ఈ మంచు ప్రాంతాలను చుట్టేసి రండి | 5 Places In India You Can See The Snow In January 2020 | Sakshi
Sakshi News home page

ఈ మంచు ప్రాంతాలను చుట్టేసి రండి

Published Wed, Jan 1 2020 6:08 PM | Last Updated on Wed, Jan 1 2020 6:21 PM

5 Places In India You Can See The Snow In January 2020 - Sakshi

భారత్‌లో ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో మంచు ప్రదేశాలు ప్రత్యేకమైనవి. మంచు ప్రదేశాలను ఇష్టపడని వారు ఉండరు. నూతన సంవత్సర వేడుకలకు వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేయాలనుకునే వారికి ఈ  ప్రదేశాలు ఎంతో ఆహ్లాదాన్నిఇస్తాయి. జనవరిలో మంచు అధికంగా ఉండటంతో చలికాలంలో పర్యాటానికి మంచు ప్రదేశాలు చక్కని ఆప్షన్‌.  ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశాలు భూలోక స్వర్గంలా కనిపిస్తాయి. మరి అలాంటి మంచు ప్రదేశాలు భారత్‌లో ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా.. ఇండియాలో ది బెస్ట్‌ మంచు ప్రదేశాలేంటో ఓసారి తెలుసుకుందాం..

1.గుల్మార్గ్‌(జమ్మూ-కశ్మీర్‌)
కశ్మీర్‌లోని అందమైన ప్రాంతాల్లో ఇదొకటి. గుల్మార్గ్‌ అంటే మంచు పూలదారి అని అర్థం. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్‌ ప్రాంతమంతా శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. గుల్మార్గ్‌ ప్రాంతం అందం వర్ణించలేనిది. ఇక్కడి స్ట్రాబెర్రీ లోయలు, బయో స్పియర్‌ రిజర్వులు, గోల్ఫ్ కోర్స్, మహారాణి టెంపుల్‌ తదితర ప్రాంతాలు పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. జనవరిలో ఇక్కడ మంచు కురిసే అవకాశం ఉంటుంది. అందుకే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చూడటానికి క్యూ కడతారు. వింటర్‌ సీజన్‌లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్కేటింగ్‌, స్కీయింగ్‌ కూడా చేయవచ్చు. 

2. ఔలి( ఉత్తరాఖండ్‌)
ఉత్తరాఖండ్‌లో ఉన్న ఔలి ప్రాంతం గర్వాలీ రీజియన్‌. రాష్ట్రంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఔలి ఒకటి. ఔలి అంటే పచ్చిక బయలు అని అని అర్థం. అంటే మంచు కొండల్లో ఉన్న పచ్చిక నేల అని. శీతాకాలంలో ఈ పచ్చదనాన్ని మంచు కప్పేస్తుంది. స్నో ఫాల్‌ చూడాలనుకునే వారికి ఇది చక్కని గమ్యస్థానం. స్కీ యింగ్ వంటి ఆటలు కూడా ఆడవచ్చు. ఔలి ప్రాంతానికి వెళ్తుంటే దారి వెంబడి ప్రవహించే నదులు కనిపిస్తాయి. ఈ నీరంతా మంచు కరిగిన నీరే. ఈ నదులు ఔలికి చేరుకునే పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. 

3.సోనా మార్గ్‌(జమ్మూ-కశ్మీర్‌)
సోనా మార్గ్‌ అంటే బంగారు మైదానం అని అర్థం. సోనా మార్గ్‌ పట్టణం అంతా మంచు  పర్వతాలతో కప్పబడి ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ పూసే బంగారు వర్ణపు పువ్వుల వల్ల ఈ ప్రాంతానికి సోనామార్గ్‌ అనే పేరు వచ్చింది. ఇక్కడ ట్రెక్కింగ్‌, హైకింగ్‌​ వంటి సాహస క్రీడలు పర్యాటకుల ఆసక్తిని పెంచుతాయి. జనవరి మొదటి 15 రోజులు ఇక్కడ మంచు కురుస్తుంది. ముఖ్యంగా అన్ని ట్రెక్కింగ్‌ మార్గాలు సోనామార్గ్‌ నుంచే మొదలవుతాయి. చుట్టు ఉన్న కొలనులు, పర్వతాలు, సహజ ప్రకృతి సౌందర్యం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. శీతాకాలంలో ఈ ప్రాంతపు ఉష్ణోగ్రత జీరో డిగ్రీల కంటే తక్కువగా నమోదవ్వడం వల్ల వాతావరణమంతా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

4. మనాలి( హిమచల్‌ ప్రదేశ్‌)
మనాలి ప్రాంతం రాజధాని షిమ్లా నుంచి 260 కి. మీ దూరంలో ఉంది. అందమైన మనాలి ప్రాంతం మంచు యొక్క స్వర్గధామం. ఇది హనీమూన్‌ స్పాట్‌ కూడా. ఇక్కడ స్కీయింగ్‌, స్కేట్‌ బోర్డింగ్‌, స్లోప్‌ స్లెడ్జింగ్‌ వంటి మంచు క్రీడలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. మనాలిలో రోహతాంగ్‌ పాస్‌, చంద్రఖని పాస్‌, సోలాంగ్‌ లోయ, సుల్తాన్‌పుర ప్యాలెస్‌ వంటి ప్రదేశాలు చుట్టేయవచ్చు.

 

5. యామ్‌ తాంగ్‌ ( సిక్కిం)
సిక్కిం పర్యాటక ప్రదేశాలలో యామ్తాంగ్‌ అందమైన పర్వత లోయ ప్రముఖంగా నిలుస్తుంది. దీనిని పువ్వుల లోయ అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 9 వేల అడుగుల ఎత్తులో ఈ వ్యాలీ ఉంటుంది. ఇక్కడికి దగ్గర్లోనే చైనా, టిబెట్ సరిహద్దులు ఉంటాయి. దేశంలోని ఈశాన్య వైపున ఉన్న ఈ అందమైన ప్రదేశంలో జనవరిలో మంచు కురుస్తుంది. ఇక్కడికి దగ్గర్లోనే జీరో పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి ప్రత్యేక అనుమతి అవసరం.

న్యూ ఇయర్‌కు మంచు పర్వతాలను చుట్టేసి రావడానికి జనవరి సరైన సమయం. ఇక ఆలస్యం ఎందుకు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఓ రౌండ్‌ వేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement