నేడు కాలేజీల్లో విద్యార్థుల జాయినింగ్ రిపోర్ట్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కన్వీనర్‌కోటాలోని మిగులు సీట్ల లెక్కలు తేల్చేందుకు అధికారులు నడుంబిగించారు. మూడో విడత కౌన్సెలింగ్ నేపథ్యంలో మిగులు సీట్లు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ ఈ కౌన్సెలింగ్‌లో చేర్చే చర్యలు చేపట్టారు. ‘ఎంసెట్‌లో మిగులు సీట్ల మిస్టరీ’ శీర్షికతో గురువారం ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం తెలిసిందే. ఎంసెట్‌లో మంచి ర్యాంకుతో యూనివర్సిటీలు సహా ప్రముఖ కాలేజీల్లో సీట్లు పొందిన వారు వెబ్ జాయినింగ్ రిపోర్టు ఇవ్వడంతో ఆ సీట్లు భర్తీ అయినట్లుగా ‘లాక్’ అయ్యాయి.
ఇలా సీట్లను పొందిన వారిలో కొందరు జేఈఈ మెయిన్స్, అడ్వాన్డ్స్ పరీక్షల్లో కూడా ర్యాంకులు సాధించి ఎన్‌ఐటీ, ఐఐటీ వంటి సంస్థల్లో చేరుతున్నా ఎంసెట్‌లో ఆ సీట్లు వారిపేరిటే కొనసాగుతున్నాయి. వాటిని మలివిడత కౌన్సెలింగ్‌లో చేర్చడం లేదు. దీంతో ఆ సీట్లు దక్కాల్సిన తదుపరి మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ కథనంలో సోదాహరణంగా వివరించింది. దీంతో ఈ పరిస్థితిని సరిదిద్దడానికి అడ్మిషన్ల కమిటీ శుక్రవారం చర్యలు చేపట్టింది.
మొదటి రెండు విడతల్లో సీట్లు పొందిన వారంతా శనివారం (25వ తేదీ) లోగా ఆయా కాలేజీల్లో జాయినింగ్ రిపోర్టును తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేసింది. అలా రిపోర్టు చేయనివారి స్థానాలను ఖాళీలుగా భావించి తుది విడత కౌన్సెలింగ్‌లో చేరుస్తామంది. ఈ నెల 28, 29 తేదీల్లో మూడో విడత కౌన్సెలింగ్ నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. దీనిపై కన్వీనర్ బి.ఉదయలక్ష్మి శుక్రవారం పత్రికా ప్రకటన విడుదలచేశారు.
ఎంసెట్ ‘మిగులు’పై మేల్కొన్నారు!
Published Sat, Jul 25 2015 2:44 AM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM
Advertisement
Advertisement