30 వేల మంది పహారా
ముంబై: అత్యంత కట్టుదిట్టమైన పోలీసు పహారా మధ్య గురువారం సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో మెరైన్ లైన్స్‌లోని బడా ఖబ్రస్థాన్‌లో యాకూబ్ మెమన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నాగ్‌పూర్‌నుంచి తీసుకొచ్చాక మహిమ్‌లోని ఆయ న ఇంట్లో 2గంటల పాటు మృతదేహాన్ని ఉంచారు. కుటుంబీకులు, బంధువులు కడచూపు చూసుకున్నారు. ప్రార్థనలు చేశారు. అనంతరం మెరైన్ లైన్స్‌లోని శ్మశానవాటికకు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చనే ఉద్దేశంతో అంతిమయాత్రకుఅనుమతి నిరాకరించారు.
మీడియా చిత్రీకరణను కూడా నిషేధించారు. ఈ మార్గాన్ని పూర్తిగా భద్రతా బలగాలతో నింపేశారు. మొత్తం 30,000 మంది పోలీసులను మోహరించారు. 4.15 గంటలకు శ్మశానవాటికకు మృతదేహం చేరుకునే సమయానికి ముంబైలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. అయితే లోపలికి అనుమతించే ముందు ప్రతి ఒక్కరినీ మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ చేసి వదిలారు. అయితే జనం రద్దీ పెరగడంతో తర్వాత ఈ ప్రక్రియను నిలిపివేశారు. 5.15 కల్లా అంత్యక్రియలు ముగిశాయి. నేరచరిత కలిగిన 526 మంది ని ముంబై పోలీసులు బుధవారమే ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు.