రేవంత్ బెయిల్ రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ షరతులను రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారని, కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేస్తున్నారని ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి పిటిషన్‌లో కోరారు. రేవంత్‌రెడ్డి మాటల వల్ల కేసులో సాక్ష్యం ఇచ్చేందుకు సాక్షులెవరూ ముందుకొచ్చే అవకాశాలు ఉండవని కోర్టుకు విన్నవించారు. ‘‘ఓటుకు కోట్లు’ కేసులో రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో హైకోర్టు పలు షరతులు విధించింది.
నియోజకవర్గాన్ని దాటవద్దని, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. కానీ బెయిల్‌పై విడుదలైన వెంటనే బహిరంగ ర్యాలీ నిర్వహించిన రేవంత్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తరువాత అనారోగ్య కారణాలను చూపుతూ బెయిల్ షరతుల సడలింపునకు పిటిషన్ దాఖలు చేసి, అనుకూల ఉత్తర్వులు పొందారు. కీలక షరతులను సడలించిన హైకోర్టు, దర్యాప్తులో జోక్యం చేసుకోవడం గానీ, కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం గానీ చేయరాదని రేవంత్‌కు స్పష్టం చేసింది. కానీ ఈ షరతును రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారు.
ఈనెల 9న హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నా మీద కుట్రలు, కుతంత్రాలు చేసి ఆ తరువాత జైలు పంపించారు. దీంతో కొడంగల్ నియోజకవర్గానికి పరిమితమై ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చాను. ఆట మొదలైందని అంటున్నారు మిత్రులు. ఆటకాదు వేట మొదలైంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు తీవ్ర అభ్యంతరకరం.
ఇది కేసు గురించి వ్యాఖ్యలు చేయడమే కాదు. హైకోర్టు విధించిన షరతును ఉల్లంఘించడమే. సాక్ష్యం చెప్పేందుకు సాక్షులు ముందుకు రాకుండా చేసేందుకే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా చేయడం కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవడమే. కాబట్టి రేవంత్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేసి తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి పంపితే తప్ప దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.