అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడలో ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచే.. తుమ్మల పల్లి కళాక్షేత్రానికి భారీగా చేరుకున్న బాధితులు.. అక్కడి నుంచి జింఖానా మైదానం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు అన్ని రాజకీయ పక్షాలు తమ సంఘీభావం ప్రకటించాయి.
ర్యాలీ అనంతరం జింఖానా గ్రౌండ్ లో బహిరంగ సభ జరగనుంది. అగ్రిగోల్డ్ సంస్థల నుంచి డబ్బులు ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ నేతలే బినామీలుగా మారి అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. సీఐడీ విచారణ పేరుతో బాధితులను మభ్యపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. బకాయిలపై బాండ్లను విడుదల చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ అంశంపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
కాగా.. అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ సందర్భంగా విజయవాడలో పోలీసులు భారీఎత్తున బందోబస్తు ఏర్పాటుచేశారు. తుమ్మల పల్లి కళాక్షేత్రం నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకూ భారీగా పోలీసులను మోహరించారు.