కోటగుమ్మం(రాజమండ్రి): కాపుల్లోని పేదలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లకు తోడుగా మరిన్ని నిధులు కేటాయిస్తే సరిపోతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. 1993లో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి కాపులను బీసీల్లో చేర్చగా హైకోర్టు ఆ నిర్ణయాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు.
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న ఛలో పార్లమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 14 నుంచి 16 వరకూ వేలాది మందితో పార్లమెంట్ వద్ద ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సేకరించిన గణాంకాల ప్రకారం పార్లమెంటు సభ్యులు, అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, ఇతర రాజకీయ రంగాల వివరాలు సేకరిస్తే బీసీల ప్రాతినిధ్యం 12 శాతం దాటలేదన్నారు. 68 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు 12 శాతం ప్రాతినిధ్యం దాటకపోవడమే రాజకీయ రిజర్వేషన్లు ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకతను తెలియచేస్తోందన్నారు.
'కాపులకు మరిన్ని నిధులు కేటాయిస్తే చాలు'
Published Sun, Dec 6 2015 9:09 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM
Advertisement
Advertisement