సాక్షి, శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబాపై బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైన్యం పై కేసు నమోదు చేయటం ఏంటని? ఆయన కశ్మీర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘సైన్యంపైనే కేసా? ఆమె తీసుకున్న నిర్ణయం అర్థం పర్థం లేనిది. ఈ అంశంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి. తక్షణమే కేసు వెనక్కి తీసుకోకపోతే.. విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చెయ్యండి’’ అని సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించారు. కాగా, ఈ వివాదం ఇప్పుడు పీడీపీ-బీజేపీ మిత్రపక్షం మధ్య చిన్నగా చిచ్చును రాజేస్తోంది.
మెహబూబా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధం కావటం కలకలం రేపింది. అయితే అధిష్ఠానం సూచనలతో వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం.
అసలేం జరిగింది...
దక్షిణ కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని గోవాంపురా ప్రాంతంలో శనివారం సైనిక వాహన శ్రేణిపై దాదాపు 250 మందికి పైగా నిరసనకారులు రాళ్లు రువ్వారు. అంతేకాదు ఒక అధికారి నుంచి ఆయుధాన్ని లాక్కునేందుకు ప్రయత్నించడంతో వారిపై సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో లోయలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జవాన్ల కాల్పుల్లో పౌరుల మృతికి నిరసనగా వేర్పాటువాదులు ఒక్క రోజు బంద్‌కు పిలుపునిచ్చారు.
ఘటనపై పూర్తి నివేదిక సమర్పించమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు కాల్పుల జరిపిన సైన్యంపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదుచేశారు. గర్వాల్ 10 బెటాలియన్‌పై హత్య, హత్యాయత్నం కేసును నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment