Hindu terrorism
-
శాంతికాముకుల్ని ఉగ్రవాదులంటారా?
వార్ధా/పర్లాకిమిడి: హిందుత్వాన్ని ఉగ్రవాదంతో ముడిపెడుతూ కాంగ్రెస్ శాంతికాముకులైన హిందువులను అవమానిస్తోందని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇంత పాపం చేసిన కాంగ్రెస్‌ను శిక్షించాలని హిందువులంతా నిర్ణయించుకున్నారని వారన్నారు. హిందూ ఉగ్ర వాదం అంటూ కాంగ్రెస్ పార్టీ కోట్ల మంది హిందువులను బాధపెడుతోందని మహారాష్ట్రలోని వార్ధా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో ప్రధాని మోదీ అన్నారు. ‘హిందూ ఉగ్రవాదం అన్న మాట వినగానే మీరెంతో బాధపడలేదూ? వేల ఏళ్ల చరిత్రలో హిందువులు ఉగ్ర వాదానికి పాల్పడ్డ ఘటన ఒక్కటైనా ఉందా..చెప్పండి..అని ప్రశ్నించారు. ఇంత పాపం చేసిన కాంగ్రెస్‌ను మీరు క్షమిస్తారా అని అడిగారు. హిందువులు కళ్లు తెరుచుకున్నారని, ఈ ఎన్నికల్లో తమను ఓడించాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్‌కు అర్థమయిందన్నారు. అందుకే హిందు ఓటర్లు మెజారిటీగా ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయడానికి భయపడి హిందువులు మైనారిటీ ఓటర్లుగా ఉన్న నియోజకవర్గానికి పారిపోతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళలోని వయనాడులో కూడా పోటీచేయడంపై పరోక్షంగా ఈ వ్యాఖ్య చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పైనా ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న సంగతి గుర్తించే ఈయన ఎన్నికల్లో పోటీ చేయట్లేడన్నారు. అమిత్‌షా ఏమన్నారంటే... రాహుల్ బాబా పార్టీ హిందువులపై ఉగ్రవాదులన్న ముద్ర వేసి వారి పరువుతీస్తోందని ఒడిశాలోని పర్లాకిమిడిలో అమిత్‌షా అన్నారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో స్వామి అసీమానంద సహా నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని ఆయన గుర్తు చేశారు. ‘అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో అసలైన దోషులను వదిలిపెట్టేసింది. వీళ్లకి దేశ భద్రత పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు’అని షా అన్నారు. బాలాకోట్‌పై దాడుల గురించి ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వమే అలాంటి చర్య తీసుకోగలదన్నారు. ప్రతిపక్షాలు పాక్ భాష మాట్లాడుతున్నాయని, అది ఉగ్రవాదులకు బలాన్నిస్తుందని ఆరోపించారు. పిట్రోడాను రాహుల్‌గాంధీ గురువుగా షా అభివర్ణించారు. వైఫల్యాల నుంచి మళ్లించడానికే: కాంగ్రెస్ హిందూ ఉగ్ర వాదం అన్న పదాన్ని సృష్టించింది మోదీ మంత్రివర్గ సహచరుడేనని కాంగ్రెస్ మండిపడింది. ఉగ్రవాదానికి మతం, కులం ఏమీ లేవని, దాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఒకసారి తన మంత్రివర్గ సహచరులతో మాట్లాడితే హిందూ ఉగ్రవాదం అన్న పదాన్ని ఎవరు సృషించారో తెలుస్తుందన్నారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రధాని ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. తమ పార్టీకి సంబంధించినంత వరకు ఉగ్ర వాదానికి మతం, కులం లేవన్నారు. -
కాంగ్రెస్‌పై నెపం.. ఒవైసీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : మోదీ ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఆగ్రహం వెలిబుచ్చారు. హిందూ ఉగ్రవాదం గత ప్రభుత్వాల నిర్వాకమేనని కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒవైసీ స్పందించారు. బుధవారం ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మక్కా మసీదు పేలుడు తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఓ కేసులో బాధితుల తరపు కాకుండా.. నిందితుల వైపు ప్రభుత్వం నిలవటం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం కాబోలు. హిందూ ఉగ్రవాదం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పుట్టిందని బీజేపీ చెబుతోంది. తప్పు మరొకరి మీదకు నెట్టేసి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. అలాంటప్పుడు అజ్వీర్ దర్గా పేలుడు కేసులో దేవేంద్ర గుప్తా.. భావేశ్ పటేల్‌లు దోషులుగా నిర్ధారణ అయిన విషయాన్ని బీజేపీ మరిచిపోయిందేమో’ అంటూ ఒవైసీ పేర్కొన్నారు. ఇక కోర్టు తీర్పుపై మరోసారి స్పందించిన ఆయన.. ఇది పూర్తిగా ఎన్ఐఏ వైఫల్యమని వెల్లడించారు. ‘ ఈ విషయంలో కేంద్రాన్ని నేను హెచ్చరిస్తోంది ఒక్కటే.. నిందితులంతా ఇప్పుడు స్వేచ్ఛగా విహరిస్తూ.. దేశాన్ని ఓ స్మశానంలా మార్చే ప్రమాదం ఉంది’ అని ఒవైసీ పేర్కొన్నారు. తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు బాధిత కుటుంబాలు సుముఖంగా ఉంటే న్యాయ సాయం అందించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. -
హిందూ ఉగ్రవాద వ్యాసం.. కమల్‌కు షాక్
సాక్షి, చెన్నై : సీనియర్ నటుడు కమల్ హాసన్ ‘హిందూ ఉగ్రవాద’ కామెంట్లపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్ ను గురువారం విచారణకు స్వీకరించిన హైకోర్టు... తక్షణమే ఆయన పేరును పొందుపరుస్తూ ఎఫ్ఐఆర్ను రూపొందించి అందజేయాలని తమిళనాడు పోలీసులను కోర్టు ఆదేశించింది. కమల్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని మొత్తం ఉగ్రవాదులుగా అభివర్ణించేలా ఉందంటూ అడ్వొకేట్ క్లర్క్ జీ దేవరాజన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మతపరమైన వ్యాఖ్యలు చేసి తమిళ జాతిని విడగొట్టేందుకు కుట్రపన్నారంటూ పిటిషనర్ అందులో పేర్కొన్నారు. అదే సమయంలో కమల్ రాసిన వ్యాసాన్ని ప్రచురించిన మ్యాగ్జైన్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని దేవరాజన్ కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తక్షణమే ఆయపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశిస్తూ ఆదేశాల కాపీని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అందజేసి కేసు వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా, ఆనంద వికటన్ మ్యాగ్జైన్ కోసం రాసిన ప్రత్యేక వ్యాసంలో హిందు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో తమిళనాడు సహా దేశంలోని ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయని ఉళగనాయగన్ మండిపడిన విషయం తెలిసిందే. అయితే తిరిగి నవంబర్ 7న తన పుట్టినరోజు సందర్భంగా యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ తాను హిందువుల మనోభావాలను దెబ్బతీసే పని ఏనాడూ చెయ్యబోనని.. ఆ వ్యాఖ్యల ఆంతర్యం తప్పుగా అర్థం చేసుకున్నారని నష్టనివారణ చర్యలకు దిగారు. (ఇది కూడా చదవండి... నేనూ హిందూ కుటుంబంలోనే పుట్టా! ) వైరల్ వీడియో... కమల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పలు హిందూ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాంప్రదాయ వేషధారణలో ఓ చిన్నారి కత్తితో కసి తీరా కమల్ ఫోటోను పొడవటం.. పక్కనే ఉన్న మరో చిన్నారి అతని ప్రోత్సహించటం అందులో చూడొచ్చు. இந்து தீவிரவாதம் குழந்தைகள் கையில் கத்தியை திணிக்கிறது. மனம் பதறுகிறது. 😔 @ikamalhaasan நீங்கள் சொன்னதை சரியென்று நிறுவுகின்றனர். pic.twitter.com/ihSESJEXQI — இசை (@isai_) November 13, 2017 -
కమల్‌పై రాజ్‌నాథ్ ఫైర్
-
కమల్‌పై రాజ్‌నాథ్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : నటుడు కమల్ హాసన్ హిందూ ఉగ్రవాదం కామెంట్లపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన రాజ్‌నాథ్.. కమల్ కేవలం ఓట్ల కోసమే అలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పారు. ‘‘హిందువుల్లో హింసా ప్రవృత్తి పెరిగిపోతుందన్న కమల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఉగ్ర వాదం ఏ రూపంలో ఉన్న మా ప్రభుత్వం అణచివేస్తుంది అని రాజ్ నాథ్ చెప్పారు. రాజకీయ మనుగడ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు’’ అని కమల్‌కు ఆయన సూచించారు. కాగా, పద్మావతి చిత్ర వివాదంపై కూడా ఆయన స్పందించారు. చరిత్రను వక్రీకరించారనే వాదన తెరపైకి వచ్చినప్పుడు నిలిపివేయాలన్న డిమాండ్లు తలెత్తటం సహాజమని.. అవి అబద్ధమని నిరూపించుకోవాల్సిన బాధ్యత చిత్ర నిర్మాతలపై ఉంటుందని ఆయన అన్నారు. కాగా, హిందూ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఒక్క కేరళ ప్రభుత్వం తప్ప మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఘోరంగా విఫలమయ్యాయని కమల్ విరుచుపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీని, దాని అనుబంధ విభాగాలను లక్ష్యంగా చేసుకుని ఆనంద్ వికటన్ సంచికలో ఆయన వ్యాసం రాశారు. -
ఆయన మానసిక పరిస్థితి బాలేదు? ఆస్పత్రిలో చేర్పించాలి!
దేశంలో ’హిందూ ఉగ్రవాదం’ ఉందంటూ సంచలన వ్యాసం రాసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్‌పై బీజేపీ విరుచుకుపడింది. కమల్ మానసిక పరిస్థితి బాలేదని, అందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. హిందూ ఉగ్రవాదం అంటూ పేర్కొన్న కమల్ కమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ’కమల్ మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయనను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి. రాజకీయాలు ఇంతగా దిగజారడం మంచిది కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన ప్రకటనలు చేస్తున్నారు’ అని బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ విమర్శించారు. తాజా వివాదం నేపథ్యంలో కమల్‌పై పరువునష్టం దావా వేసే అవకాశాన్ని తమిళనాడు బీజేపీ పరిశీలిస్తున్నదని ఆయన చెప్పారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ కమల్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవటంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. పాలిత రాష్ట్రాలైన యూపీ, గుజరాత్, రాజస్థాన్‌లలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆనంద వికటన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం ఇప్పుడు దుమారం రేపుతోంది. ‘గతంలో హిందూ సంఘాలు హింసకు పాల్పడేవి కావు. కేవలం మాటలతోనే ప్రత్యర్థులపై విరుచుకుపడేవి. కానీ, పరిస్థితులు ఇప్పుడు దారుణంగా మారాయి. భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరుకున్నారు. వారిని వెనకాల నుంచి కొందరు ప్రోత్సహిస్తున్నారు. అసలు హిందూ టెర్రరిజం లేదన్న కొందరి వాదన నిజం కాదు. అది ఉంది. ఇప్పుడు తారా స్థాయికి చేరింది ’’ అని కమల్ తన వ్యాసంలో పేర్కొన్నారు. -
హిందూ ఉగ్రవాదం.. కమల్ సంచలన వ్యాసం
సాక్షి, చెన్నై : ఉలగనాయకన్(లోకనాయకుడు) కమల్‌హాసన్ మరోసారి తన మాటలతో రాజకీయ దుమారం రేపారు. పరోక్షంగా బీజేపీ, అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న ఆయన.. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ సంచలన ప్రకటన చేశారు. హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవటంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. పాలిత రాష్ట్రాలైన యూపీ, గుజరాత్, రాజస్థాన్‌లలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆనంద వికటన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయనెమన్నారంటే‘‘గతంలో హిందూ సంఘాలు హింసకు పాల్పడేవి కావు. కేవలం మాటలతోనే ప్రత్యర్థులపై విరుచుకుపడేవి. కానీ, పరిస్థితులు ఇప్పుడు దారుణంగా మారాయి. భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరుకున్నారు. వారిని వెనకాల నుంచి కొందరు ప్రోత్సహిస్తున్నారు. అసలు హిందూ టెర్రరిజం లేదన్న కొందరి వాదన నిజం కాదు. అది ఉంది. ఇప్పుడు తారా స్థాయికి చేరింది ’’ అంటూ కమల్ వ్యాఖ్యానించారు. అయితే హిందూ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేళ ప్రభుత్వం విజయవంతం అయ్యిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కమల్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో మెర్సల్ వివాదాస్పద డైలాగుల అంశం గురించి కూడా ప్రస్తావించారు. కొత్త పార్టీ ఆలోచనలో ఉన్న కమల్ మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తనది కాషాయం రంగు కాదని కేరళ సీఎంను కలిసిన సమయంలో ఆయన వ్యాఖ్యలు చేయటం కూడా చూశాం. మరోపక్క ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సన్నిహితంగా మెదులుతున్నారు కూడా. కమల్ స్వార్థపరుడు... ఢిల్లీ : స్వలాభం కోసమే కమల్ రాజకీయ ఎత్తుగడ వేస్తున్నాడని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కమల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కమల్ ఓ అవినీతి పరుడని.. బీజేపీ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కుట్రలకు తెరలేపుతున్నాడని స్వామి విమర్శించారు. -
ముస్లింలే టెర్రరిస్టులు.. హిందూ ఉగ్రవాదం మిథ్య
- హరియాణ మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు ఛండీగఢ్: ఉగ్రవాదం నేపథ్యంలో మతాలను వర్గీకరిస్తూ బీజేపీకి చెందిన హరియాణ మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన ఉగ్రదాడుల్లో దోషులంతా ముస్లింలేనని, హిందూ అనేవాడు ఉగ్రవాది కాబోడని వ్యాఖ్యానించారు. బుధవారం ఛండీగఢ్‌లో ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. హిందూ ఉగ్రవాదం అనేది ఓ మిథ్య అన్నారు. ‘ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ వైఖరి. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసమే వాళ్లు(కాంగ్రెస్) హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని సృష్టించారు. నిజానికి ఏ హిందువు ఉగ్రవాది కాడు.. కాబోడు. భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు జరిగిన దాడుల్లో దోషులు, నిందితులు అందరూ ముస్లింలేకదా?’ అని అనిల్ విజ్ అన్నారు. ఇండియాపై దాడులు చేసిన ఎంతోమంది టెర్రరిస్టులను కాంగ్రెస్ హయాంలో విడిచిపెట్టారని, ఇప్పుడు వాళ్లంతా సమన్లను సైతం లెక్కచేయకుండా పాకిస్థాన్‌లో ఎంజాయ్ చేస్తున్నారని అనిల్ విజ్ మండిపడ్డారు. హిందూ ఉగ్రవాదంటూ ఉండిఉంటే దేశం ఏనాడో నాశనమై ఉండేదని విజ్ అభిప్రాయపడ్డారు. -
‘ఉగ్రవాద’ మంటలు!
హిందూ అతివాద సంస్థలతో ముప్పు అని రాహుల్ చెప్పారన్న బీజేపీ * ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నమంటూ కాంగ్రెస్ మండిపాటు న్యూఢిల్లీ: ‘హిందూ ఉగ్రవాదం’ అధికార, విపక్షాల్లో మంటలు రేపుతోంది. దీన్ని సృష్టించింది యూపీఏ ప్రభుత్వమేనంటూ నిన్న మండిపడిన బీజేపీ దీనికి సంబంధించి మరో ఉదంతాన్ని తెరపైకి తెచ్చింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ దీన్ని తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. 2010లో అమెరికా రాయబారితో రాహుల్ గాంధీ చెప్పారంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తను ఉటంకించింది. ‘లష్కరే తోయిబాకు స్థానికులు మద్దతు తెలపడం కంటే కూడా హిందూ అతివాద సంస్థలతోనే పెద్ద ముప్పు అని రాహుల్ చెప్పారు’ అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారమిక్కడ విలేకరులతో అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హిందూ ఉగ్రవాదాన్ని తెరపైకి తెచ్చారన్న కాంగ్రెస్ నేత ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ప్రసాద్ మండిపడ్డారు. ఉగ్రవాదానికి ఎలాంటి మతం, రంగు లేదని, బీజేపీ ఎన్నడు కూడా ‘ముస్లిం ఉగ్రవాదం’ అనే పదాన్ని వాడలేదని, ‘జీహాద్ ఉగ్రవాదం’ అనే పదాన్నే మాట్లాడిందని గుర్తుచేశారు. కాగా, తాను ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని పార్లమెంటులో మాట్లాడానంటూ రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే తప్పుబట్టారు. ‘నేను హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని పార్లమెంటులో వాడలేదు. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సదస్సులోనే ఈ పదాన్ని ప్రయోగించా. అయితే వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నా’ అని పుణేలో చెప్పారు. మరోపక్క.. పార్లమెంటులో సరైన చర్చలను నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, జవాబుదారీతనాన్ని తప్పించుకునేందుకు యత్నిస్తోందని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా, వసుంధర రాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్లు రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు కట్టుబడిఉన్నామన్నారు. మరోవైపు, పార్లమెంటు సమావేశాల కోసం ఎలాంటి వ్యూహాలను రచించాలన్న అంశంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సోమవారం జరిగే అఖిలపక్ష భేటీకి ముందుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని జరిపేందుకు నిర్ణయించింది. ఈ సమావేశంలో సోనియాగాంధీ పార్టీ పార్టీ ఎంపీలనుద్దేశించి మాట్లాడనున్నారు.