Vote for case
-
ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు రేపటికి వాయిదా..
హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణకు వచ్చింది. వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డి రేవంత్‌రెడ్డి మాజీ పీఏ సైదయ్య వాంగ్మూలం నమోదు చేశారు. తదుపరి విచారణ రేపటి(శుక్రవారం)కి వాయిదా వేశారు. కాగా తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. -
రేవంత్ బెయిల్ రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ షరతులను రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారని, కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేస్తున్నారని ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి పిటిషన్లో కోరారు. రేవంత్‌రెడ్డి మాటల వల్ల కేసులో సాక్ష్యం ఇచ్చేందుకు సాక్షులెవరూ ముందుకొచ్చే అవకాశాలు ఉండవని కోర్టుకు విన్నవించారు. ‘‘ఓటుకు కోట్లు’ కేసులో రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో హైకోర్టు పలు షరతులు విధించింది. నియోజకవర్గాన్ని దాటవద్దని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. కానీ బెయిల్‌పై విడుదలైన వెంటనే బహిరంగ ర్యాలీ నిర్వహించిన రేవంత్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తరువాత అనారోగ్య కారణాలను చూపుతూ బెయిల్ షరతుల సడలింపునకు పిటిషన్ దాఖలు చేసి, అనుకూల ఉత్తర్వులు పొందారు. కీలక షరతులను సడలించిన హైకోర్టు, దర్యాప్తులో జోక్యం చేసుకోవడం గానీ, కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం గానీ చేయరాదని రేవంత్‌కు స్పష్టం చేసింది. కానీ ఈ షరతును రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారు. ఈనెల 9న హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నా మీద కుట్రలు, కుతంత్రాలు చేసి ఆ తరువాత జైలు పంపించారు. దీంతో కొడంగల్ నియోజకవర్గానికి పరిమితమై ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చాను. ఆట మొదలైందని అంటున్నారు మిత్రులు. ఆటకాదు వేట మొదలైంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు తీవ్ర అభ్యంతరకరం. ఇది కేసు గురించి వ్యాఖ్యలు చేయడమే కాదు. హైకోర్టు విధించిన షరతును ఉల్లంఘించడమే. సాక్ష్యం చెప్పేందుకు సాక్షులు ముందుకు రాకుండా చేసేందుకే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా చేయడం కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే. కాబట్టి రేవంత్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేసి తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి పంపితే తప్ప దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. -
ఏసీబీ విచారణకు లోకేశ్ డ్రైవర్ డుమ్మా
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి ఏసీబీ విచారణకు గైర్హాజరయ్యారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తమ ఎదుట హాజరు కావాలన్న ఏసీబీ ఆదేశాలను బేఖాతరు చేశారు. అధికారులు జారీ చేసిన నోటీసుల ప్రకారం గురువారం ఉదయం 10.30 గంటల కల్లా లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలి, కానీ రాలేదు. కొండల్‌రెడ్డి కోసం గురువారం రోజంతా ఎదురు చూసిన ఏసీబీ అధికారులు... తదుపరి కార్యాచరణపై దృష్టిసారించారు. ప్రస్తుతం సీఆర్పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) ప్రకారం జారీచేసిన నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో... నేరుగా సెక్షన్ 41ఏ (నిందితుడిగా అనుమానిస్తూ) నోటీసులు జారీచేసేందుకు ఏసీబీ కసరత్తు చేస్తోంది. అసలు ఈ కేసులో కీలకమైన వ్యక్తులంతా విచారణకు డుమ్మా కొడుతుండడాన్ని ఏసీబీ సీరియస్‌గా పరిగణిస్తోంది. లోకేశ్ డ్రైవర్ సహా ఇలా డుమ్మా కొడుతున్న వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు నోటీసులు అందుకున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేదు. తాజాగా లోకేశ్ డ్రైవర్ కూడా డుమ్మా కొట్టారు. ‘పెద్ద’ల పాత్రను దాచేందుకే...? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.50 లక్షలిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఇతర టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏసీబీ చిత్రీకరించిన వీడియోలో రేవంత్ పదే పదే తమ ‘బాస్’ ఆదేశాల మేరకే ఇదంతా చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు సైతం బయటకు వచ్చాయి. ఈ వీడియో, ఆడియో టేపులు వాస్తవమైనవంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ధ్రువీకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలను ఛేదించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది. ఒక్కొక్కరికీ నోటీసులిస్తూ ‘పెద్ద’ల పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది. అందులో భాగంగా చంద్రబాబు తనయుడు లోకేశ్ పాత్రపై ఏసీబీకి కొంత సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు లోకేశ్ సారథ్యంలోనే రూపకల్పన జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతోపాటు ఆర్థిక అంశాలపైనా బలమైన ఆధారాలను సేకరించేందుకు ఏసీబీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వీటి నుంచి తప్పించుకోవడానికే... లోకేశ్ తన డ్రైవర్‌ను అజ్ఞాతంలోకి పంపినట్లు అధికారులు భావిస్తున్నారు. -
ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోమవారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ముందు హాజరయ్యారు. కేసులో బెయిల్ మంజూరు చేస్తూ.. నియోజకవర్గం వదిలి వెళ్లరాదని హైకోర్టు షరతు విధించింది. దీనిని చూపుతూ ఏసీబీ కోర్టు గత విచారణకు రేవంత్ హాజరుకాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి... తదుపరి విచారణకు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రేవంత్ కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే చార్జిషీట్‌ను విచారణకు పంపిన తర్వాతే కోర్టుకు హాజరుకావాలని చెప్పినా.. ఎందుకు వచ్చారంటూ న్యాయమూర్తి వారిని ప్రశ్నించారు. ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరుకాగా.. కోర్టుకు వెళ్లాలని సూచించారని, అందుకే వచ్చామని వారు తెలియజేశారు. వీరి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేశారు. రోజూ ఏసీబీ అధికారుల ఎదుట హాజరై సంతకం చేస్తున్నా... వారు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఉదయసింహ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఓఎంసీ కేసు విచారణ 24కు వాయిదా ఓఎంసీ కేసు విచారణలో భాగంగా గాలి జనార్దనరెడ్డి మినహా ఇతర నిందితులు సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా జనార్దనరెడ్డి హాజరుకాలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించడంతో కోర్టు అనుమతించింది. ఈ కేసులో తమ పేర్లను తొలగించాలని కోరుతూ నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కూడా 24కు వాయిదాపడింది. -
వేం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
* ‘అంతిమ లబ్ధిదారు’ కావడంతో లోతుగా ఆరా * డ్రైవర్, పనిమనిషి, సన్నిహితుల విచారణ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ‘అంతిమ లబ్ధిదారు’ అయిన టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిగా వేం నరేందర్‌రెడ్డే ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారు కావడంతో ఆయనపై ఏసీబీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆధారాల సేకరణలో భాగంగా ఆయన డ్రైవర్ చిన్ని, ఇంట్లో పనిచేసే అర్జున్‌తో పాటు కుటుంబ సన్నిహితుడు వీరభద్రంచను కేసులో సాక్షులుగా పరిగణిస్తూ శుక్రవారం విచారించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 దాకా వారిని ప్రశ్నించింది. ముగ్గురినీ వేర్వేరు గదుల్లో విచారించి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ‘ఓటుకు కోట్లు’ కుట్ర ప్రారంభమైన నాటి నుంచీ వేం కదలికలు, ఆయన్ను కలిసిన వ్యక్తులకు సంబంధించే ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. ఆ రెండు రోజులు ఏం జరిగింది? మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పలువురు ‘ముఖ్య’ నేతలతో వేం సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీకి ప్రాథమిక సమాచారం లభించింది. దీనిపై డ్రైవర్ చిన్నికి కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ప్రధానంగా మే 30, 31 తేదీల్లోవేం ఎక్కడెక్కడ పర్యటించారు, ఎవరెవరితో భేటీ అయ్యారనే అంశాలను ఏసీబీ ఆరా తీసింది. ఇంట్లో జరిగిన విషయాల గురించి పనిమనిషి అర్జున్ను ప్రశ్నించింది. మే 31న స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వడానికి వెళ్లే ముందు రేవంత్, కేసులో మరో నిందితుడు ఉదయసింహ ఇద్దరూ వేంతో సంప్రదింపులు జరిపినట్టు ఏసీబీ వద్ద ఆధారాలున్నాయి. వేం ఇంటికి ఎవరెవరు, ఎప్పుడెప్పుడొచ్చారు, డబ్బులు తీసుకొచ్చారా, దేని గురించి మాట్లాడుకున్నారనే వాటిపై ఆరా తీసినట్లు సమాచారం. నరేందర్ ఇంటికి రేవంత్ ఎన్నిసార్లు, ఎవరెవరితో కలిసి వచ్చారనే దానిపై కూడా అడిగినట్లు తెలిసింది. వీరభద్రానికి వేం ఆర్థికాంశాలతో సంబంధమున్నట్టు ఏసీబీ అనుమానిస్తోంది. ఆ దిశగా ఆయన్ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహలపై వీడియో టేపుల వంటి పక్కా ఆధారాలు ఏసీబీ వద్ద ఉన్నాయి. మిగతా నిందితులకు సంబంధించి ప్రాథమికంగా సాంకేతిక ఆధారాలను సేకరించగలిగారు. మిగతా నిందితులు, అనుమానితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు నేర నిరూపణకు ఏసీబీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వారి పాత్రకు సంబంధించిన సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ సేకరణపై దృష్టి పెట్టింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో సర్కమ్‌స్టాన్షియల్ విట్నెస్లను (నేర సన్నాహాలను గమనించిన, నిందితులు, అనుమానితుల కదలికల్ని చూసిన, వాటి గురించి తెలిసినవారు) ఏసీబీ ముందునుంచీ గుర్తిస్తూ, వారి వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టు నాటికే ఇలాంటి 9 మంది సాక్షులను గుర్తించింది. -
పార్లమెంట్లో కౌంటర్ చేయాలి
‘ఓటుకు కోట్లు’పై ఎంపీలకు బాబు దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారా న్ని లేవనెత్తే అవకాశాలున్నందున దానికి కౌంటర్‌గా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్న విషయాలను ప్రస్తావించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ, బీజేపీ ఎంపీలకు సూచించా రు. నేతల ఫోన్ల ట్యాపింగ్, సెక్షన్ 8 అమలు వంటి విషయాలను ప్రస్తావిస్తూ గొడవ చేయాలని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీలు అందించిన సమాచారం మేరకు... పార్లమెంట్లో మిత్రపక్ష బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విషయాలేవీ లేవనెత్తరాదని సూచించారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన బీజేపీ, టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నడుచుకోవలసిన తీరుపై వివరించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా తాను చేసిన విదేశీ పర్యటనలు, రాష్ట్రాభివృద్ధికి తాను చేస్తున్న కృషిని చంద్రబాబు సుదీర్ఘంగా వివరించారు. ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించి ఏడాది గడిచినా కేంద్రం నుంచి అధికంగా నిధులు, పథకాలు సాధించలేకపోయామని ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత ఉందని చెప్పారు. అయినప్పటికీ కేంద్రంతో సంబంధాలు తెగిపోయేలా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించరాదని చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే పలు అంశాలను అమలు చేస్తామని కేంద్రం ఈ సమావేశాల్లో హామీ ఇస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలతో పాటు ముస్లింల కు అందిస్తున్న తోఫాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా ఉపయోగించుకోవాల్సిందిగా పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.