ప్లూటోపై మంచు కొండలు!
వాషింగ్టన్: మరుగుజ్జు గ్రహం ప్లూటోపై భూమధ్య రేఖ ప్రాంతంలో 11 వేల అడుగుల (3,500 మీటర్లు) ఎత్తయిన మంచు కొండలు ఉన్నాయని న్యూ హారిజాన్స్ వ్యోమనౌక పంపిన ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది. సౌరకుటుంబం వయసు 456 కోట్ల ఏళ్లు కాగా.. ప్లూటోపై మంచుకొండలు 10 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయని, అందువల్ల వీటిని సౌరకుటుంబంలోనే అతి యుక్తవయసు మంచు పర్వతాలుగా భావించవచ్చని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్లూటోపై మంచుకొండలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉండవచ్చని, వీటిని బట్టి చూస్తే ప్లూటో ఇంకా భౌగోళికంగా క్రియాశీలంగానే ఉండవచ్చన్నారు. ప్లూటోను సమీపించకముందు న్యూ హారిజాన్స్ మంగళవారం 77 వేల కి.మీ. దూరం నుంచి ఈ మంచుకొండలను క్లోజ్-అప్ ఫొటో తీసిందని పేర్కొన్నారు.