
సాక్షి, చెన్నై : ఉలగనాయకన్(లోకనాయకుడు) కమల్‌హాసన్ మరోసారి తన మాటలతో రాజకీయ దుమారం రేపారు. పరోక్షంగా బీజేపీ, అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న ఆయన.. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ సంచలన ప్రకటన చేశారు.
హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవటంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. పాలిత రాష్ట్రాలైన యూపీ, గుజరాత్, రాజస్థాన్‌లలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆనంద వికటన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయనెమన్నారంటే‘‘గతంలో హిందూ సంఘాలు హింసకు పాల్పడేవి కావు. కేవలం మాటలతోనే ప్రత్యర్థులపై విరుచుకుపడేవి. కానీ, పరిస్థితులు ఇప్పుడు దారుణంగా మారాయి. భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరుకున్నారు. వారిని వెనకాల నుంచి కొందరు ప్రోత్సహిస్తున్నారు. అసలు హిందూ టెర్రరిజం లేదన్న కొందరి వాదన నిజం కాదు. అది ఉంది. ఇప్పుడు తారా స్థాయికి చేరింది ’’ అంటూ కమల్ వ్యాఖ్యానించారు.
అయితే హిందూ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేళ ప్రభుత్వం విజయవంతం అయ్యిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కమల్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో మెర్సల్ వివాదాస్పద డైలాగుల అంశం గురించి కూడా ప్రస్తావించారు. కొత్త పార్టీ ఆలోచనలో ఉన్న కమల్ మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తనది కాషాయం రంగు కాదని కేరళ సీఎంను కలిసిన సమయంలో ఆయన వ్యాఖ్యలు చేయటం కూడా చూశాం. మరోపక్క ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సన్నిహితంగా మెదులుతున్నారు కూడా.
కమల్ స్వార్థపరుడు...
ఢిల్లీ : స్వలాభం కోసమే కమల్ రాజకీయ ఎత్తుగడ వేస్తున్నాడని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కమల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కమల్ ఓ అవినీతి పరుడని.. బీజేపీ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కుట్రలకు తెరలేపుతున్నాడని స్వామి విమర్శించారు.