారు తెలియజేశారు. వీరి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేశారు. రోజూ ఏసీబీ అధికారుల ఎదుట హాజరై సంతకం చేస్తున్నా... వారు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఉదయసింహ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.
ఓఎంసీ కేసు విచారణ 24కు వాయిదా
ఓఎంసీ కేసు విచారణలో భాగంగా గాలి జనార్దనరెడ్డి మినహా ఇతర నిందితులు సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా జనార్దనరెడ్డి హాజరుకాలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించడంతో కోర్టు అనుమతించింది. ఈ కేసులో తమ పేర్లను తొలగించాలని కోరుతూ నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కూడా 24కు వాయిదాపడింది.