ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాన్ని మొత్తం రాష్ట్రానికి అంటగట్టనక్కరలేదు. కానీ ప్రస్తుత పాలకపక్షం మీద ప్రజలలో అసంతృప్తి ఉన్నదన్న వాస్తవం ఆ ఫలితంతో వెల్లడైంది. అదే సమయంలో ఈ ఎన్నికలలో డీఎంకే ఘోర పరాజయం కూడా మరొక వాస్తవాన్ని తెలియచేస్తున్నది. డీఎంకే పార్టీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తమిళ ప్రజలు భావించడం లేదు. దినకరన్ ఈ ఎన్నికలలో విజయం సాధించారంటే అర్థం, ఈ రాజకీయ శూన్యంలో అంతగా ప్రాముఖ్యం లేని వారు సైతం తమకు ఉన్న అవకాశాలను వెతుక్కోగలరు.
ఈ సంవత్సరం నిష్క్రమిస్తున్న వేళ రెండు దశాబ్దాల నుంచి తమిళనాడును అలజడికి గురిచేస్తున్న ఒక ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించబోతోంది. తాను రాజకీయాలలోకి ప్రవేశించ దలిస్తే ఆ సంగతిని ఈ నెల 31న ప్రకటిస్తానని మొత్తానికి తలైవా రజనీకాంత్ ప్రకటించారు. జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా మెరీనా బీచ్ ఆందోళన, శశికళ కారాగారానికి తరలడం, ఒ. పన్నీర్‌సెల్వం ప్రజాస్వామిక తిరుగుబాటు, తాను సైతం రాజకీయాలలోకి వస్తున్నట్టు మరో తమిళ సినీ నటుడు కమల్ హాసన్ ప్రకటించడం కూడా 2017లో జరిగిన పరిణామాలే. రజనీకాంత్ ఇచ్చిన ప్రకటన ఈ ఏటి ఘటనలకు పరాకాష్ట. సినీ పరిభాషలో చెప్పాలంటే బ్లాక్‌బస్టరన్నమాట. అయితే రజనీ ప్రకటన ఆరోగ్యం గురించి చేసే చట్టబద్ధమైన హెచ్చరిక పద్ధతిలోనే వెలువడింది. ‘నేను రాజకీయాలలోకి వస్తున్నట్టు చెప్పడం లేదు. దీని గురించి నా నిర్ణయం ఏమిటో 31న ప్రకటిస్తానని మాత్రమే నేను చెప్పాను’ అని వివరణ ఇచ్చారు.
బస్సు కండక్టర్ స్థాయి నుంచి సినీ నటుడి స్థాయికి ఎదిగిన రజనీ కనుక రాజకీయాలలోకి రావాలని నిర్ణయిస్తే, ఈ ఏడాదే ఇలాంటి నిర్ణయం తీసుకున్న పెద్ద తారలలో ఆయన రెండోవారు అవుతారు. రజనీ ఆప్తమిత్రుడు కమల్ హాసన్ కొన్ని మాసాల క్రితమే తాను రాజకీయ నేతగా మారుతున్నట్టు, వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు. కమల్ హాసన్ తన రాజకీయ అరంగేట్రం గురించి కొంత హడావుడితోనే ప్రకటించారు. ఆ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటివారిని కలుసుకోవడం, ఇంకా పలు చానళ్లలో అనేక ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా తన రాజకీయ ప్రవేశం గురించి కొద్దిపాటి సంచలనం రేపారు. కానీ పూర్తి చేయవలసి ఉన్న రెండు సినిమాల కోసం కమల్ దాదాపు రెండు మాసాల నుంచి ఎవరికీ కనిపించడం లేదు. విశ్వరూపం–2 నిర్మాణం కోసం ఆయన అమెరికాలో ఉన్నారు. అదలా ఉంచితే, నటులు ఇలా ప్రజాజీవి తంలో రాజకీయాలని కాల్‌షీట్ల మాదిరిగా చూస్తేనే తమిళనాడు ప్రజలకు సుఖంగా ఉంటుందన్న సంగతి నిజమో కాదో తేలవలసి ఉంది.
నటులు ఇంకానా...!
అసలు తమిళనాడు రాజకీయాలలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి నటులకు ఇప్పుడు ప్రవేశించే అవకాశం ఉందా? అయితే తమిళనాడు ఓటర్లు రాజ కీయ నాయకులుగా సినీ నటులనే ఆదరిస్తూ ఉంటారన్న ఒక వాస్తవం. తమిళ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎం.జి. రామచంద్రన్, కరుణానిధి, జయలలిత కోలీవుడ్ నేపథ్యం కలిగినవారే. వీరు మంచి ముఖ్యమంత్రులుగానే కాకుండా, మంచి రాజకీయవేత్తలుగా కూడా రాణించారు. కానీ 21వ శతాబ్దం తమిళనాడుకూ, ఆ ముగ్గురు రాజకీయ రంగం మీద ప్రత్యక్షమైన కాలానికీ ఎంతో తేడా ఉంది. సోషల్ మీడియా ప్రభావం చాలా తీక్షణంగా ఉన్న ప్రస్తుత తరుణంలో తారలు ఏం చేస్తున్నారో నిరంతర నిఘా ఉంటున్నది. తెర మీద అద్భుతాలు సృష్టించిన రీతిలో నిజ జీవితంలో వ్యవహరించడం ఇకపై సాధ్యం కాదు. పైగా ప్రస్తుత తమిళ రాజకీయాల దీనస్థితి వేరు.
కొత్త ముఖాలను తిరస్కరించడానికి వారు ఏమాత్రం సంకోచించరు. తమిళనాడు రాజకీయ చిత్రం ఎలా ఉందో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితమే చెబుతోంది. ఎన్నికల కమిషన్‌తో పోరాడి రెండాకుల ఎన్నికల గుర్తును తన సొంతం చేసుకోవడంలో అక్కడ అధికారంలో ఉన్న అన్నా డీఎంకే పెద్ద విజయం సాధించింది. కానీ ఆర్కేనగర్ ఉప ఎన్నికలో మాత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నది. విపక్ష డీఎంకే పరిస్థితి మరీ దారుణం. అన్నా డీఎంకే వ్యతిరేక ఓట్లన్నీ తమ అభ్యర్థికే జమ అయిపోతాయని ఆ పార్టీ ఆశపడింది. కానీ ఘోరంగా వారి అభ్యర్థి ధరావతు కోల్పోయారు. ఇంకా చెప్పాలంటే డీఎంకే అభ్యర్థి ఓటమి విషాదాల్లో కెల్లా విషాదం. ఎందుకంటే, ఆ పార్టీకి కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకేలు మద్దతు ఇచ్చాయి. అయినా ధరావతు కూడా దక్కలేదు. ఇక బీజేపీ కనీసంగా కూడా తన ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీకి నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
ఆర్కే నగర్ ఫలితంతో పెద్ద మలుపు
ఆర్కేనగర్ నియోజక వర్గం నుంచి దినకరన్ విజయం సాధించి ఉండవచ్చు. కానీ ఆయన అవినీతి మార్గాలలోనే విజయం సాధించారనే నిందకు గురయ్యారు. ఆయన విజయం అంటే శశికళ, మన్నార్‌గుడి కుటుంబం పరోక్షంగా పదవిలోకి వచ్చి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలగొడుతుందని చాలామంది విచారిస్తున్నారు. ఇదంతా ఏం చెబుతుందంటే, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఉంది. అలా అని ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాన్ని మొత్తం రాష్ట్రానికి అంటగట్టనక్కరలేదు. కానీ ప్రస్తుత పాలకపక్షం మీద ప్రజలలో అసంతృప్తి ఉన్నదన్న వాస్తవం మాత్రం ఆ ఫలితంతో వెల్లడైంది. అదే సమయంలో ఈ ఎన్నికలలో డీఎంకే ఘోర పరాజయం కూడా మరొక వాస్తవాన్ని తెలియచేస్తున్నది. డీఎంకే పార్టీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తమిళ ప్రజలు భావిం చడం లేదు. దినకరన్ ఈ ఎన్నికలలో విజయం సాధించారంటే అర్థం, ప్రస్తుత రాజకీయ శూన్యంలో రాజకీయాలలో అంతగా ప్రాముఖ్యం లేని వారు సైతం తమకు ఉన్న అవకాశాలను వెతుక్కోగలరు. ఇలాంటి వాతావరణంలో కమల్ çహాసన్ తాను రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించారు.
రజనీ ప్రవేశించే అవకాశం ఉంది. రజనీకాంత్ గతంలో ఇచ్చిన ప్రకటనలకీ, తాజాగా ఇచ్చిన ప్రకటనకీ మధ్య వ్యత్యాసాన్ని గమనించాలి. అప్పుడు ఆయన రాజకీయాల గురించి చాలా విస్తృతంగానే మాట్లాడారు. ఇప్పుడు అలా కాదు. ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు. తాను రాజకీయాలలో ప్రవేశిస్తే ఆ సంగతి ఈనెల 31న ప్రకటిస్తాను అని ఆయన విస్పష్టంగానే వెల్లడించారు. రజనీ స్థాపించబోయే పార్టీ గురించిన విధివిధానాలు సిద్ధమవుతున్నాయనీ, అయితే పార్టీ ప్రారంభం ఎప్పుడనే విషయంలో తమ నాయకుడే అంతిమంగా నిర్ణయం ప్రకటిస్తారనీ రజనీ శిబిరానికి చెందిన వారు గత కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నారు. రజనీతో సన్నిహితంగా ఉన్నవారు ఆయన పార్టీ స్థాపనకు అనుమతిస్తారనే గట్టిగా చెప్పినా, ఇప్పుడు మాత్రం అంత ఉత్సాహంగా ఆ మాట చెప్పడం లేదు. ఇదంతా చూస్తుంటే సూపర్‌స్టార్ వ్యవహారం రెండడుగులు ముందుకీ, ఒక అడుగు వెనక్కీ అన్న చందంగా కనిపిస్తుంది.
రాజకీయ రంగంలో తనకంటూ ఓ పాత్ర ఉంటుందని రజనీకాంత్ కనుక ప్రకటిస్తే, తమిళనాడులో అది కమల్ వర్సెస్ రజనీ పోరాటంగా రూపుదాలుస్తుంది. మీడియా వరకు ఇలాంటి సన్నివేశం చాలా ఆకర్షణీయంగానే ఉంటుంది. సమస్యలు, సిద్ధాంతాల కన్నా, వ్యక్తుల మధ్య పోరాటంగా అది తయారవుతుంది. కాబట్టి చాలామంది ఇలాంటి ఆలోచనను కోరుకోవడం లేదు. కానీ కొద్దిరోజుల క్రితం రజనీతో ఫొటోలు దిగిన ఆయన అభిమానుల వాదన వేరుగా ఉంది. బాక్సాఫీసు దగ్గర ఆ ఇద్దరు తారలకు చిరకాలంగా అలాంటి స్పర్థే ఉన్నదనీ, కానీ ఏనాడూ అది ఘర్షణ స్థాయికి పోలేదనీ వారు చెబుతున్నారు. బయట వినిపించే మాట మరోరకంగా ఉంది. అది – ఆ ఇద్దరు రాజకీయాలలో కలసి నడవాలి. అది సాధ్యం కాని పక్షంలో, ఒకరు వైదొలగి రెండో వారికి మార్గం సుగమం చేయాలి. ఇవేమీ వీలుపడకపోతే జరిగేది, పట్టణ ప్రాంత మేధావి వర్గంతోనే ఎక్కువ మమేకమయ్యే కమల్ కంటే, రజనీయే ముందంజ వేసే అవకాశం ఉంటుంది.
ఇంతవరకు కమల్ హాసన్ అటు వామపక్షాల వైపు, ఇటు వామపక్షేతర పార్టీల వైపు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు. లెఫ్ట్ నాయకులతో కనిపిస్తూనే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కూడా కనిపిస్తున్నారు. హిందూ అతివాదం, రాజకీయ అవినీతి, పర్యావరణం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వంటి అంశాల గురించి కమల్ మాట్లాడారు. అలాగే ఆయన అన్నా డీఎంకే నాయకులతో తరచూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. కాబట్టి ఆయన అటు అన్నా డీఎంకేతో గానీ, ఇటు బీజేపీతో గానీ చెలిమిని నెరపరని తెలుస్తున్నది. పైగా ఆయన నాస్తికుడు. ఇది కూడా ఆ రెండు పార్టీలకూ, కమల్‌కూ మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. రజనీకాంత్ ఇందుకు పూర్తి విరుద్ధమైన వ్యక్తి. ఆయన ఆధ్యాత్మిక చింతనాపరుడు. ఆయన అభిప్రాయాలు బీజేపీకే సన్నిహితంగా కనిపిస్తాయి.
బీజేపీ ఆశ నెరవేరుతుందా?
బీజేపీ కూడా గత కొంతకాలంగా రజనీకాంత్‌ను నాయకుడిగా అవతరింపచేయడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే కూడా. ఇందులో బీజేపీకి కూడా ప్రయోజనాలు ఉన్నాయి. 2019 సాధారణ ఎన్నికలలో హరి యాణా, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో తగ్గే లోక్‌సభ స్థానాలను భర్తీ చేసుకునే క్రమంలో తమిళనాడులోకి ప్రవేశించాలని బీజేపీ ఆశ. 2014లో ఆ రాష్ట్రాలలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. పన్నీర్‌సెల్వంను కాకుండా ఎడప్పుడి పళనిస్వామి మద్దతు ఇవ్వడం వంటి తమిళనాడు ప్రయోగం నేపథ్యంలోనే కాకుండా, ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాలను చూశాక ఇప్పుడు బీజేపీకి మిగిలిన ఏకైక ఆశ రజనీకాంత్ మాత్రమే. ఆ పార్టీ ఆశ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం బీజేపీకి అక్కడ ఎలాంటి పట్టు లేదు. పైగా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తెర వెనుక నుంచి నడిపిస్తున్నదని పట్టణ ప్రాంత మేధావులలో ఒక అభిప్రాయాన్ని కూడా సృష్టించింది. గ్రామీణ ప్రాంతాలలో అయితే, కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయించేందుకు కర్ణాటక మీద ఒత్తిడి తేవడంలో రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ విఫలమైం దన్న ఆగ్రహం కూడా ఉంది. కర్ణాటకలో బీజేపీకి బలం ఉంది.
ప్రస్తుత వాతావరణాన్ని బట్టి రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించి, బీజేపీతో కొంత మేర అవగాహనకు వస్తారని అనిపిస్తుంది. రజనీ, మోదీ ద్వయం తమిళనాడు పట్టణ ప్రాంత ప్రజల మీద తమ ప్రభావం చూపగలరనీ, బీజేపీ వల్ల అన్నా డీఎంకేలోని ఒక వర్గం చివరి క్షణంలో అయినా రజనీ వెంట వెళతారనీ కమలం పార్టీ జాతీయ నాయకత్వం అభిప్రాయం. అయితే అది ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. అయితే ఇద్దరు నటులలో ఎవరు విజయం సాధించినా, వారి సమక్షంలో రాష్ట్రంలో అవినీతి తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు. తమిళనాడు ఎన్నికలలో పెరిగిపోయిన ఓట్ల కొనుగోలు సంస్కృతితో ప్రజలు ఎంత తీవ్రంగా కలత చెందుతున్నారో ఇలాంటి భావన వెల్లడిస్తోంది. నిజానికి జయలలిత మరణంతోనే తమిళ రాజకీయాలు దిశా దశ లేకుండా పోయాయి. 2018లో కూడా అలాగే ఉంటుంది.
టీఎస్ సుధీర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment