‘ఉగ్రవాద’ మంటలు!
హిందూ అతివాద సంస్థలతో ముప్పు అని రాహుల్ చెప్పారన్న బీజేపీ
* ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నమంటూ కాంగ్రెస్ మండిపాటు
న్యూఢిల్లీ: ‘హిందూ ఉగ్రవాదం’ అధికార, విపక్షాల్లో మంటలు రేపుతోంది. దీన్ని సృష్టించింది యూపీఏ ప్రభుత్వమేనంటూ నిన్న మండిపడిన బీజేపీ దీనికి సంబంధించి మరో ఉదంతాన్ని తెరపైకి తెచ్చింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ దీన్ని తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. 2010లో అమెరికా రాయబారితో రాహుల్ గాంధీ చెప్పారంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తను ఉటంకించింది.
‘లష్కరే తోయిబాకు స్థానికులు మద్దతు తెలపడం కంటే కూడా హిందూ అతివాద సంస్థలతోనే పెద్ద ముప్పు అని రాహుల్ చెప్పారు’ అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారమిక్కడ విలేకరులతో అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హిందూ ఉగ్రవాదాన్ని తెరపైకి తెచ్చారన్న కాంగ్రెస్ నేత ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ప్రసాద్ మండిపడ్డారు. ఉగ్రవాదానికి ఎలాంటి మతం, రంగు లేదని, బీజేపీ ఎన్నడు కూడా ‘ముస్లిం ఉగ్రవాదం’ అనే పదాన్ని వాడలేదని, ‘జీహాద్ ఉగ్రవాదం’ అనే పదాన్నే మాట్లాడిందని గుర్తుచేశారు.
కాగా, తాను ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని పార్లమెంటులో మాట్లాడానంటూ రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే తప్పుబట్టారు. ‘నేను హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని పార్లమెంటులో వాడలేదు. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సదస్సులోనే ఈ పదాన్ని ప్రయోగించా. అయితే వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నా’ అని పుణేలో చెప్పారు. మరోపక్క.. పార్లమెంటులో సరైన చర్చలను నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, జవాబుదారీతనాన్ని తప్పించుకునేందుకు యత్నిస్తోందని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.
వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా, వసుంధర రాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్‌లు రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు కట్టుబడిఉన్నామన్నారు. మరోవైపు, పార్లమెంటు సమావేశాల కోసం ఎలాంటి వ్యూహాలను రచించాలన్న అంశంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సోమవారం జరిగే అఖిలపక్ష భేటీకి ముందుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని జరిపేందుకు నిర్ణయించింది. ఈ సమావేశంలో సోనియాగాంధీ పార్టీ పార్టీ ఎంపీలనుద్దేశించి మాట్లాడనున్నారు.