వార్ధాలో జరిగిన సభలో ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న ఫడ్నవిస్, తదితరులు
వార్ధా/పర్లాకిమిడి: హిందుత్వాన్ని ఉగ్రవాదంతో ముడిపెడుతూ కాంగ్రెస్ శాంతికాముకులైన హిందువులను అవమానిస్తోందని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇంత పాపం చేసిన కాంగ్రెస్‌ను శిక్షించాలని హిందువులంతా నిర్ణయించుకున్నారని వారన్నారు. హిందూ ఉగ్ర వాదం అంటూ కాంగ్రెస్ పార్టీ కోట్ల మంది హిందువులను బాధపెడుతోందని మహారాష్ట్రలోని వార్ధా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో ప్రధాని మోదీ అన్నారు. ‘హిందూ ఉగ్రవాదం అన్న మాట వినగానే మీరెంతో బాధపడలేదూ? వేల ఏళ్ల చరిత్రలో హిందువులు ఉగ్ర వాదానికి పాల్పడ్డ ఘటన ఒక్కటైనా ఉందా..చెప్పండి..అని ప్రశ్నించారు.
ఇంత పాపం చేసిన కాంగ్రెస్‌ను మీరు క్షమిస్తారా అని అడిగారు. హిందువులు కళ్లు తెరుచుకున్నారని, ఈ ఎన్నికల్లో తమను ఓడించాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్‌కు అర్థమయిందన్నారు. అందుకే హిందు ఓటర్లు మెజారిటీగా ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయడానికి భయపడి హిందువులు మైనారిటీ ఓటర్లుగా ఉన్న నియోజకవర్గానికి పారిపోతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళలోని వయనాడులో కూడా పోటీచేయడంపై పరోక్షంగా ఈ వ్యాఖ్య చేశారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌పైనా ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న సంగతి గుర్తించే ఈయన ఎన్నికల్లో పోటీ చేయట్లేడన్నారు.
అమిత్‌షా ఏమన్నారంటే...
రాహుల్ బాబా పార్టీ హిందువులపై ఉగ్రవాదులన్న ముద్ర వేసి వారి పరువుతీస్తోందని ఒడిశాలోని పర్లాకిమిడిలో అమిత్‌షా అన్నారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో స్వామి అసీమానంద సహా నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని ఆయన గుర్తు చేశారు. ‘అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో అసలైన దోషులను వదిలిపెట్టేసింది. వీళ్లకి దేశ భద్రత పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు’అని షా అన్నారు. బాలాకోట్‌పై దాడుల గురించి ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వమే అలాంటి చర్య తీసుకోగలదన్నారు. ప్రతిపక్షాలు పాక్ భాష మాట్లాడుతున్నాయని, అది ఉగ్రవాదులకు బలాన్నిస్తుందని ఆరోపించారు. పిట్రోడాను రాహుల్‌గాంధీ గురువుగా షా అభివర్ణించారు.
వైఫల్యాల నుంచి మళ్లించడానికే: కాంగ్రెస్
హిందూ ఉగ్ర వాదం అన్న పదాన్ని సృష్టించింది మోదీ మంత్రివర్గ సహచరుడేనని కాంగ్రెస్ మండిపడింది. ఉగ్రవాదానికి మతం, కులం ఏమీ లేవని, దాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఒకసారి తన మంత్రివర్గ సహచరులతో మాట్లాడితే హిందూ ఉగ్రవాదం అన్న పదాన్ని ఎవరు సృషించారో తెలుస్తుందన్నారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రధాని ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. తమ పార్టీకి సంబంధించినంత వరకు ఉగ్ర వాదానికి మతం, కులం లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment